అక్రమ సంబంధం: భర్తను చంపించిన భార్య

కొత్తగూడెం: వివాహేతర సంబంధాలు సంచలన రీతిలో హత్యలకు దారి తీస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో అనేకం తెర మీదకు వస్తున్నాయి. తాజాగా బ్యుటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులోను వివాహేతర సంబంధమే ప్రధాన కారణంగా ఉండగా.. ఇదే కారణంతో కొత్తగూడెంలోను మరో ఘటన చోటు చేసుకుంది.

ప్రియుడితో వ్యవహారానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ భార్య.. అమాయకుడైన భర్తను అన్యాయంగా పొట్టన పెట్టుకుంది. భార్య కుట్రను పసిగట్టలేని భర్త.. ఆమెను గుడ్డిగా నమ్మి బలైపోయాడు. భర్తను చంపేందుకు భార్యే స్వయంగా రూ.2లక్షలు సుపారీ కూడా ఇవ్వడం గమనార్హం.

పోలీసుల కథనం ప్రకారం.. పాల్వంచ మండలం సోములగూడెం గ్రామస్తుడైన సపావట్ శ్యామ్(43)కి బూర్గంపాడు మండలం అంజనాపురంకి చెందిన శారద(32)తో 13ఏళ్ల క్రితం వివాహమైంది. వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడైన శ్యామ్.. కిన్నెరసాని ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. భార్య శారద పిల్లలతో కలిసి సోములగూడెంలో ఉంటోంది.

ఈ నేపథ్యంలో శారదకు సూరారంకు చెందిన సోమిశెట్టి సాయికృష్ణ(22)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొంతకాలంగా వీరిద్దరి మధ్య జరుగుతున్న వ్యవహారం గురించి భర్తకు తెలియదు. ఇద్దరూ దూరంగా ఉంటుండటం.. మధ్యలో కొన్ని విభేదాల కారణంగా భార్యాభర్తల మధ్య సంబంధాలు బలహీనపడ్డట్లు తెలుస్తోంది. దీనికి తోడు శ్యామ్ వేరే ఊళ్లో ఉంటుండటంతో సాయికృష్ణతో శారద వివాహేతర సంబంధం చాన్నాళ్లుగా కొనసాగుతోంది.

ఇటీవల ప్రభుత్వ స్కూళ్లకు వేసవి సెలవులు కావడంతో శ్యామ్ సోములగూడెంలోని భార్యా పిల్లల వద్దకు వచ్చాడు. దీంతో సాయికృష్ణ-శారదలకు శ్యామ్ అడ్డంకిగా మారాడు. భర్త ఇంట్లోనే ఉంటుండంతో వీరి కలయిక సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో ప్రియుడితో కలిసి భర్తను చంపేయాలని శారద ప్లాన్ చేసింది.

ఇందుకోసం తన మిత్రులైన దారావత్ రాజు-సుజాత(వీరిద్దరు దంపతులు), దారావత్ సంతోష్(సూరారం గ్రామస్తుడు),కున్సోతు నరేష్(జూలూరుపాడు మండలం)ను సాయికృష్ణ సంప్రదించాడు. వీరిందరికి కలిపి రూ.2లక్షలు ముట్టజెప్పేలా సాయికృష్ణ-శారద ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఒప్పందం మేరకు ప్లాన్ అమలు చేసింది శారద. ఈ నెల ఏప్రిల్ 30న భర్తతో గొడవ జరిగిన నేపథ్యంలో.. సమస్య పరిష్కరించుకుందామని చెప్పి బంధువుల ఇంటికి వెళ్దామని చెప్పింది. ఇద్దరు కలిసి ఇల్లందు వైపు స్కూటీపై బయలుదేరగా.. కొత్తగూడెం పట్టణంలోని గొల్లంగూడెంలో తమ బంధువులు ఉన్నారని అక్కడికి తీసుకెళ్లింది. ప్లాన్ ప్రకారం అప్పటికే అక్కడ వేచి ఉన్న సాయికృష్ణ మిత్రులు.. తొలుత శ్యామ్ ను చున్నీతో మెడ చుట్టూ బిగించి చంపేశారు.

ఆపై మృతదేహాన్ని గోనె సంచుల్లో చుట్టి.. లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగు వద్ద రైల్వే బ్రిడ్జి సమీపంలో పడేశారు. ఆ మరుసటి రోజు శ్యామ్ చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులకు తెలియడంతో లక్ష్మీదేవిపల్లిలో హత్య కేసు నమోదు చేశారు. మిస్టరీని చేధించిన పోలీసులు.. భార్యే దీనికి సూత్రధారి లని తేల్చారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top