ధోని 'ట్రిపుల్‌ సెంచరీ'

చిరస్మరణీయ సిక్సర్‌తో భారత్‌కు ప్రపంచ కప్‌ అందించిన ఇన్నింగ్స్‌... కొత్తగా వచ్చిన జులపాల జుట్టు కుర్రాడు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై ఆడిన మెరుపు బ్యాటింగ్‌... జైపూర్‌లో కెరీర్‌ అత్యుత్తమ ప్రదర్శన... ఒకటా, రెండా... మహేంద్ర సింగ్‌ ధోని వన్డేల్లో ఆడిన ఇలాంటి అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఎన్నో. ధోని ఉన్నాడంటే ఇక గెలిపించడం ఖాయమనే భరోసా... మరో ఎండ్‌లో ధోని ఉంటే చాలు, అవతలి బ్యాట్స్‌మన్‌కు అదో ధైర్యం... చివరి వరకు క్రీజ్‌లో నిలబడటం, తనదైన శైలిలో విన్నింగ్‌ షాట్‌తో మ్యాచ్‌ను ‘ఫినిష్‌’ చేయడం ఎన్ని సార్లు చూసినా తనివి తీరని దృశ్యమే. దాదాపు 12 ఏళ్ల కెరీర్‌లో వన్డేల్లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా ఎదిగి, ఎన్నో రికార్డులు తన పేర లిఖించుకున్న ‘మిస్టర్‌ కూల్‌’ నేడు మరో మైలురాయిని దాటుతున్నాడు. తన వన్డే కెరీర్‌లో అతను 300వ మ్యాచ్‌ ఆడబోతున్నాడు.

ధోని సాంకేతికంగా గొప్ప బ్యాట్స్‌మన్‌ కాదు. ఇది తానే స్వయంగా ఒప్పుకునే విషయం. అయితే అతను తనదైన శైలితోనే బ్యాటింగ్‌లో అద్భుతాలు చేశాడు. వేలాది పరుగులు సాధించినా, సిక్సర్లతో హోరెత్తించినా, అవసరమైనప్పుడు పట్టుదలగా ఇన్నింగ్స్‌ను నిర్మించినా అదంతా ధోని స్టైల్‌లోనే. అద్భుతమైన వికెట్‌ కీపర్‌ కాదు. అంతా సొంతంగా నేర్చుకున్నదే. అయినా కీపింగ్‌ రికార్డులు అతని చెంత వాలాయి. కెప్టెన్సీలో కూడా ఎవరికీ సాధ్యం కాని రీతిలో గుర్తుండిపోయే వ్యూహాలతో గొప్ప విజయాలు అందించాడు. నాయకుడిగా తప్పుకున్న తర్వాత వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా ఇప్పటికీ తనదైన ముద్ర చూపిస్తున్న మాహి, 2019 వరల్డ్‌ కప్‌ వరకు కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

►21 మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు

► 6 మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు

►2 రెండు సార్లు (2008, 09) ఐసీసీ వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డులు

► 6 300 వన్డేలు ఆడిన ఆరో భారత క్రికెటర్‌. ఓవరాల్‌గా 20వ ఆటగాడు.

► 3 ధోని 300 వన్డేల్లో 3 మ్యాచ్‌లు ఆసియా ఎలెవన్‌ తరఫున ఆడినవి ఉన్నాయి. ఆఫ్రికా ఎలెవన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లలో ధోని 1 సెంచరీ సహా 174 పరుగులు సాధించాడు.

► 0 తొలి వన్డేలో ఒకే ఒక బంతిని ఎదుర్కొని రనౌట్‌ (డకౌట్‌) అయ్యాడు.

ధోని టాప్‌–5 వన్డే ఇన్నింగ్స్‌

►183 నాటౌట్‌ (శ్రీలంక; జైపూర్‌–2005)

►148 (పాకిస్తాన్‌; విశాఖపట్నం–2005)

► 139 నాటౌట్‌ (ఆఫ్రికా ఎలెవన్‌; చెన్నై – 2007)

►139 నాటౌట్‌ (ఆస్ట్రేలియా; మొహాలి – 2013)

►134 (ఇంగ్లండ్‌; కటక్‌–2017)

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top