విశాల్‌ను నిర్లజ్జగా ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నికల బరి నుంచి తప్పించిన వైఖరి

చెన్నై: అధినేత్రి లేని పార్టీలో యధేచ్ఛగా స్వైరవిహారం చేస్తున్న అధికారనేతలు.. తమ విజయానికి ఆటంకమవుతాడనుకున్న విశాల్‌ను నిర్లజ్జగా ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నికల బరి నుంచి తప్పించిన వైఖరిని చూసి యావత్‌ రాష్ట్రం దిగ్ర్భాంతిలో పడిపోయింది. తమ పార్టీ నేతలు ఆడిన తొండి ఆటను చూసి అన్నాడీఎంకే కార్యకర్తలే విస్తుపోతున్నారు. కారణం ఏదైనా, జరిగింది ఎందుకైనా ఆర్‌కే నగర్‌ నియోజకవర్గంతో పాటు రాష్ట్రం మొత్తంలో విశాల్‌ పట్ల విపరీత సానుభూతి వ్యక్త మవుతోంది. ఏ ఇద్దరు కలిసినా ‘విశాల్‌కు జరిగిన అన్యాయం చూశావా?’ అంటూ చర్చించుకోవడం కనిపిస్తోంది. ఈ సానుభూతే ఈ ఉపఎన్నికలో అధికార పార్టీకి శాపంగా మారడం ఖాయమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దాంతో అన్నాడీఎంకేతో అంటకాగేందుకు సిద్ధమైన బీజేపీ నేతలు సైతం ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేదంటూ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

నటుడు విశాల్‌ ఆర్‌కే నగర్‌ నియోజకవర్గంలో పోటీ చేస్తాడని వార్తలు వెలు వడినప్పటి నుంచే అధికార పార్టీలో ఉలుకెక్కువైంది. అప్పటి నుంచి ఆ పార్టీ నేతలు విశాల్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. జయ మరణించిన ఏడాది తరువాత జరు గుతున్న ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా తమ ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేదని నిరూపించుకునేందుకు అన్నాడీఎంకే నేతలు తహతహలాడుతున్నారు. 8 నెలల క్రితం ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జర పాలనుకున్నప్పుడు అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు పరస్పరం దుమ్మెత్తిపోసు కున్నాయి. ఆరోపణలు-ప్రత్యారోపణలతో ‘అవినీతి మకిలీ’ని పోటీపడి మరీ వెద జల్లుకున్నాయి. ఈ ఆరోపణలు చూసి యావత్‌ ప్రజానీకం నివ్వెరపోయినా.. ‘నవ్వి పోదురుగాక...!’ అనుకుంటూ చేతులు దులుపుకుని రాజకీయాలు కొనసాగించాయి.

ఆ తరువాత జరిగిన నాటకీయ పరిణామాలతో ఒక్కటైన ఈపీఎస్‌-ఓపీఎస్‌ వర్గాలు ఇప్పుడు ‘ఐక్యతా రాగం’ ఆలపిస్తూ.. ఉమ్మడి అభ్యర్థిగా పార్టీ ప్రిసీడియం చైర్మన్‌ ఇ.మధుసూదన్‌ను బరిలోకి దించాయి. ఇప్పటికే పరస్పర ఆరోపణలు, ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్రపెద్దల ముందు మోకరిల్లిన సంఘటనలతో ప్రజల్లో జరిగిన పలుచనను తగ్గించుకునేందుకు ఆర్‌కే నగర్‌లో విజయం సాధించడం మినహా మరొకమార్గం లేదని భావిస్తున్న అధికార గణం.. ముమ్మర ప్రయత్నాలు చేపట్టింది. ఈ నియోజకవర్గంలో జయాపజయాలు నిర్ణయించేది తెలుగు ఓటర్లే కాబట్టి ఇ.మధుసూదన్‌ నెగ్గుకొస్తారని భావిస్తున్న ఈపీఎస్‌-ఓపీఎస్‌ ధ్వయం.. ప్రజా సమస్యలపట్ల అవగాహన వున్న పరిణతి గల తెలుగు యువకుడైన విశాల్‌ ఇక్కడ పోటీ చేస్తున్నాడని తెలిసిఉలిక్కిపడింది.

అదే జరిగితే తెలుగు ఓట్లు చీలడం ఖాయమని, అప్పుడు తమ పుట్టి మునగడం ఖాయమని బెంబేలెత్తింది. అందుకే తమ మంత్రుల చేత వెగటుపుట్టే విమర్శలు చేయించింది. అయినా వెరవని ‘పందెం కోడి’ నామినేషన్‌ వేయడంతో.. ‘దొంగచాటు’ యత్నాలకు అధికారవర్గం బరితెగించింది. విశాల్‌ పేరును ప్రతిపాదించిన పదిమందిలో ముగ్గురు ప్లేటు ఫిరాయించేలా చక్రం తిప్పింది. దాంతో రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కార్యాలయంలో జరిగిన ‘నాటకం’ రక్తి కట్టింది. తద్వారా పోటీ ప్రారంభం కాకుండానే పందెం కోడి పక్కకు తప్పుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదన్‌ వర్గం బుకాయించవచ్చేమో కానీ యావత్‌ మీడియా తెల్లబోయేలా జరిగిన సంఘటనలు వాస్తవాన్ని దాచలేవు. రాష్ట్రంలో అసలు గుంతలే లేవని అడ్డంగా వాదించిన మంత్రులు సైతం.. విశాల్‌ వ్యవహారంలో గట్టిగా మాట్లాడలేకపోయారంటే.. జరిగిన తప్పిదమేంటో? దాని ‘విలువెంతో’? దానికి పాల్పడిన ఘనులెవ్వరో ఇట్టే చెప్పయ్యవచ్చు.

