రహానేకు చోటు లేకపోవడమా?

శ్రీలంకతో వన్డే సిరీస్‌ ఫలితం తేలిపోవడంతో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారత జట్టు ఏమైనా ప్రయోగాలు చేస్తుందో లేదో ఆసక్తికరంగా మారింది. ఒకవేళ మార్పులు చేసినా జట్టు సమతుల్యం దెబ్బకుండా జాగ్రత్త పడాలి. అయితే రిజర్వ్‌ బెంచ్‌లో ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో వరుస విజయాలు సాధిస్తున్న జట్టులో మార్పులు చేయాలనుకుంటే అది అవివేకమే అవుతుంది. తొలి మూడు వన్డేల్లో ఆడని నలుగురు ఆటగాళ్లలో ఇద్దరు మాత్రం తుది జట్టులో తమకు ఆడే సత్తా ఉందని... ప్రయోగాల పేరుతో తమకు ఆడే అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు. మనీశ్‌ పాండే, కుల్దీప్‌ యాదవ్‌లాంటి అపార నైపుణ్యమున్న ఇద్దరు ఆటగాళ్లు డ్రింక్స్‌ తేవడానికి పరిమితమయ్యారంటే భారత జట్టు ఎంత పటిష్టంగా ఉందో అర్ధమవుతోంది. అడపాదడపా అందివచ్చిన అవకాశాలను వీరిద్దరు సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభను చాటుకున్నారు.

అయితే అజింక్య రహానే పరిస్థితి ఏమిటి? ఈపాటికే తానేంటో నిరూపించుకున్నా... ఇన్నింగ్స్‌ సాఫీగా సాగిపోయేలా రహానే ఆటతీరు ఉండటంలేదని భావించి అతడిని పక్కనబెట్టారనిపిస్తోంది. భారీ సిక్సర్లు కొట్టే నైపుణ్యం రహానేలో లేకపోయినా కళాత్మక షాట్‌లతో అతను కొట్టే బౌండరీలతో పరుగులు నిలకడగా వస్తుంటాయి. జట్టులో నిలదొక్కుకొని గాయాల కారణంగా మ్యాచ్‌లకు దూరమై... పునరాగమనం చేసే సందర్భంలో వారికే చోటు కల్పించడం, ఒకే స్థానంలో బాగా ఆడిన వారిని అదే స్థానంలో కొనసాగించడం భారత జట్టు విధానంగా ఉంది. అయితే జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్న ఆటగాళ్లకు సమాన ప్రతిభ ఉన్న ఆటగాళ్లు కూడా కనిపిస్తుంటారు. విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో నిలకడగా రాణించినప్పటికీ రహానేకు ఈ సిరీస్‌లో తుది జట్టులో చోటు లభించడంలేదు. ప్రస్తుతం భారత్‌ వరుస విజయాలు సాధిస్తుండటంతో ఎవరూ ఎలాంటి ప్రశ్నలు వేయడంలేదు. బాగా ఆడి కూడా తుది జట్టులో స్థానం లభించకపోవడం వేరే ఆటగాళ్లకు తప్పుడు సంకేతాలు ఇస్తుంది. సునీల్‌ గావస్కర్‌

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top