ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా భారత్‌ ఆడాలి

సఫారీ పర్యటనలో భారత జట్టు మరో పరీక్షకు సిద్ధమైంది. తొలి టెస్టులో అందివచ్చిన అవకాశాలను చేజార్చుకున్న విరాట్‌ కోహ్లి బృందం అలాంటి తప్పిదాలే పునరావృతం చేస్తే మాత్రం టెస్టుతోపాటు సిరీస్‌నే చేజార్చుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా భారత్‌ ఆడాల్సిన అవసరముంది. టెస్టుల్లో విజయానికి కీలకం పటిష్ఠ బ్యాటింగ్‌ పునాది. ఓపెనర్లలో ఒకరు, వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ నిలదొక్కుకుంటే తర్వాత వచ్చేవారు తలోచేయి వేసినా ఓ మాదిరి స్కోరు సాధించవచ్చు. కానీ కేప్‌టౌన్‌లో భారత్‌ను నిలబెట్టడంలో టాపార్డర్‌ విఫలమైంది. ఓపెనర్లయితే పూర్తిగా నిరాశపరిచారు. విదేశాల్లోనూ ఆడగలడని పేరున్న మురళీ విజయ్‌ తడబడ్డాడు. పుల్‌ షాట్లు ఆడబోయి వికెట్‌ ఇచ్చుకున్న శిఖర్‌ ధావన్‌ తీరును అందరూ తప్పుబట్టారు. మరో ‘వాల్‌’ పుజారా తన సామర్థ్యానికి న్యాయం చేయలేకపోయాడు. అయినప్పటికీ కోహ్లి వ్యూహం ప్రకారం ఎడమ చేతివాటం కాబట్టి ధావన్‌కు మరో అవకాశం దక్కొచ్చని భావిస్తున్నారు. ఒకవేళ రాహుల్‌ను తీసుకుంటే అది అనూహ్య నిర్ణయమే అవుతుంది. మరోవైపు గత 8 ఏళ్లలో దక్షిణాఫ్రికాలో విదేశీ జట్ల టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ సగటు 25.29 మాత్రమే కావడం గమనార్హం. మిగతా దేశాలతో పోలిస్తే ఇదే అత్యల్పం. ఈ నేపథ్యంలో భారత్‌ రాత మారాలంటే టాపార్డర్‌లో ఒకరు రాణించాల్సిందే.

రోహిత్‌ ఉంటాడా?

తొలి టెస్టు ఫలితంతో ఎక్కువగా విమర్శలకు గురైంది రోహిత్‌ శర్మ. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అదరగొట్టి, రహానే వంటి బ్యాట్స్‌మన్‌ స్థానంలో టెస్టు జట్టులోకి వచ్చినా పేలవ ఆటతీరు కనబర్చాడు. లోయర్‌ ఆర్డర్‌తో కలిసి అతడు ఎంతోకొంత ప్రతిఘటన కనబర్చినా తన ఎంపిక తప్పు కాదని చాటి ఉండేవాడు. కానీ అతడి ప్రదర్శన రెండో టెస్టుకు మరో మాట లేకుండా తప్పించాలన్నంతగా సాగింది. దీంతో రహానే రాక ఖాయమని భావించారు. కానీ పరిస్థితులు రోహిత్‌ సెంచూరియన్‌లో కూడా ఆడేలా కనిపిస్తున్నాయి. మరి ఈసారైనా నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడేమో చూడాలి. తొలి టెస్టులో టాపార్డర్‌కంటే లోయర్‌ ఆర్డర్‌ ఎక్కువ పరుగులు చేసింది. ఈసారీ లోయర్‌ ఆర్డర్‌ రాణిస్తే భారత్‌కు అది సానుకూలాంశమే అవుతుంది.

బౌలింగ్‌ బెంగ లేదు...

షమీ, భువనేశ్వర్, బుమ్రా తొలి టెస్టులో ఆకట్టుకున్నారు. శుక్రవారం నెట్స్‌లో ఉమేశ్‌ యాదవ్‌ తీవ్రంగా శ్రమించాడు. దీన్ని బట్టి బౌన్స్‌ బాగా ఉండే సూపర్‌ స్పోర్ట్‌ పార్క్‌లో అవసరమైతే ఉమేశ్‌ను తీసుకునే ఆలోచన చేస్తారేమో కానీ ఈ బృందాన్ని మార్చకపోవచ్చు. స్వింగ్‌తో భువీ, వైవిధ్యంతో బుమ్రా, పేస్‌తో షమీ చెలరేగితే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు కష్టమే. లోయర్‌ ఆర్డర్‌తో సహా ప్రొటీస్‌ జట్టు భాగస్వామ్యాలను వీరు ఎంత తొందరగా విడదీస్తే జట్టుకు అంత మేలు చేసినవారవుతారు.

