విరాట్ పై పాక్‌ ఫ్యాన్స్‌ ప్రశంసలు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ చేతులో ఘోర పరాజయం పొంది చాంపియన్స్‌ ట్రోఫీని కోల్పోయి భారతీయులతో తిట్లు తిన్నా పాకిస్థాన్‌ క్రికెట్‌ అభిమానుల మనసులను మాత్రం టీమిండియా కెప్టెన్‌ వీరాట్‌ కోహ్లీ కొళ్లకొట్టాడు. ఓటమి అనంతరం కెప్టెన్‌ హోదాలో అతడు ఇచ్చిన స్పీచ్‌కు పాక్‌ క్రికెట్‌ అభిమానులు ఫిదా అయ్యారు. తమపై సముచిత గౌరవాన్ని ప్రకటించిన కోహ్లీ నిజమైన ఆడగాడని, అసలైన కెప్టెన్‌ అంటూ వారు ట్వీట్ల వర్షం కురిపించారు. ఆదివారం జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్థాన్‌తో తలపడిన భారత్‌ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. మ్యాచ్‌ ముగిశాక కెప్టెన్‌ కోహ్లీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

‘ తుది ఫలితం మాకు నిరాశ కలిగించినా ఫైనల్‌ చేరడం సంతృప్తినిచ్చింది. మేం ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకోలేదు కానీ పాకిస్తాన్‌ మరింత పట్టుదలతో ఆడింది. బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లో కూడా వారు దూకుడు కనబర్చారు. తమదైన రోజున పాక్‌ ఎవరినైనా ఓడించగలదని మళ్లీ రుజువైంది. టోర్నీలో వారు కోలుకున్న తీరు అద్భుతం. హార్దిక్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. బుమ్రా నోబాల్‌లాంటి చిన్న పొరపాట్లు కూడా ఒక్కోసారి పెద్దగా మారిపోతాయి. మా బలం (ఛేజింగ్‌)పై నమ్మకముంది. కానీ ఈసారి అది సరిపోలేదు. అయితే మేం ఓడింది ఒక్క మ్యాచ్‌ మాత్రమే. తప్పులు సరిదిద్దుకొని ముందుకు వెళతాం.

ఈ సందర్భంగా విజయం సాధించిన పాక్‌కు నేను అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను. అన్ని పరిస్థితులు వారికి అనుగుణంగా మారిపోయాయి. మేం కొంత నిరుత్సాహపడిన ఇప్పటికీ నా ముఖంలో చిరునవ్వుందంటే కారణం మేం ఫైనల్‌కు చేరడం సంతృప్తి నిచ్చింది. ఫఖార్‌ జమాన్‌ లాంటి ఆటగాళ్లకు ఒక రోజంటూ వచ్చినప్పుడు వారిని అపడం కష్టమవుతుంది. ఎందుకంటే అతడు ఆడిన 80శాతం షాట్లు కూడా హై రిస్క్‌తో కూడుకున్నవి. ఒక బౌలర్‌గా, కెప్టెన్‌గా ఇలాంటిది జరుగుతున్నప్పుడు కలిసొచ్చే రోజున దేన్నయినా మార్చేందుకు ఈ ఒక్కడు చాలేమో అనిపిస్తుంది’ అని అన్నాడు.

ఈ స్పీచ్‌కు ఫిదా అయిన పాక్‌ క్రికెట్‌ అభిమానులు మ్యాచ్‌ ముగిశాక కోహ్లీ స్పీచ్ సూపర్‌ అన్నారు. ‘ధన్యవాదాలు కోహ్లీ.. మ్యాచ్‌ ముగిశాక నువు చేసిన ప్రకటనతో ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నావు. నువ్వు చాలా గొప్ప ఆటగాడివి. జెంటిల్‌మెన్‌వి కూడా’... మాకోసం మంచి మనసుతో నువ్వు చెప్పిన మాటలకు ధన్యవాదాలు, ఇండియా టీమ్‌ చాలా గొప్పది.. కోహ్లీ ఇంటర్వ్యూలో నిజమైన క్రీడాకారుడిగా స్ఫూర్తినిచ్చారు’ అంటూ ఇలా పలు ట్వీట్లు కురిపించారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top