యూఎస్ ఓపెన్‌లో షరపోవా సంచలనం

న్యూయార్క్‌: డోపింగ్‌ కారణంగా 15 నెలల పాటు ఆటకు దూరమైనా... తన ఆటతీరులో ఏమాత్రం పదును తగ్గలేదని రష్యా టెన్నిస్‌ స్టార్‌ మరియా షరపోవా నిరూపించుకుంది. సీజన్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌లో ఈ మాజీ నంబర్‌వన్‌ ఘనంగా పునరాగమనం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో షరపోవా 6–4, 4–6, 6–3తో ప్రపంచ రెండో ర్యాంకర్, రెండో సీడ్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా)ను బోల్తా కొట్టించింది.

2 గంటల 45 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో షరపోవా ఖాతాలో 60 విన్నర్స్, 64 అనవసర తప్పిదాలు, ఏడు ఏస్‌లు, ఏడు డబుల్‌ ఫాల్ట్‌లు ఉన్నప్పటికీ... కీలక దశలో పాయింట్లు నెగ్గడం ఆమెకు కలిసొచ్చింది. మరోవైపు హలెప్‌ కేవలం 15 విన్నర్స్‌ సాధించింది. షరపోవా సర్వీస్‌ను పదిసార్లు బ్రేక్‌ చేసే అవకాశం వచ్చినా హలెప్‌ నాలుగుసార్లు మాత్రమే సఫలమైంది. తన సర్వీస్‌ను మాత్రం ఐదుసార్లు కోల్పోయింది. షరపోవా చేతిలో హలెప్‌కిది వరుసగా ఏడో పరాజయం. యూఎస్‌ ఓపెన్‌ తుది ఫలితం ద్వారా ఈసారి మహిళల సింగిల్స్‌లో ఏకంగా ఎనిమిది మందికి టాప్‌ ర్యాంకర్‌ అయ్యే అవకాశం ఉండగా... ఈ ఓటమితో హలెప్‌కు ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకర్‌ అయ్యే అవకాశం చేజారిపోయింది.

ఆరో సీడ్‌ కెర్బర్, ఏడో సీడ్‌ కొంటా అవుట్‌...

మరోవైపు ఆరో సీడ్‌ ఎంజెలిక్‌ కెర్బర్‌ (జర్మనీ), ఏడో సీడ్‌ జొహానా కొంటా (బ్రిటన్‌) తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. నవోమి ఒసాకా (జపాన్‌) 6–3, 6–1తో కెర్బర్‌ను... క్రునిక్‌ (సెర్బియా) 4–6, 6–3, 6–4తో కొంటాను ఓడించి సంచలనం సృష్టించారు. గత ఏడాది రన్నరప్, ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో ప్లిస్కోవా 6–2, 6–1తో మగ్దా లినెట్టి (పోలాండ్‌)పై అలవోకగా గెలిచింది. ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్, తొమ్మిదో సీడ్‌ వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా) 6–3, 3–6, 6–2తో కుజ్‌మోవా (స్లొవేకియా)పై, 23వ సీడ్‌ స్ట్రికోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6–1, 6–3తో మిసాకి దోయి (జపాన్‌)పై గెలిచారు.

పురుషుల సింగిల్స్‌లో మాజీ చాంపియన్, ఐదో సీడ్‌ మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా), నాలుగో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), ఎనిమిదో సీడ్‌ సోంగా (ఫ్రాన్స్‌), పదో సీడ్‌ జాన్‌ ఇస్నెర్‌ (అమెరికా) రెండో రౌండ్‌లోకి ప్రవేశిం చారు. తొలి రౌండ్‌లో సిలిచ్‌ 6–4, 6–3, 3–6, 6–3తో సాండ్‌గ్రెన్‌ (అమెరికా)పై, జ్వెరెవ్‌ 7–6 (11/9), 7–5, 6–4తో డారియన్‌ కింగ్‌ (బార్బడోస్‌)పై, సోంగా 6–3, 6–3, 6–4తో కోపిల్‌ (రొమేనియా)పై, ఇస్నెర్‌ 6–1, 6–3, 4–6, 6–3తో హెర్బెర్ట్‌ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top