సఫారీలకు అంతా అనుకూలమే

సిరీస్‌లో ముందంజ వేసిన సఫారీ జట్టుకు రెండో టెస్టు వేదిక మరింత బలాన్నిచ్చేదే. ఇక్కడ 22 టెస్టులాడితే ఆ జట్టు 17 మ్యాచ్‌ల్లో నెగ్గింది. కేవలం రెండే ఓడింది. అదీ పేస్‌ను దీటుగా ఆడే ఇంగ్లండ్‌ (2000), ఆస్ట్రేలియాలపై (2014) మాత్రమే. భారత్‌ ఇక్కడ ఏకైక టెస్టును 2010–11 సిరీస్‌లో ఆడి ఇన్నింగ్స్, 25 పరుగులతో ఓడింది. ఇక జట్టుగా చూసుకుంటే సఫారీలకు పెద్దగా సమస్యలు లేవు. కేప్‌టౌన్‌లో టాపార్డర్‌ విఫలమైనా ఆ లోటును డివిలియర్స్, కెప్లెన్‌ డు ప్లెసిస్, కీపర్‌ డికాక్‌ల ‘డి త్రయం’ పూరించింది. లోయర్‌ ఆర్డర్‌లో రబడ, ఫిలాండర్, కేశవ్‌ మహరాజ్‌లు మ్యాచ్‌ ఫలితాన్ని శాసించే విలువైన పరుగులు జోడించారు. డేల్‌ స్టెయిన్‌ దూరమైనా అదేమంత ఇబ్బందిగా కనిపించడం లేదు. అందరూ ఫిలాండర్‌ గురించి మాట్లాడుతున్నా మంచి బౌన్స్‌ ఉండే ఈ పిచ్‌పై మోర్కెల్‌ మరింత ప్రమాదకారి కాగలడు. స్టెయిన్‌ బదులు ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ జట్టులోకి వచ్చే అవకాశముంది.

జట్లు (అంచనా)

భారత్‌: ధావన్, విజయ్, పుజారా, కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ /రహానే, సాహా , పాండ్యా, అశ్విన్‌/ఉమేశ్, భువనేశ్వర్, షమీ, బుమ్రా.

దక్షిణాఫ్రికా: ఎల్గర్, మార్క్‌రమ్, ఆమ్లా, డివిలియర్స్, డు ప్లెసిస్‌ (కెప్టెన్‌), డికాక్, ఫిలాండర్, క్రిస్‌ మోరిస్, కేశవ్‌ మహరాజ్, రబడ, మోర్నీ మోర్కెల్‌.

కొద్ది వారాల్లో... మరీ అయిదు రోజుల్లో మారిన పరిస్థితులను చూస్తుంటే నవ్వొస్తోంది. తొలి టెస్టుకు ముందు రహానే తుది జట్టులో కచ్చితంగా ఉండాలని ఎవరూ అనలేదు. ఇప్పుడేమో అందరూ తీసుకోవాలంటున్నారు. జట్టుగా మేమంతా ఆలోచించేది సమతూకం గురించే. అందుకు సరితూగుతారని అనిపించేవారితోనే వెళ్తాం. అంతే తప్ప బయటి అభిప్రాయాలను పట్టించుకోం. రహానే నాణ్యమైన ఆటగాడు. దక్షిణాఫ్రికా సహా విదేశాల్లో నిలకడగా ఆడాడు. రోహిత్‌ను ఫామ్‌ ఆధారంగానే తీసుకున్నాం. ఓపెనింగ్‌ స్థానాలు సహా అన్నింటిపై ప్రాక్టీస్‌ అనంతరమే నిర్ణయం తీసుకుంటాం. పిచ్‌ జీవంతో తొణికిసలాడుతోంది. మా ఉత్తమ ఆటతీరు కనబర్చడంలో పరీక్షగా నిలవనుంది.

– విరాట్‌ కోహ్లి, భారత్‌ కెప్టెన్‌

పిచ్, వాతావరణం

సూపర్‌ స్పోర్ట్‌ పార్క్‌ పేస్, బౌన్స్‌కు ప్రసిద్ధి. స్వింగ్‌కూ సహజంగానే అనుకూలిస్తుంది. పిచ్‌పై ప్రస్తుతం పచ్చిక తక్కువగా ఉంది. వాతావరణం పొడిగా, వేడిగా ఉంది. వర్షం కురిసే అవకాశాలు లేవు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top