కాళేశ్వరం పనుల వేగాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అనుమతుల ప్రక్రియ కొలిక్కి వస్తుండటంతో పనుల వేగాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు నీటిని మళ్లించే పనులు ఇప్పటికే ఓ దశకు వచ్చినా, వచ్చే ఏడాది వర్షాకాలం నాటికి పూర్తి చేయాలంటే పనుల వేగంతోపాటు నిధుల వ్యయాన్ని కూడా పెంచాల్సి ఉంది. ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం విహంగ వీక్షణం (ఏరియల్‌ సర్వే) చేయనున్నారు. శుక్రవారం అధికారులు, ఇంజినీర్లు, గుత్తేదారులతో సమీక్ష నిర్వహిస్తుండటంతో పనుల పురోగతికి ఉన్న ఇబ్బందులపై మరింత ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరు వరకు నీటిని మళ్లించే పనులను, ఖరీఫ్‌ నాటికి మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని మళ్లించే పనులను పూర్తి చేయాలన్నది ప్రధాన లక్ష్యం. మధ్యమానేరు నుంచి మల్లన్నసాగర్‌ వరకు నీటిని మళ్లించే పనులు కూడా చురుగ్గా జరుగుతున్నా, రిజర్వాయర్ల నిర్మాణానికి సమయం పట్టవచ్చు. భారీ లిఫ్టులు, అత్యధిక సామర్థ్యం గల మోటార్లను అమర్చడం, భారీ సొరంగ మార్గాల పనులు కావడంతో నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకొంటూనే వేగంగా పనులు చేయాల్సి ఉంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులను ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావులు తరచూ ఇంజినీర్లు, గుత్తేదారులతో సమీక్షిస్తున్నారు. రెండో దశ అటవీ అనుమతి రావడం, పర్యావరణ అనుమతిపై నిపుణుల కమిటీ సమావేశం ముగియడం, జలసంఘంలో వ్యయం- ప్రయోజనం, సాగునీటి ప్రణాళిక డైరెక్టరేట్లు మినహా మిగిలిన విభాగాల నుంచి అనుమతులు రావడంతో పనుల వేగాన్ని పెంచడానికి అవకాశం ఏర్పడింది. భూసేకరణ, నిధులు, గుత్తేదారులు లక్ష్యానికి తగ్గట్లుగా పనులు చేసేలా చూడటం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ప్రధాన కర్తవ్యం.

మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు

మేడిగడ్డ బ్యారేజి నిర్మాణంలో ఎనిమిది బ్లాకులు ఉండగా అటు మహారాష్ట్ర వైపు, ఇటు తెలంగాణ వైపు కలిపి ఐదు బ్లాకుల నిర్మాణ పనులు వేగం అందుకున్నాయి. బ్యారేజి నిర్మించి 85 గేట్లను అమర్చాల్సి ఉంది. భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది.

* మేడిగడ్డ ఎత్తిపోతలకు భూసేకరణ ప్రక్రియ ముగిసింది. సుమారు 40 శాతం పని పూర్తయ్యింది. పునాది స్థాయి దాటి డ్రాప్ట్‌ట్యూబ్స్‌ నడుస్తున్నాయి. బ్యారేజి నిర్మాణం జాప్యమైనా లిప్టు పూర్తయితే నీటిని ఎత్తిపోయొచ్చు.

* అటవీ అనుమతి వచ్చినందున మేడిగడ్డ పంపుహౌస్‌ నుంచి అన్నారం బ్యారేజికి నీటిని మళ్లించే పనులు కూడా ప్రారంభం కానున్నాయి.

* అన్నారం బ్యారేజి పనులు 40 శాతానికి పైగా పూర్తయ్యాయి. 66 గేట్లను అమర్చాలి. భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో కలిపి సుమారు 240 ఎకరాల భూమిని ఇంకా సేకరించాలి.

* అన్నారం ఎత్తిపోతల పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో 100 ఎకరాలకు పైగా భూమిని సేకరించాల్సి ఉంది.

* సుందిళ్ల బ్యారేజి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. 68 గేట్లను అమర్చాలి. ఆరంభంలో ఆలస్యమైనా సుందిళ్ల ఎత్తిపోతల పనులు కూడా వేగం అందుకున్నాయి. భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యింది. లిప్టుల్లో పంపులు, మెటార్లు అమర్చడం, బ్యారేజీల్లో గేట్లు అమర్చడం కీలకమైన పనులు.

ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరు వరకు

సుమారు 80 శాతం పనులు పూర్తయ్యాయి. ఆరో ప్యాకేజీలో ప్రధాన పనులు పూర్తయి రెండు పంపులు అమర్చే కార్యక్రమం జరుగుతుంది. మరో రెండు పంపుల పనులు కూడా జరుగుతున్నాయి. ఏడో ప్యాకేజీలో సొరంగం పని దాదాపు పూర్తయ్యింది. ఈ ప్యాకేజీలో భాగంగా చేపట్టిన మేడారం రిజర్వాయర్‌ విస్తరణ పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. 8వ ప్యాకేజీలో ప్రధాన పనులు పూర్తయి ఐదు పంపులను అమర్చే కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. త్వరలోనే పంపుల డ్రై రన్‌ నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మూడు ప్యాకేజీల పనులు డిసెంబరు నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం కాగా వచ్చే ఏడాది ఖరీఫ్‌ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. మధ్యమానేరు నుంచి మల్లన్నసాగర్‌ వరకు నీటిని మళ్లించే పనులకు సంబంధించిన మూడు ప్యాకేజీలు 40 నుంచి 65 శాతం వరకు పూర్తయ్యాయి. భూసేకరణ ఇంకా మిగిలిఉంది. వచ్చే ఖరీఫ్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నా కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top