విశాల్‌కు అంత ఖర్మేంటి?

ప్రత్యర్థి వర్గం జరిపిన ‘ఆపరేషన్‌’లో పావులుగా మారిన ‘ప్రతిపాదకులు’.. విశాల్‌ నామినేషన్‌పై వున్న ఆ సంతకాలు తమవి కావంటూ రిటర్నింగ్‌ అధికారి ముందు నాలుక తిప్పారు. ఎమ్మెల్యే పదవి కోసం నామినేషన్‌ దాఖలు చేసే వ్యక్తి ఎవరో తెలియని వారి సంతకాలను తన నామినేషన్‌పై ఫోర్జరీ చేసి రాసుకుంటాడా? ఆ సంతకాలు చేసిన ఓటర్ల గురించి రిటర్నింగ్‌ అధికారి నిజానిజాలు ఆరా తీస్తాడని తెలియనంత అమాయకుడా విశాల్‌? ప్రసిద్ధి చెందిన నడిగర్‌ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా, నిర్మాతల మండలి అధ్యక్షుడిగా, ఎన్నో ట్రస్టులకు నిర్వాహకుడిగా వున్న వ్యక్తి.. ఎవరో తెలియనివారి సంతకాలను తన నామినేషన్‌పై ఫోర్జరీ చేసుకుంటాడా? ఎంతోమంది న్యాయనిపుణులను కూడాతెచ్చుకున్న వ్యక్తికి ఈ పాటి విచక్షణ తెలియదా? ఈ మాటలు నమ్మశక్యంగా వున్నాయా?.. దీనిని బట్టే విశాల్‌ విడుదల చేసిన ఆడియో టేపుల్లోని మాటలు నిజమని తేలిపోతోందని అన్ని వర్గాలు ముక్తకంఠంతో చెబుతున్నాయి.

అన్నాడీఎంకే ఎందుకు ధర్నా చేయాల్సి వచ్చింది?

మధుసూదన్‌ వర్గం చెబుతున్నట్టు విశాల్‌ వ్యవహారంలో అధికార పార్టీ నేతల జోక్యం లేదని కొంతసేపు అనుకుందాం!. మరి జరిగిన అన్యాయం పట్ల తొలుత జ్ఞానోదయం పొందిన రిటర్నింగ్‌ అధికారి విశాల్‌ నామినేషన్‌ను అంగీకరిస్తే.. దానిని ఖండిస్తూ మధుసూదన్‌ అనుచరులు ఎందుకు ధర్నా చేయాల్సి వచ్చింది? డీఎంకే, బీజేపీ అభ్యర్థుల్లానే విచక్షణను రిటర్నింగ్‌ అధికారికే వదిలేసి మిన్నకుండిపోవచ్చు కదా! విశాల్‌ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్టు రాత్రి 11 గంటలకు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించే వరకూ అన్నాడీఎంకే వర్గాలు ఎందుకు ఆందోళన చేయాల్సి వచ్చింది? ఈ నాటకమంతా పరిశీలిస్తే ఈ కుట్రకు సూత్రధారులెవరో, పాత్రధారులెవరో ప్రపంచానికి తేటతెల్లం కాదా?.. అయితే మోసపోయేవాళ్లున్నంత కాలం మోసం చేసేవారుంటారు. మోసపోవడం మన తప్పు. తొలిప్రయత్నంలో అనుభవలేమితో విశాల్‌ ఎదురుదెబ్బ తిని వుండొచ్చు గానీ ఆయన భవితకు వచ్చిన నష్టమేమీ లేదు. జరిగిన కుట్రను ‘తొలిపాఠం’గా నేర్చుకుని ఆయన భావి రాజకీయాలవైపు అడుగులేయడం అన్ని విధాలా శ్రేయస్కరం.

మండిపడిన ప్రతిపక్షాలు

అన్నాడీఎంకే ఆడిన తొండాటను ప్రతిపక్షాలన్నీ తూర్పారబట్టాయి. డీఎంకేకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్‌, డీపీఐ, సీపీఎం, సీపీఐ పార్టీలైతే తక్షణం రిటర్నింగ్‌ అధికారిని తప్పించాలని డిమాండ్‌ చేశాయి. విశాల్‌కు అన్యాయం జరిగిందని, ఇది సరి కాదని ఆయా పార్టీలకు చెందిన నేతలు మండిపడ్డారు. బీజేపీ సీనియర్‌ నేత హెచ్‌.రాజా అయితే విశాల్‌, దీప రాజకీయాల్లో మరింత నేర్చుకోవాల్సి వుందని సూచించారు. కాగా విశాల్‌ బుధవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజేష్‌ లఖానీని కలిసి జరిగిన తప్పిదాన్ని వివరించారు. దీనిపై చర్యలు తీసుకుని నిజానిజాలు తెలుసుకుని తనకు న్యాయం చేయాలని అభ్యర్థించారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top