బీజేపీపై బాబు ప్రిడిక్షన్

గడచిన ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కలిసిమెలిసి భుజం భుజం రాసుకుంటూ ఎన్నికలకు వెళ్లాయి. నాడు దేశవ్యాప్తంగా బలంగా వీచిన నరేంద్ర మోదీ గాలితో కూడా తాను గెలవలేనని ఓ అంచనాకు వచ్చేసిన టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... చివరి నిమిషంలో కాపు ఓట్లను గంపగుత్తగా లాగేసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను రంగంలోకి దించేసిన వైనం కూడా జనానికి బాగానే గుర్తు. బాబు ఆదేశాలతో కాళ్లకు బలపం కట్టుకున్న వాడల్లే రాష్ట్రంలో తనకు మంచి పట్టున్న ప్రాంతాల్లో పర్యటించిన పవన్ కల్యాణ్... బాబు ఆశించిన మేరకు ఓ మోస్తరు స్థాయిలో టీడీపీకి ఓట్లు పడేలా చేశారని చెప్పాలి. మొత్తంగా మోదీ హవా - పవన్ కల్యాణ్ ప్రచారంతో చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా చంద్రబాబు అధికారం చేజిక్కించుకోగలిగారు. ఆ తర్వాత ఏపీకి ఇచ్చిన హామీల అమలులో తీవ్ర జాప్యం చేస్తూ ముందుకు సాగిన కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కించిత్ కూడా అనుమానం రాకుండానే... ఆ పార్టీ చెప్పిన మాటనే తన మాటగా చెబుతూ చంద్రబాబు పాలన సాగించారు. అయితే మొన్నటి కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేంద్రం ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వని విధంగానే కాకుండా తీవ్రంగా వంచించిన వైనం బయటపడటంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసి... అప్పటిదాకా వద్దని తన నోటితోనే చెప్పిన ప్రత్యేక హోదా కోసం తనదైన శైలి ఉద్యమాన్ని ప్రారంభించేశారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

అయినా తానే వద్దని. ఆ పేరెత్తితే జైల్లో పెట్టేస్తానని చెప్పిన ప్రత్యేక హోదా కోసం తాను ఇప్పుడు పోరాటం చేస్తే ప్రజలేమనుకుంటారన్న విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకోని చంద్రబాబు... ప్రత్యేక హోదా కోసం తానే తొలుత పోరాటం ప్రారంభించినట్లుగా చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 20న ఆయన నిరాహార దీక్షకు కూడా దిగుతున్నారు. ఈ నేపథ్యంలో నేటి ఉదయం నిర్వహించిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పలు విషయాలను పార్టీ నేతలతో పంచుకున్నారు. అదే సమయంలో 2014 ఎన్నికల్లో తనకు అండాదండగా నిలిచిన బీజేపీపై ఆయన తనదైన స్థాయిలో విరుచుకుపడ్డారనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమని పేర్కొన్న చంద్రబాబు... అందుకు గల కారణాలను కూడా బయటపెట్టేశారని చెప్పాలి. అహంకారపూరిత వైఖరి కారణంగానే 2019 ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలు కానుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇందుకు ఉదాహరణలను కూడా ఆయన ప్రస్తావించారు. అహంభావం ఎంతటివారినైనా పతనం చేస్తోందని ఆయన చెప్పారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరును చంద్రబాబు ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరుతో ఆ పార్టీపై చెడు ప్రచారం జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బీజేపీకి తిరుగులేదని నాడు అనుకొన్నారని... కానీ పరిస్థితి ఇప్పుడు ఎదురు తిరిగిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఇక్కడిదాకా బాగానే ఉన్నా... ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు రాజధాని నిర్మాణం విషయంలో ఇతోదికంగా తోడ్పాటు అందిస్తామని చెప్పిన బీజేపీకి ఓటమి సిద్ధిస్తే... మరి నాలుగేళ్ల పాటు ఏపీకి బీజేపీ సర్కారు అన్యాయం చేస్తున్నా... ఆ ప్రభుత్వంతో కలిసి సాగడమే కాకుండా ప్రత్యేక హోదా పేరెత్తితే జైలుకు పంపిస్తానని చెప్పిన చంద్రబాబుకు ప్రజలు ఓట్లేస్తారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పక తప్పదు. అయినా మాట మార్చిన పార్టీగా బీజేపీ కంటే కూడా టీడీపీకే ఎక్కువ మార్కులు పడతాయన్న మరో వాదన కూడా లేకపోలేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ... ఆ తర్వాత హోదా ఇవ్వలేమని దానికి సమాంతరంగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామని చెప్పింది. హోదా ఇవ్వలేకపోతున్న కారణాన్ని కూడా బీజేపీ సర్కారుకు బాబుకు బహిరంగంగానే చెప్పింది. నాడు బీజేపీ వినిపించిన వాదనను బలపరచడమే కాకుండా... జనంలోకి వెళ్లి బాకాలు ఊది మరీ చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అదే బీజేపీపై శాపనార్థాలు పెట్టేలా వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనించకుండా ఉంటారా? అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. మొత్తంగా బాబు చెప్పినట్లుగా అహంకారంతో వ్యవహరించిన బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే... మాట మార్చడమే కాకుండా బీజేపీ ప్రాపకం కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టినట్లుగా వ్యవహరించిన చంద్రబాబుకు కూడా ఓటమి సిద్ధించక మానదన్న విశ్లేషణలు ఇప్పుడు సాగుతున్నాయి. అంటే... బీజేపీపై బాబు ప్రిడిక్షన్ ఆయన తలకే చుట్టుకుందన్న వాదన వినిపిస్తోంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top