మ్యాక్స్‌ ఆస్పత్రి వైద్యులు చేసిన నిర్వాకానికి ఇద్దరు కవల పిల్లలు మృతి

ఇద్దరు కవల పిల్లలు చనిపోయారని చెప్పి దిల్లీకి చెందిన మ్యాక్స్‌ ఆస్పత్రి వైద్యులు చేసిన నిర్వాకం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆస్పత్రిలో జన్మించిన కవల పిల్లలు చనిపోయారని చెప్పి ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో ప్యాక్‌ చేసి తల్లిదండ్రులకు అప్పగించిన విషయం తెలిసిందే.

కాగా.. ఇద్దరు చిన్నారులను అంత్యక్రియలకు తీసుకెళుతుండగా అందులో ఓ చిన్నారి బతికే ఉండడంతో తల్లిదండ్రులు కంగుతిన్నారు. వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మ్యాక్స్‌ ఆస్పత్రి యాజమాన్యంపై చిన్నారి తండ్రి ఆశిష్‌ కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో చిన్నారుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మెహతా, విశాల్‌ గుప్తా అనే ఇద్దరు వైద్యులను మంగళవారం విధుల నుంచి తొలగించారు. ఇద్దరు పిల్లల్లో కనీసం ఒక చిన్నారైనా బతికే ఉందని సంతోషించే లోపే ఆ ఆనందం కూడా ఆవిరైంది. చిన్నారులు చనిపోయారని చెప్పి ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో పెట్టి ఇవ్వడంతో బతికి ఉన్న చిన్నారికి ఇన్‌ఫెక్షన్‌ సోకింది. దాంతో చిన్నారిని పితమ్‌పురా ప్రాంతంలోని ఓ క్లీనిక్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి ఈరోజు ఉదయం మృతిచెందింది.

మరోపక్క దిల్లీ ప్రభుత్వం చేపట్టిన ప్రాథమిక విచారణలో ఆస్పత్రి నిర్లక్ష్య వైఖరి బయటపడింది. చిన్నారి బతికే ఉందా లేదా అన్న విషయాన్ని నిర్ధారణ చేసుకోవడానికి కనీసం పరీక్షలు కూడా నిర్వహించలేదట. అదీకాకుండా ఆస్పత్రిలోని పిల్లల వార్డులో చనిపోయిన పిల్లల వద్దే చికిత్స పొందుతున్న పిల్లల్ని పడుకోబెడుతున్నట్లు తేలింది. ఈ నివేదికను దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రిసత్యేందర్‌ జైన్‌కు అందజేశారు. ఈ విషయంలో ఆస్పత్రి లైసెన్సును రద్దు చేయించి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top