ప్రీక్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్

ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు దూకుడు మీదున్నారు. వరుస విజయాలతో పతకాల రేసులో దూసుకెళుతున్నారు. మహిళల సింగిల్స్‌లో మాజీ ఫైనలిస్టు సైనా నెహ్వాల్ గ్రాండ్‌గా శుభారంభం చేస్తూ ప్రీక్వార్టర్స్‌లో ప్రవేశించగా, పురుషుల సింగిల్స్‌లో హాట్ ఫేవరెట్ కిడాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్‌లు రెండో గెలుపు నమోదుచేసి క్వార్టర్‌ఫైనల్స్‌కు అడుగుదూరంలో నిలిచారు.

గ్లాస్గో: ప్రపంచ చాంపియన్‌షిప్‌కు జంబో జట్టుతో బయలుదేరిన భారత షట్లర్లు అందుకు తగ్గట్లే వరుస విజయాలతో ముందుకెళుతున్నారు. ఇప్పటికే మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ప్రీక్వార్టర్స్‌లో ప్రవేశించగా, ఇప్పుడు సైనా నెహ్వాల్ వంతు. లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేతైన సైనా రెండోరౌండ్‌ను అలవోకగా అధిగమించింది. తొలిరౌండ్‌లో బై అందుకున్న సైనా బుధవారం జరిగిన రెండోరౌండ్లో స్విట్జర్లాండ్ అమ్మాయి సబ్రినా జాకిట్‌ను వరుసగేముల్లో చిత్తుచేసింది. కేవలం 33 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో 12వ సీడ్ సైనా 21-11, 21-12తో విజయం సాధించింది. క్వార్టర్స్‌బెర్త్ కోసం సైనా కొరియాకు చెందిన రెండోసీడ్ సంగ్ జీ హ్యూన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే, సంగ్ జీ హ్యూన్‌తో ముఖాముఖి రికార్డులో సైనా 7-2తో పైచేయిగా ఉంది.

అందులోనూ ఇద్దరూ చివరిసారిగా ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తలపడగా, సైనానే నెగ్గింది. మరో రెండోరౌండ్ పోరులో సంగ్ జీ 21-9, 21-19తో భారత అమ్మాయి తన్వి లాడ్‌ను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో కచ్చితంగా పతకం సాధిస్తాడనుకుంటున్న ప్రపంచ 8వ ర్యాంకర్ శ్రీకాంత్ 21-9, 21-17తో ఫ్రాన్స్ షట్లర్ లుకాస్ కార్వీపై గెలుపొందాడు. ఇటీవల వరుసగా రెండు సూపర్‌సిరీస్‌లు నెగ్గి జోరుమీదున్న శ్రీకాంత్ క్వార్టర్స్‌లో చోటుకోసం 14వ సీడ్ ఆండ్రెస్ ఆంటోన్‌సెన్ (డెన్మార్క్)తో తలపడుతాడు. గంటా 12 నిముషాల పాటు సాగిన మరో మ్యాచ్‌లో సింగపూర్ ఓపెన్ చాంపియన్ సాయి ప్రణీత్ 14-21, 21-18, 21-19తో ఆంథోనీ (ఇండోనేసియా)ని ఓడించి ప్రీక్వార్టర్స్ చేరాడు. మార్క్ జ్వీబ్లెర్, చో తిన్ చెన్ మధ్య జరిగే మ్యాచ్ విజేతతో ప్రణీత్ తర్వాతిరౌండ్ ఆడనున్నాడు. మహిళల డబుల్స్‌లో భారత్ పోరు ముగిసింది. రెండోరౌండ్లో సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప జంట 22-24, 21-17, 15-21తో రెండోసీడ్ కమిల్లా రైటర్-క్రిస్టినా (డెన్మార్క్) జోడీ చేతిలో పోరాడి ఓడగా.. మరో భారత ద్వయం సంజన-ఆరతి 14-21, 15-21తో చైనా జంట చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top