రో‘హిట్‌’ ఇన్నింగ్స్‌ వెనుక సచిన్‌

ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ సారథి రోహిత్ శర్మ మొదటి మూడు మ్యాచ్‌ల్లో కలిపి చేసిన పరుగులు 44. ఈ గణాంకాలు చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇదేంటి రోహిత్‌ ఇలా ఆడుతున్నాడు అని నిరాశ చెందారు. కానీ, ఆ తర్వాత రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 94 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శన చూసిన అభిమానులు హమ్మయ్య రోహిత్‌ తిరిగి ఫామ్‌లోకి వచ్చేశాడు అని తెగ సంబరపడిపోయారు.

అంతకుముందు అదే మైదానంలో తక్కువ పరుగులకే పెవిలియన్‌ బాటపట్టిన రోహిత్‌ తర్వాత ఎలా పుంజుకున్నాడు... ఎవరి బౌలింగ్‌లో ప్రాక్టీస్‌ చేశాడో తెలుసా. భారత మాజీ క్రికెటర్‌, ముంబయి ఇండియన్స్‌ మెంటార్‌ సచిన్‌ తెందుల్కర్‌ తనయుడు అర్జున్‌ తెందుల్కర్‌ బౌలింగ్‌లో. ప్రాక్టీస్‌ సెషన్స్‌లో రోహిత్‌.. అర్జున్‌ తెందుల్కర్‌తో బంతులేయించుకున్నాడు. ఎందుకంటే రోహిత్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో కాస్త ఇబ్బంది పడతాడు. దీన్ని అధిగమించేందుకే అర్జున్‌ సాయం తీసుకున్నాడు. అంతేకాదు బెంగళూరుతో మ్యాచ్‌కు ముందు రోహిత్‌.. సచిన్‌ నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకున్నాడు. వీటన్నింటినీ మ్యాచ్‌లో అమలు చేశాడు. సచిన్‌ సలహాలు, అర్జున్‌తో బంతులేయించుకుని ప్రాక్టీస్‌ చేయడం రోహిత్‌కు ఎంత ఉపయోగపడిందో ఆ ఇన్నింగ్స్‌ చెప్పకనే చెబుతుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ విధ్వంసం సృష్టించాడు. 52 బంతుల్లో 94 పరుగులు చేశాడు. ఇందులో 10ఫోర్లు, 5 సిక్స్‌లు బాదాడు.

ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ ఎలా ఆడతాడో చూడాలనే కాబోలు అర్జున్‌ స్వయంగా మైదానానికి వచ్చి మ్యాచ్‌ వీక్షించాడు. ఏది ఏమైనా ముంబయి ఇండియన్స్‌ ఆడే తదుపరి మ్యాచ్‌ల్లోనూ రోహిత్‌ ఇదే ప్రదర్శన కొనసాగించాలని కోరుకుందాం.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top