ఎవరికి అప్పగించిన పనిని వాళ్లు సజావుగా చేయాలి

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని అక్షర విద్యాలయం, స్వర్ణభారత్‌ ట్రస్టులో శుక్రవారం ముందస్తు సంక్రాంతి శోభ వెల్లివిరిసింది. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా రంగవల్లులు, గంగిరెద్దులు, గొబ్బెమ్మలు, గాలిపటాలు ఎగురవేయడం వంటి వివిధ కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ సంబరాల్లో పాల్గొని మాట్లాడారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత యువతపై ఉందని గుర్తుచేశారు. వివేకానందుని జయంతి సందర్భంగా యువత ఆయన నుంచి స్ఫూర్తి పొందాలన్నారు. సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న సైన్యం అందిస్తున్న సేవలు మరువలేనివని శ్లాఘించారు. ప్రధాని నరేంద్రమోదీ ఎప్పుడూ ఒక మాట చెబుతారని, ఎవరికి అప్పగించిన పనిని వాళ్లు సజావుగా చేయాలని, అప్పుడే దేశం గణనీయమైన అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. సొంత ఊరిలో అందరి మధ్య సంక్రాంతి సంబరాలు చేసుకోవటం ఆనందంగా ఉందని అన్నారు. సంబరాల్లో పాల్గొన్న తమిళనాడు గవర్నర్‌ బన్వారీలాల్‌ పురోహిత్‌ మాట్లాడుతూ.. ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకలు సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తున్నాయన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి ఆలోచనలకు ప్రతిరూపమే స్వర్ణభారత్‌ ట్రస్టు అని, దాన్ని ఆయన కుమార్తె దీప సమర్థంగా ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. అక్షర విద్యాలయంలో వెంకయ్యనాయుడు భోగిమంటలు వేయడంతో పాటు గాలిపటాలను ఎగురవేశారు. కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కామినేని శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top