ఒంటికాలితోనైనా పాక్‌పై ఆడుతా..

2019 వరల్డ్‌ కప్‌లో ఆడబోయే భారత జట్టులో మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీకి స్థానముంటుందా? ఉండదా? అన్న చర్చ ఇప్పుడు కొనసాగుతోంది. ధోనీకి చోటుపై సెలెక్టర్లు ఇప్పడే ఏమీ చెప్పకపోయినా.. అతను ఉండీ తీరాల్సిందేనని వీరేంద్ర సెహ్వాగ్‌ వంటి సీనియర్‌ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ చర్చ నేపథ్యంలోనే ధోనీ ఇటీవల శ్రీలంకతో ఆడిన రెండు, మూడో వన్డేలలో రాణించి విమర్శకుల నోటికి తాళం వేశాడు. క్లిష్ట సమయాల్లో జట్టును విజయతీరాలకు (మ్యాచ్‌ ఫినిషింగ్‌) చేర్చే బాధ్యతను తీసుకోవడంలో తనకు తానే సాటని మరోసారి నిరూపించుకున్నాడు.

ఈ నేపథ్యంలో ఇటీవల మీడియాతో మాట్లాడిన భారత క్రికెట్‌ జట్టు చీఫ్ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ ధోనీ గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. గత ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా ధోనీ గాయపడ్డప్పటి సందర్భాన్ని ఆయన వివరించారు. 'అర్ధరాత్రి జిమ్‌లో కసరత్తులు చేస్తున్న సమయంలో ధోనీ వెయిట్‌ ఎత్తబోతుండగా.. వెన్నులో పట్టుకున్నట్టు అయింది. దీంతో అతను బరువు వదిలేశాడు. అదృష్టంకొద్దీ ఆ బరువు అతనిపై పడలేదు. కానీ, అతను నడవలేకపోయాడు. దాదాపు పాకుతూ అల్లారం బెల్‌ మోగించాడు. వైద్య సిబ్బంది వెంటనే వచ్చి అతనికి ప్రథమ చికిత్స అందించి.. స్ట్రేచర్‌పై తీసుకెళ్లారు. అప్పట్లో సెలెక్టర్‌గా ఉన్న నేను ఢాకాకు చేరుకోగానే ధోనీకి ఏమైంది అన్న ప్రశ్న విలేకరుల నుంచి ఎదురైంది. నా వద్ద సమాధానం లేదు. పాకిస్థాన్‌కు మ్యాచ్‌ ఎంతో కీలకమైనది. ఏమైందో తెలుసుకోవడానికి నేను ధోనీ గదికి వెళ్లాను. 'ఆందోళన చెందకండి ఎమ్మెస్కే భాయ్‌' అంటూ ధోనీ చెప్పాడు.

నేను ఎన్నిసార్లు అడిగినా అదే చెప్పాడు. కానీ చాలా కీలకమైన మ్యాచ్‌ కావడంతో మాపై ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. ఆ తెల్లారి నేను ధోనీ గదికి వెళ్లాను. అప్పుడు కూడా ఆందోళనేమీ వద్దని ధోనీ చెప్పాడు. (ఒక సెలెక్టర్‌గా) ధోనీ మాటలను నేను తేలిగ్గా తీసుకోలేకపోయాను. వెంటనే అప్పటి చీఫ్‌ సెలెక్టర్‌ సందీప్‌ పాటిల్‌కు ఫోన్‌ చేసి మాట్లాడాను. ధోనీ స్థానంలో ఆడేందుకు వెంటనే పార్థీవ్‌ పటేల్‌ను సాయంత్రంకల్లా ఢాకా పంపారు. అతను జట్టుతో చేరాడు. ఆ రాత్రి 11 గంటల సమయంలో నేను ధోనీ గదికి వెళ్లాను. అతను అక్కడ లేడు. స్మిమ్మింగ్‌పూల్‌ సమీపంలో నడిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. దాదాపు పాకుతున్నట్టు అతని పరిస్థితి ఉంది. తను నడిచేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పాడు. నడవడానికే ఇంత కష్టపడుతున్న అతను మ్యాచ్ ఆడగలనని ఎలా నేను అనుకుంటుండగా.. ధోనీ నావంక చూస్తూ 'మీరేమీ ఆందోళన చెందకండి. నాకు చెప్పకుండానే పార్థీవ్‌ను పిలిపించుకున్నారు. మీరు సేఫ్‌గా ఉన్నారు' అన్నాడు'అని ఎమ్మెస్కే వివరించారు.

మ్యాచ్‌ జరిగే రోజు ఆశ్చర్యకరంగా ధోనీ ప్యాడ్లు కట్టుకొని సిద్ధమయ్యాడని తెలిపారు. 'మధ్యాహ్నం జట్టు ప్రకటించేముందు ధోనీ డ్రెస్‌ చేసుకొని సిద్ధమయ్యాడు. అతను నన్ను తన రూమ్‌కు పిలిచి.. ఎందుకింత ఆందోళన చెందుతున్నావని అడిగాడు. 'నాకు ఒక కాలు లేకపోయినా ఒంటికాలితోనైనా నేను పాకిస్థాన్‌పై ఆడుతాను' అని ధోనీ చెప్పాడు' అని ఎమ్మెస్కే గుర్తుచేసుకున్నారు. ధోనీ అంటే ఏమిటో, మ్యాచ్‌ పట్ల అతని నిబద్ధత ఏమిటో చాటడానికి ఇది నిదర్శనమన్నారు. ఈ మ్యాచ్‌లో ధోనీ ఆడటమే కాకుండా తన సారథ్యంలో దాయాదిపై విజయాన్ని అందించాడు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top