కోహ్లీ టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండో స్థానం

భారత పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి(893 పాయింట్లు) ఎగబాకాడు. శ్రీలంకతో మూడో టెస్టుకు ముందు కోహ్లీ ఐదో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. దిల్లీలో జరిగిన టెస్టులో కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో ద్విశతకంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో అర్ధశతకం సాధించడంతో మూడు స్థానాలు ఎగబాకి రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అంతకుముందు రెండో స్థానంలో ఉన్న భారత ఆటగాడు పుజారా తాజా ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు కోల్పోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

ఆస్ట్రేలియా సారథి స్టీవ్‌ స్మిత్‌ 938 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే లంక టెస్టు జట్టు సారథి దినేశ్‌ చండీమాల్‌ తన కెరీర్‌లో తొలిసారి టాప్‌-10లో చోటు దక్కించుకున్నాడు. 743 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. భారత ఆటగాళ్లు మురళీ విజయ్‌(25), రోహిత్‌ శర్మ(40) తమ స్థానాలను మెరుగు పరుచుకున్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ రికీ పాంటింగ్‌ మాత్రమే 2005-06 డిసెంబరు-జనవరి మధ్య అన్ని ఫార్మాట్లలో నంబర్‌వన్‌ స్థానాన్ని దక్కించుకున్నాడు. తర్వాత ఆసీస్‌కే చెందిన మాథ్యూ హెడెన్‌ ఈ ఘనతను అందుకున్నాడు. భవిష్యత్తులో స్మిత్‌-కోహ్లిలో ఎవరో ఒకరు ఈ ఘనతను అందుకునేలా కనిపిస్తున్నారు.

శ్రీలంకతో టెస్టు సిరీస్‌ ద్వారా బౌలర్ల జాబితాలో తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటాడని భావించిన రవీంద్ర జడేజా ఒక స్థానంలో కోల్పోయి 870 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. మరో ఆటగాడు రవిచంద్రన్‌ అశ్విన్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌ ఆటగాడు జేమ్స్‌ అండర్సన్‌ బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలోనూ జడేజా స్థానంలో ఎలాంటి మార్పులేదు. యథావిధిగా రెండో స్థానంలోనే నిలిచాడు.

ఇక జట్టు ర్యాంకింగ్స్‌ విషయానికి వస్తే శ్రీలంకపై 1-0తేడాతో సిరీస్‌ సొంతం చేసుకున్న భారత్‌ ఒక పాయింట్‌ కోల్పోయి 124 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top