యాదాద్రి క్షేత్రంలో నిర్మించబోయే బ్రిడ్జ్‌ ఐకానిక్‌గా మారనుంది

యాదాద్రి : అత్యధ్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుతున్న యాదాద్రి క్షేత్రంలో నిర్మించబోయే బ్రిడ్జ్‌ ఐకానిక్‌గా మారనుంది. రిషికేష్‌ తరహాలో ఓ బ్రిడ్జ్‌ను యాదాద్రిలోనూ రూపొందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనలతో ఆధ్యాత్మిక‌త‌ను ఇటు ప‌ర్యాట‌క శోభనూ మేళ‌వించేలా అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.

యాదాద్రిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రంగా అభివృద్ధికి సంకల్పించిన సీఎం కేసీఆర్‌.. ఆలయ సన్నిధిలో రుషికేష్‌లోని రామ్‌ఝూలా తరహాలో యాదగిరికొండకు, దానికి అభిముఖంగా ఉన్న పెద్దగుట్టకు అనుసంధానం చేస్తూ ఐరన్‌ సస్పెన్షన్‌ బ్రిడ్జి నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు.

న‌వంబ‌ర్ 24న యాదాద్రిని సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్‌ ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. టెంపుల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న పెద్దగుట్టకు, ల‌క్ష్మీ నార‌సింహుడు కొలువైన యాదాద్రి కొండ‌కు మధ్య యాత్రికులు రాకపోకలు చేసేందుకు వీలుగా ఐరన్‌ సస్పెన్షన్‌ బ్రిడ్జిని నిర్మించాలన్న సీఎం ఆలోచ‌న‌పై అధికారులు నివేదిక‌ను సిద్ధం చేస్తున్నారు.

టెంపుల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న పెద్ద‌గుట్ట నుంచి యాద‌గిరి కొండ‌పైకి వెళ్లాలంటే రోడ్డు మార్గం ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. కాటేజీల నిర్మాణం పూర్తయి, భ‌క్తుల సంఖ్య పెరిగిన కొద్దీ నేరుగా కొండ‌పైకి వెళ్లేందుకు వీలుగా రెండు కొండ‌ల మ‌ధ్య బ్రిడ్జి నిర్మిస్తే బాగుంటుంద‌ని, ఆ దిశ‌గా ప్రణాళిక‌ను రూపొందించాల్సిందిగా సీఎం కేసీఆర్ అధికారుల‌ను ఆదేశించారు.

రెండు కొండల మ‌ధ్య కేవ‌లం 520 మీటర్ల దూరమే ఉండటంతో వీటి మధ్య బ్రిడ్జి నిర్మాణం చేయ‌డం అంత క‌ష్టం కాద‌ని భావిస్తున్నారు. రిషికేష్‌లో గంగా న‌దిపై నిర్మించిన రామ్ ఝూలా త‌ర‌హాలో రెండు కొండ‌ల మ‌ధ్య నిర్మించే ఐర‌న్ సస్పెన్షన్‌ బ్రిడ్జి నిర్మిస్తే అది యాదాద్రికి ఐకాన్‌గా మారే అవకాశముంది.

యాదగిరికొండపై నుంచి పెద్దగుట్ట వరకు గల ఆకాశమార్గంలో దూరాన్ని, అలైన్‌మెంట్‌పై ఆర్‌అండ్‌బీ అధికారులు సర్వేలు నిర్వహించారు. ఐరన్‌ సస్పెన్షన్‌ బ్రిడ్జి నిర్మాణానికి అంచనా వ్యయం, సాంకేతిక ప్రణాళికలను ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ ద్వారా వైటీడీఏకు, ఆ త‌రువాత ప్రభుత్వానికి నివేదిక పంపుతారు. సీఎం ఆమోద ముద్ర వేసిన త‌రువాత నిర్మాణం పనులు మొదలవుతాయి.

దేశంలో ప్రస్తుతం ఇలాంటి బ్రిడ్జిలు ఉత్తరాఖండ్‌లోని రుషికేశ్‌లో 3 కిలోమీటర్ల గంగానదిని దాటడానికి వీలుగా నిర్మాణం చేశారు. ఉత్తర, తూర్పుదిశగా గాల్లో తేలియాడే విధంగా నిర్మాణం చేసిన రామ్‌ఝూలా .. ఐరన్‌ సస్పెన్షన్‌ బ్రిడ్జి రుషికేశ్‌కు ప్రత్యేక ఆకర్షణ. యాదాద్రిలోనూ ఇలాంటి బ్రిడ్జి నిర్మాణం చేస్తే భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని పర్యాటకంగానూ ప్రాముఖ్యత పెరుగుతుందని అధికారుల ఆలోచన.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top