మీరు విలన్లుగా కాదు హీరోలుగా నిలవాలి: కేసీఆర్

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు విలన్లుగా కాకుండా హీరోలుగా నిలవాలని, ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. హైదరాబాద్ మాదాపూర్ లోని హెచ్ఐసీసీలో జరిగిన రాష్ట్రస్థాయి పోలీసుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎస్సై నుంచి డీజీపీ స్థాయి అధికారుల వరకు సుమారు 1500 మంది పోలీసులు పాల్గొన్న ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో పోలీసుల సహకారం ఎంతో ఉందన్నారు.

తెలంగాణ వస్తే మావోయిస్టుల ప్రాబల్యం అధికమవుతుందని ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడారని, అయితే ఈ అపోహలన్నింటినీ తెలంగాణ పోలీసులు తొలగించారని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు.

తెలంగాణ పోలీసులపై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లులు కురుస్తున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. తాను ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ ప్రధాని, హోం మంత్రి రాష్ట్ర పోలీసులను పొగుడుతుంటారని గుర్తు చేశారు.

ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం...

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 806 పోలీస్‌స్టేషన్లు, 716 సర్కిళ్లు, 162 సబ్‌ డివిజన్లు, 9 కమిషనరేట్లు ఉన్నాయని, పోలీస్‌ శాఖకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. మహిళా పోలీసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

అక్కడ అలా... అందుకే ఇక్కడ ఇలా...

సింగపూర్‌లో మహిళలు అర్థరాత్రి ఒంటరిగా తిరిగే పరిస్థితి లేదని, అలాంటి ప‌రిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండ‌కూడ‌ద‌నే మహిళల రక్షణ కోసం ‘షీ' బృందాలను ఏర్పాటు చేశామని, ఈ బృందాలపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

ప్రమోషన్లలో అవే ఉండకూడదు...

పోలీస్ ప్ర‌మోష‌న్ల‌లో పైర‌వీల‌కు తావు ఇవ్వవద్దని సీఎం కేసీఆర్ అధికారుల‌కు సూచించారు. పోలీసుశాఖ‌లో ప‌నిచేసే ప్ర‌తి ఉద్యోగికి వారికి న్యాయంగా రావ‌లిసిన ప్ర‌మోష‌న్‌ను సరైన స‌మ‌యానికి ఇవ్వాల‌ని ఆదేశించారు. ఇందులో ఎలాంటి వ్య‌క్తిగ‌త క‌క్ష‌లు, పైర‌వీల‌కు తావివ్వొద్ద‌న్నారు. ప్రమోషన్ కోసం పని పక్కకు...

ప్రమోషన్ కోసం పని పక్కకు...

ప్ర‌మోష‌న్ అనేది రావ‌లిసిన స‌మ‌యానికి వ‌స్తే సంబంధిత అధికారి త‌న విధుల‌పై దృష్టి పెట్ట‌డానికి అస్కారం ఉంటుంద‌న్నారు. లేక‌పోతే ప‌నిని ప‌క్క‌నబెట్టి ప్ర‌మోష‌న్‌ కోసం అధికారుల చుట్టూ తిర‌గాల్సి ఉంటుంద‌ని సీఎం వివ‌రించారు.

అందుకే ‘ఫ్రెండ్లీ పోలీస్' వ్యవస్థ...

పోలీసులపై ప్రజల్లో విశ్వాసం కల్పించేందుకే ‘ఫ్రెండ్లీ పోలీస్‌' వ్యవస్థ తీసుకొచ్చామని, ద‌య‌చేసి గ‌తంలో ఉన్న చెడు క‌ల్చ‌ర్‌కు స్వ‌స్తి ప‌ల‌కాల‌ని, పోలీసులంటే ప్ర‌జ‌ను భ‌య‌పెట్టే విల‌న్లుగా కాకుండా తెలంగాణ పోలీస్ అంటే ప్ర‌జ‌ల‌ను ర‌క్షించే హీరోలుగా పేరు తెచ్చుకోవాల‌ని సీఎం విజ్ఞ‌ప్తి చేశారు.

మిమ్మల్ని చూపే ఓట్లు అడిగాం...

మొన్నటి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ పోలీసుల పనితీరు గురించి చెప్పుకునే తాము ఓట్లు అడిగామని, పోలీసులపై ప్రజలకు కూడా మంచి భావం ఉండబట్టే 99 సీట్లు గెలిపించారని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

పోలీసులంటే అలా ఉండాలి...

అర్హత సాధించిన తక్షణమే పదోన్నతి ఇచ్చే విధంగా పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దాలని, ఉద్యోగ విరమణ చేసిన తరువాత పోలీసులు పింఛన్‌ కోసం పైరవీ చేసే దుస్థితి ఉండకూడదని, రిటైరైన రోజు పూలమాల, శాలువాతో సత్కరించి.. వాహనంలో ఇంటి వద్దకు చేర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోలీసు అధికారులకు సూచించారు.

అందుకే అడిగినవన్నీ ఇచ్చాం...

తెలంగాణ రాష్ట్రం సాధించుకుని అధికారంలోకి రాగానే పోలీసు శాఖను బలోపేతం చేశామని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. పోలీస్‌ శాఖకు 4వేల నూతన వాహనాలు కొనుగోలు చేశామని, ఇంకా అధునాతన వాహనాల కోసం కొత్తగా రూ.500 కోట్లు కేటాయిస్తామని, అధునాతన వాహనాలతో పోలీసుల పనితీరు మరింత మెరుగుపడుతుందని ఆకాంక్షించారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top