సీఎం సొంత జిల్లాలోనే అత్యధిక కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాకాలం వచ్చిందంటే చాలు అంటువ్యాధులు ప్రబలుతున్నా, రోగ నిర్ధారణ, నివారణా చర్యలు అంతంత మాత్రమేనని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందన్న విమర్శలొస్తున్నా ఏపీ సర్కార్ పెడచెవిన పెడుతోంది.

ఏటా గిరిజన సంక్షేమానికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ.. గిరిజనుల బతుకులు మెరుగు పడడం లేదు. కనీస వసతులు లేని పల్లెల్లో గిరిజనులు జీవిస్తున్నారు. సకాలంలో వైద్యం అందక గిరిజనులు మృత్యువాత పడుతున్న దుర్భర స్థితి మన్యంలో నెలకొంది. '108' సర్వీస్ ఉలుకు పలుకు లేకుండా ఉన్నదని చెప్తున్నారు.

పరిస్థితిని చక్కదిద్దడంలో సంబంధిత శాఖలు పరిధులు అంటూ గీతలు గీసుకుని కూర్చోవడంతో సమస్య మరింత జఠిలమవుతోంది. క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ లేక ఎవరికివారు తప్పించుకుంటున్నారు. శాఖల మధ్య సమన్వయ లోపమే ఈ పరిస్థితికి దారితీస్తోంది. నమోదైన కేసుల విషయంలో కూడా తప్పుడు లెక్కలు చూపుతున్నారన్న విమర్శలొస్తున్నాయి. విశాఖ పట్నం జిల్లా పరిధిలో పరిస్థితి విషమంగా ఉన్నది.

చోడవరం మండలం కొంజుర్తి సమీప పెడెంగూడం గ్రామానికి రోడ్డు లేదు. గిగ్ బోర్ వెళ్లక బోర్ బావి కూడా ఏర్పాటు కాలేదు. తత్ఫలితంగా ఈ గూడెం వాసులకు ఊటనీరే తాగునీరుగా మారింది. తత్ఫలితంగా గ్రామస్తులు తరుచుగా రోగాల భారీన పడుతున్నారు. ఈ గ్రామ వాసి సెగ్గే చినపోతురాజు(46)జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వాంతులు లక్షణాలతో నాలుగు రోజులు అనారోగ్యంతో బాధపడ్డాడు. గత వారం వాంతులు ఎక్కువ కావడంతో తట్టుకోలేక పోయాడు. ఆసుపత్రికి తరలించేందుకు ‘108' సర్వీస్ కోసం ఫోన్ చేస్తే వాహనం ఖాళీగా లేదన్న సమాచారం వచ్చింది. దీంతో కల్యాణపులోవ వరకు మూడు కిలోమీటర్లు డోలీలో మోసుకొచ్చారు. అక్కడ నుంచికొత్తకోట మీదుగా రోలు గుంట ఆస్పత్రికి ఆటోలో తీసుకు వెళుతుండగా చనిపోయాడు. ఇది కేవలం ఒక గ్రామంలో నెలకొన్న పరిస్థితి. ఇక విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని మన్యం గ్రామాల్లో పరిస్థితేమిటో అర్థం చేసుకోవచ్చునని వైద్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

40 రోజులుగా రాష్ట్రంలో ప్రబలిన అంటువ్యాధుల కేసుల్ని పరిశీలిస్తే వాటిలో అత్యధికంగా దాదాపు 2400 మలేరియా, 400 డెంగ్యూ కేసులే ఉన్నాయి. ఇవి కేవలం ప్రభుత్వాసుపత్రుల్లో నమోదైన కేసులు మాత్రమే. ఇక ప్రయివేట్ ఆసుపత్రుల్లో ఈ కేసులు 6 వేలకు పైగా ఉండవచ్చునని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో అత్యధికంగా విశాఖ జిల్లాలో 1229 మలేరియా కేసులు, 56 డెంగ్యూ కేసులు ఒక్క జూలైలోనే నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖలో డోనూర్‌, దారకొండ తదితర గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా మలేరియా కేసులు నమోదవ్వగా, పట్టణ ప్రాంతాల్లోనే డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులే చెప్తున్నారు.

