ఆ ఇద్దరూ అద్భుతంగా ఆడారు: కోహ్లీ

న్యూఢిల్లీ: మూడో వన్డేలో అద్భుతంగా ఆడి.. విజయంతోపాటు భారత్‌కు సిరీస్‌ను అందించిన రోహిత్‌శర్మ, మహేంద్రసింగ్‌ ధోనీపై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రశంసల జల్లు కురిపించాడు. పల్లెకెలేలో ఆదివారం జరిగిన మూడో వన్డేలో మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక భారత్‌కు 218 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. స్వల్ప లక్ష్యమే అయినా ఆరంభంలోనే విరాట్‌ కోహ్లి, శిఖర్‌ ధావన్‌ వికెట్లు కోల్పోవడంతో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత కేఎల్‌ రాహుల్‌తో కలిసి రోహిత్‌ మూడో వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు. అనంతరం అకిల ధనుంజయ రెండు వికెట్లు వెనువెంటనే తీయడం భారత్‌ను కష్టాల్లో నెట్టేసింది. ఈ దశలో శతకం బాదిన రోహిత్‌ శర్మ (124 నాటౌట్‌), 67 పరుగులు చేసిన ధోనీ ఐదో వికెట్‌కు అజేయంగా 157 పరుగులు జోడించి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ ఇద్దరి బ్యాటింగ్‌ తీరును కెప్టెన్‌ కోహ్లి ప్రశంసలతో ముంచెత్తాడు.

'స్పల్ప లక్ష్యాలను ఛేదించడమే కొంచెం చిక్కుముడిగా ఉంటుంది. రెండుమూడుసార్లు స్పల్ప లక్ష్యాలను ఛేదించడంలో విఫలమైతే.. మిమ్మల్ని విమర్శించేవారికి కొదువ ఉండదు. గతంలోనూ స్పల్ప లక్ష్యాలను మేం సునాయసంగా ఛేదించాం. ఇక్కడి వికెట్‌ కొంత సవాలుతో కూడుకున్నది. గత మ్యాచ్‌లో మేం దాదాపుగా కుప్పకూలాం. కానీ మ్యాచ్‌లో అలా జరగలేదు. బ్యాట్స్‌మన్‌ శ్రద్ధగానే ఆడారు. రోహిత్‌ అద్భుతంగా ఆడాడు. ధోనీ ఎప్పటిలాగే గొప్ప ఆటతీరు కనబరిచాడు' అని కోహ్లి ప్రశంసించాడు. ఐదు వికెట్లు పడగొట్టిన బౌలర్‌ జస్ప్రీత్‌ బూమ్రాను సైతం కోహ్లి కొనియాడాడు. మిగతా రెండు వన్డేల్లో రిజర్వ్‌ బెంచ్‌కు అవకాశం కల్పిస్తామని కోహ్లి సంకేతాలు ఇచ్చాడు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top