కాళేశ్వరంతో వరంగల్‌ జిల్లా సస్యశామలం

కాళేశ్వరం ప్రాజెక్టుతో పూర్వ వరంగల్‌ జిల్లా సస్యశ్యామలమవుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం మహబూబాబాద్‌ జిల్లా కురవిలో ఎస్సారెస్పీ స్టేజీ-1లోని డీబీఎం-48 కాలువల పునరుద్ధరణ పనుల నిర్వహణకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ కాలువ అభివృద్ధికి రూ.60 కోట్లు మంజూరు చేశామన్నారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ కాలంలో కాకతీయ కాలువ ద్వారా వరంగల్‌కు మూడు వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే అందించారని, ఆ నీరు కూడా చివరి ఆయకట్టుకు అందడం లేదని ధ్వజమెత్తారు. నిలిచిపోయిన ఎస్సారెస్పీ రెండో దశ పనులను పూర్తి చేయడానికి అవసరమైన భూసేకరణ చేసి పనులు పూర్తిచేస్తున్నామన్నారు. కాకతీయ కాలువ పరిధిలోని డీబీఎంల ఆధునికీకరణకు రూ.440 కోట్లు మంజూరు చేశామని, పనులను యుద్ధప్రాతిపదికను పూర్తి చేసి ఎనిమిది వేల క్యూసెక్కుల నీటిని అందించనున్నామన్నారు. దీని ద్వారా వరంగల్‌లోని ఎస్సారెస్పీ మొదటి దశలోని 3.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు, వరంగల్‌, నల్గొండలోని ఎస్సారెస్పీ రెండో దశలోని 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించే దిశగా ప్రభుత్వం తగు ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తండాలను పంచాయతీలుగా చేస్తూ తీర్మానం చేస్తామని, చట్టం కూడా తీసుకొస్తామన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి జిల్లాకు అనుసంధానంగా జాతీయ రహదారిని నిర్మిస్తున్నామన్నారు. త్వరలో కురవి నుంచి ఖమ్మం దాకా జాతీయ రహదారిని నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సీతారాంనాయక్‌, ఎమ్మెల్యే రెడ్యానాయక్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తెరాస ప్రధాన కార్యదర్శి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు సత్యవతిరాథోడ్‌, కవిత పాల్గొన్నారు. అంతకుముందు నర్సంపేట నియోజకవర్గంలోని చెన్నారావుపేట మండలంలో హరీశ్‌రావు పర్యటించారు.

సీతారామ ఎత్తిపోతల పథకంపై ఇక దృష్టి

ఖమ్మం: కాళేశ్వరానికి సంబంధించిన అన్ని అనుమతులు వచ్చాయని, ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించనున్న సీతారామ ఎత్తిపోతల పథకంపై దృష్టి సారిస్తామని హరీశ్‌రావు చెప్పారు. ఖమ్మం జిల్లాలోని భక్తరామదాసు రెండోదశ ఎత్తిపోతల పథకం నీటి విడుదలను మంత్రి తుమ్మలతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ఈ తరం మంత్రులకు, ఎమ్మెల్యేలకు మంత్రి తుమ్మల పనితీరు ఆదర్శమని కొనియాడారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top