నీటి ద్వారా సంక్రమించే డయేరియా వంటి వ్యాధులు రాష్ట్రవ్యాప్తంగా 653 కేసులు నమోదు అయ్యాయి. సిఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనే అత్యధికంగా 189 కేసులు ఉన్నాయి. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖలే నివారణా చర్యల్ని తీసుకోవాలని, ఆ పని తమది కాదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. వ్యాధి సోకిన తరువాత చికిత్సకు అవసరమైన మందులు, రోగనిర్ధారణ కిట్లు, ఇతర వైద్య సదుపాయాల్ని అందుబాటులో ఉంచడం వరకే తమ బాధ్యతని కప్పిపుచ్చుకుంటున్నారు. పారిశుధ్య లోపంతో పాటు దోమల నివారణా చర్యలు చేపట్టకపోవడం వల్లే వ్యాధులు విస్తరిస్తున్నాయని చెప్తున్నారు.

జాతీయ కీటక జనిత వ్యాధి నివారణా కార్యక్రమం (ఎన్‌విబిడిపి) మార్గదర్శకాల ప్రకారం మలేరియా వంటి వ్యాధుల్ని నిర్థారణకు ర్యాపిడ్‌ టెస్ట్‌ నిర్వహించాలి. అలా కాక సూక్ష్మదర్శినిలో రక్త నమూనా పరిశీలించి చాలా ప్రాంతాల్లో మలేరియాను నిర్ధారిస్తున్నారు. దీనివల్ల ఒక్కోసారి వ్యాధికారకాలు సూక్ష్మదర్శినిలో కనిపించవని పలువురు ప్రజారోగ్యవేదిక నేతలు పదేపదే చెప్తున్నారు. సూక్ష్మదర్శినిలో రక్త నమూనాను పరిశీలించి రోగ నిర్థారణ చేయడం ఎన్‌విబిడిపి మార్గదర్శకాలకు విరుద్ధమని అంటున్నారు. ఈ విధానం వల్లే మలేరియా కేసులు ఎక్కువగా ఉన్నా, రోగ నిర్థారణ పరీక్షలు తూతూ మంత్రంగా జరుగుతున్నాయని, ప్రభుత్వ లెక్కల్లో తక్కువ కేసులుగా నమోదవుతున్నాయని చెప్తుతున్నారు. వాస్తవంగా మలేరియా కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నా గణాంకాల్లో తక్కువ చేసి చూపడంతో మలేరియా నివారణకు కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా తగ్గుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అంటువ్యాధుల నివారణకు ప్రభుత్వం దోమలపై దండయాత్ర వంటి ప్రచార ఆర్భాటాలే తప్ప రోగాల సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టడంలేదు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా వరకు దోమ తెరలు పంపిణీ చేయలేదన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. దోమల నివారణకు గత మే నుండి అక్టోబర్‌ వరకు రెండు విడతలుగా ఇండోర్‌ రెసిడ్యువల్‌ స్ప్రే ( ఆర్‌ఎస్‌) చేయాల్సిన ప్రభుత్వం ఇప్పటికి కేవలం ఒక విడత మాత్రమే స్ప్రే చేశారు. మలేరియా కేసుల విషయంలో స్క్రీనింగ్‌ సరిగా చేయడంలేదన్న విమర్శలు కూడా లేకపోలేదు.

డెంగ్యూ , మలేరియా వంటి కేసుల్లో రోగనిర్ధారణ చేసేందుకు క్షేత్రస్థాయిలో డయాగస్టిక్‌ కిట్ల కొరత ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో డెంగ్యూ నిర్ధారణకు 91 కిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 7, విజయనగరంలో 6, విశాఖలో 10, తూర్పుగోదావరిలో 9, పశ్చిమగోదావరిలో 3, కృష్ణాలో 8, గుంటూరులో 8, ప్రకాశంలో 7, నెల్లూరులో 3, చిత్తూరులో 10, కడపలో 4, అనంతపురంలో 10, కర్నూలులో 6 డెంగ్యూ డయాగస్టిక్‌ కిట్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు.

ఏజెన్సీలో వైద్య సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి. పీహెచ్‌సీల్లో వైద్యులు, క్షేత్ర స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో వైద్య సేవలు అందడం లేదు. చాపరాయి సంఘటనలో 18 వరకు గిరిజనులు జ్వరాలు బారిన పడి చనిపోయాక గాని వైద్య సేవలపై దృష్టి పెట్టలేకపోయారు. వందల గ్రామాలను కలిపే రహదారులు ఆద్వానంగా ఉన్నాయి. కొన్ని గ్రామాలకు అసలు రహదారి సౌకర్యమే లేదు. కొండవాగులపై వంతెనల నిర్మాణం అవసరాన్ని గుర్తించడం లేదు. జిల్లాలో ఐటీడీఏ అమలు చేసే పథకాల లబ్ధి వారికి చేరడంలేదు. ఏజెన్సీలో అనారోగ్యం, పౌష్టికాహార లోపం వల్లే 30 వరకు మాతా శిశు మరణాలు సంభవించాయి.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top