కార్పొరేట్‌ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు కారణాలు ఏంటి

అమరావతి

: ‘రాష్ట్రంలోని కార్పొరేట్‌ కాలేజీల్లో గత కొన్నేళ్లుగా జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలకు వారు, వారి తల్లిదండ్రులే కారణం. కార్పొరేట్‌ కాలేజీల యాజమాన్యాలకు ఎలాంటి సంబంధమూ లేదు..’ అని రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. హాస్టళ్లలో ఉండటం ఇష్టం లేని విద్యార్థులను హాస్టళ్లలోనే ఉండా ల్సిందిగా తల్లిదండ్రులు ఒత్తిడి చేయడం, ఎక్కువ మార్కులు, టాప్‌ ర్యాంకులు తెచ్చుకోవాలని బలవంత పెట్టడం, మొదటి సంవత్సరంలో ఫెయిల్‌ కావడం, కుటుంబ, వ్యక్తిగత కారణాల వల్లే విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని తన నివేదికలో స్పష్టం చేసింది. కార్పొరేట్‌ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై అసెంబ్లీ శీతాకాల సమా వేశాల్లో కొందరు సభ్యులు చర్చను కోరుతుండడంతో ప్రభుత్వం ఈ నివేదికను రూపొందించింది.

అయితే కనీస నిబంధనలు పాటించకుండా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడే విధంగా వ్యవహరిస్తున్న కార్పొరేట్‌ యాజమాన్యాలపై కఠిన చర్యలు చేపట్టా ల్సిన ప్రభుత్వం.. వారికి వత్తాసుగా నివేదిక తయారు చేసింది. ఆత్మహత్యల విషయంలో కార్పొరేట్‌ కాలేజీలకు కొమ్ము కాసే ప్రయత్నంలో.. విద్యార్థుల ఆత్మహత్యలకు అసలు కారణాలను తొక్కిపెడుతోంది. కార్పొరేట్‌ కాలేజీలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం అనుసరిస్తున్న విధానాల వల్ల విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నా ప్రభుత్వం ఎక్కడా ఆ అంశాలను ప్రస్తావించలేదు. గతంలో ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీలు.. ఆయా కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్నాయని, అక్రమంగా హాస్టళ్లను నిర్వహిస్తూ విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయని తేల్చినా ప్రభుత్వం ఆ అంశాలను విస్మరించింది. అయితే విద్యార్థుల నుంచి కళాశాలలపై టోల్‌ఫ్రీ నంబర్‌కు రోజూ 41 వరకు ఫిర్యాదులు వస్తున్నాయని ప్రభుత్వమే పేర్కొనడం.. కార్పొరేట్‌ కళాశాలల్లో పరిస్థితిని కళ్లకు కడుతుంది.

కమిటీల సూచనలు పరిగణనలోకి..

ఆత్మహత్యల నివారణకు ఆయా కమిటీలు చేసిన సూచనలు ప్రభుత్వం తన నివేదికలో పొందుపరిచింది. ఆదివారాలు, సెలవు రోజుల్లో పరీక్షలుండరాదని, ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు విద్యార్థులను స్వేచ్ఛగా తిరగనివ్వాలని, ఉదయం 7 గంటలకు ముందు, సాయంత్రం 7 తర్వాత హాస్టల్‌ విద్యార్థులను ఇబ్బంది పెట్టరాదని, ఆటలు ఆడించాలని, ప్రతిభ ఆధారిత గ్రేడింగ్‌ చేయరాదని, మానసిక నిపుణులను (సైక్రియాట్రిస్టులు) నియమించాలని, నైతిక, మానవ విలువలపై అవగాహనకు ఒక పేపర్‌ పెట్టాలని పేర్కొంది. ఈ మేరకు ఇంటర్మీడియెట్‌ బోర్డు అన్ని కాలేజీలకు సర్క్యులర్లు జారీ చేసిందని నివేదికలో సర్కారు తెలిపింది. 13 బృందాల ద్వారా 706 కాలేజీలను తనిఖీలు చేయగా అనేక లోపాలు గుర్తించినట్లు పేర్కొంది. 237 కాలేజీల గుర్తింపును రద్దుచేశామని, మరో 31 కాలేజీల గుర్తింపు రద్దుకు నిర్ణయించినట్లు వివరించింది. అనేక కాలేజీలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని, అనధికార హాస్టళ్లను నడుపుతున్న 194 కాలేజీలకు నోటీసులు ఇవ్వగా 37 కాలేజీలు అనుమతి కోసం దరఖాస్తు చేసినట్లు పేర్కొంది. టోల్‌ఫ్రీ నంబర్‌కు రోజూ 41 వరకు ఫిర్యాదులు వస్తున్నాయని, అదనపు సమయం తరగతుల నిర్వహణ, సెలవు రోజుల్లోనూ క్లాసులు పెట్టడం వంటి అంశాలను విద్యార్థులు పేర్కొంటున్నారని వివరించింది.

విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వం నివేదికలో పేర్కొన్న కారణాలివే...

– హాస్టళ్లలో ఉండడానికి ఇష్టం లేకపోవడం

– హాస్టళ్లలోనే ఉండమని తల్లిదండ్రులు ఒత్తిడి చేయడం

– అత్యధిక మార్కులు/మొదటి ర్యాంకు రావాలని తల్లిదండ్రులు బలవంతపెట్టడం

– ఐఐటీ/నీట్‌ పరీక్షలకు కావాల్సిన ఉన్నత ప్రమాణాలను చేరుకోలేకపోవడం

– ఆరోగ్యం, కుటుంబ, వ్యక్తిగత కారణాలు

– సెక్షన్ల వారీగా గ్రేడింగ్‌ చేయడం

– మొదటి సంవత్సరం సబ్జెక్టులలో ఉత్తీర్ణులు కాకపోవడం

ఆత్మహత్యల సంఖ్య కుదింపు

రాష్ట్రంలో గత మూడేళ్లలో 70 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా ప్రభుత్వం ఆ సంఖ్యను భారీగా కుదించింది. 2012 నుంచి 2017 వరకు ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య 37 అని పేర్కొంది. నారాయణ కళాశాలలో 10, శ్రీచైతన్యలో 15, ఎన్‌ఆర్‌ఐలో 4, ఇతర యాజమాన్యాల్లో 8 జరిగినట్లు తెలిపింది. రాష్ట్రంలో 3,361 కాలేజీలుండగా ఇందులో 1,143 ప్రభుత్వ, ఎయిడెడ్‌ కాలేజీలు కాగా తక్కిన 2,218 కాలేజీలు ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థలకు చెందినవి. మొత్తం 9,18,211 మంది విద్యార్థుల్లో 2,26,388 మంది ప్రభుత్వ, ఎయిడెడ్‌ కాలేజీల వారు కాగా మిగతా వారంతా ప్రైవేటు కార్పొరేట్‌ కాలేజీల వారే.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top