ఏళ్లనాటి ఈ పడవలు ఎప్పుడు మునిగిపోతాయో

విజయవాడ వద్ద కృష్ణానదిలో ఇరవైఒక్క మందిని పొట్టనబెట్టుకున్న బోటు ప్రమాదం పాలమూరు తీరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అటు ఏపీలోని కర్నూలు.. ఇటు తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లాల నడుమ నిత్యం పదుల సంఖ్యలో పల్లెజనం మర పడవలు, పుట్టిలలో ప్రాణాలు అరచేతిలోపెట్టుకొని నదిని దాటుతుంటారు. తీరం వెంబడి ఉన్న గ్రామాల జాలరులు నాటు పడవల సహాయంతో రోజూ కృష్ణానదిని దాటి జీవనం సాగిస్తుంటారు. ఏళ్లనాటి ఈ పడవలు ఎప్పుడు మునిగిపోతాయో తెలియని పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు ఇదే నదిలో మంచాలకట్ట వద్ద 2007 జనవరి 18న జరిగిన పడవ ప్రమాదంలో 61 మంది జలసమాధి అయ్యారు. రెండేళ్లలో సోమశిల - సిద్ధేశ్వరం వంతెన నిర్మిస్తామని చెప్పిన అప్పటి సీఎం వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హామీ పదేళ్లు కావస్తున్నా కార్యరూపం దాల్చలేదు. రెండు ప్రభుత్వాలు కలిసొస్తే తప్ప, వంతెన నిర్మాణం సాకారమయ్యే సూచనలు కనిపించడం లేదు.

2009 ఎన్నికల ముందు శిలాఫలకం

2009 ఎన్నికల ముందు కొల్లాపూర్‌లో సోమశిల వంతెన నిర్మాణానికి శిలాఫలకం వేశారు. తెలంగాణ ఏర్పడి అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం రెండేళ్ల కిందట రూ.2.50 కోట్లతో నదిలో భూసార పరీక్షలు చేయించింది. వంతెన నిర్మాణానికి రూ.193 కోట్లు, బైపాస్‌ రహదారికి రూ.7.50 కోట్లు కేటాయిస్తూ 2014-15లో జీవో 131 జారీ చేసింది. తన వంతుగా వాటా నిధులు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మంజూరు చేస్తే వంతెన నిర్మాణం పూర్తిచేయాలని తెలంగాణ యోచిస్తోంది. శ్రీశైలం జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రంలోని కొల్లాపూర్‌, వనపర్తి, అలంపూర్‌ ప్రాంతాల్లº 65 గ్రామాలు, 1.10 లక్షల ఎకరాలు ముంపునకు గురయ్యాయి. ఆంధ్ర రాష్ట్రంలోని ఆత్మకూరు, నందికొట్కూర్‌, కర్నూలు ప్రాంతాల్లోనూ 52 గ్రామాలు, 1.04 లక్షల ఎకరాలు మునిగిపోయాయి. ముంపు బాధితులంతా కృష్ణాతీర ప్రాంతాల్లోనే స్థిర పడ్డారు. వీరంతా నాటు పడవలు, మరబోట్లు, పుట్టిలపై నదిని దాటుతుంటారు. ప్రతి ఏటా మకరసంక్రాంతి తర్వాత కొల్లాపూర్‌ ప్రాంతంలోని సింగోటం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలకు ఆంధ్రరాష్ట్రంలోని తీరప్రాంతాలప్రజలు పెద్దఎత్తున వస్తారు.

తగ్గనున్న దూరాభారం

ప్రస్తుతం కొల్లాపూర్‌ ప్రజలు కర్నూలు వెళ్లాలంటే పెబ్బేరు మీదుగా 100 కి.మీ. దూరం తిరిగి వెళ్లాలి. అదే సోమశిల వంతెన నిర్మిస్తే 40 కి.మీ.ల దూరంలో కర్నూలు ఉంటుంది. ఈ ప్రాంత ప్రజలు తిరుపతికి వెళ్లడానికి సైతం 150 కి.మీ.ల దూరం తగ్గుతుంది. కర్నూలు గ్రామాల ప్రజలు హైదరాబాదుకు వెళ్లాలంటే సోమశిల నుంచి నాగర్‌కర్నూల్‌, జడ్చర్ల మీదుగా చాలా దూరం తగ్గుతుందని, సోమశిల వంతెన నిర్మాణానికి సహకరించాలంటూ ఆర్‌అండ్‌బీ అధికారులు ఏపీ ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ కూడా రాశారు. తెలంగాణ ప్రభుత్వం సర్వే కూడా చేసిందని, ఏపీ ప్రభుత్వం సహకరించాలని కోరామని ‘న్యూస్‌టుడే’తో మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు.

నిజాంకొండ చూడాలన్నా పుట్టి ప్రయాణమే!

బీచుపల్లి (ఇటిక్యాల): గద్వాల సమీపంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన బీచుపల్లి వద్ద కృష్ణానది మధ్యలో ఉన్న నిజాం కొండను చూడాలన్నా పుట్టి ప్రయాణమే. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో డీకే సమరసింహారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో బిర్లావారు నిజాంకొండను అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చారు. కానీ కార్యరూపం దాల్చలేదు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top