సమావేశాలకు కనీసం ఆరేడు అంశాల్లో మౌలికమైన మార్పులు

హైదరాబాద్‌: ‘గడిచిన పదేళ్లుగా అసెంబ్లీ సమావేశాలను పరిశీలిస్తున్నా. గత అసెంబ్లీ సమావేశాలకు, ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలకు కనీసం ఆరేడు అంశాల్లో మౌలికమైన మార్పులు కనిపిస్తున్నాయి. ప్రశ్నోత్తరాల సమయం కూడా జరగకుండా సభను మరుసటి రోజుకు వాయిదా వేసుకునే సంస్కృతి గతంలో ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎమ్మెల్యేలంతా పూర్తిగా వినియోగించుకుంటున్నారు. 8 నుంచి 10 ప్రశ్నల వరకు చర్చకొస్తున్నాయి’అని శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు.

అసెంబ్లీలో తన చాంబర్‌లో మంగళవారం మీడియాతో ముచ్చటించారు. ఇదివరకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం రోజునే కరెంటు కోతలమీద దీపం లాంతర్లు, ఎండిన పంటలతో ఎమ్మెల్యేలు వచ్చే వారని గుర్తు చేశారు. ఇప్పుడా పరిస్థితి లేదని, సమస్యలే లేకపోవడంతో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదని ఎద్దేవా చేశారు. గతంలో సభ ఎక్కువ రోజులు నడిపించాలంటే అధికార పార్టీకి టెన్షన్‌ ఉండేదని, ఎక్కువ రోజులు సభ నడపాలని ప్రతి పక్షాలు డిమాండ్‌ చేసేవని పేర్కొన్నారు. సభను ఎక్కువ రోజులు నడపాలంటే ప్రభుత్వాలు భయపడేవని చెప్పారు.

అయితే తాము మాత్రం ఎన్ని రోజులైనా సభ నడుపుదామని అంటుంటూ ప్రతిపక్షాలు మాత్రం వద్దంటున్నాయని చెప్పారు. ఈ నెల 17తోనే సమావేశాలు ముగించాలని కోరుతున్నారని, పెళ్లిళ్లు ఉన్నాయని తమ ఎమ్మెల్యేలు కూడా అడుగుతున్నారని పేర్కొన్నారు. సభను పొడిగించే అంశంపై 17న బీఏసీ సమావేశం నిర్వహించి చర్చించనున్నట్లు తెలిపారు.

అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం రోజుకో మాట

గతంలో సభలో బిల్లులపై పూర్తి స్థాయిలో చర్చించే పరిస్థితి ఉండేది కాదని హరీశ్‌రావు పేర్కొన్నారు. బిల్లులపై ఇంతపెద్దన చర్చ జరిగిందే లేదని, గిలెటిన్‌ చేసుకుని వెళ్లిపోయేవారని గుర్తుచేశారు. ఇప్పుడు ఏరోజు అంశంపై ఆరోజే చర్చ పూర్తవుతోందని చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుదలపై కేంద్రం రోజుకో మాట చెబుతోందని పేర్కొన్నారు. ‘భద్రాచలం నియోజకవర్గంలోని 7 మండలాల్లో 5 ఏపీకి వెళ్లాయి.

సున్నం రాజయ్య రెండు మండలాలకే ఎమ్మెల్యేగా ఉన్నారు. 5 మండలాల ప్రజలకు ఎమ్మెల్యే ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. విభజన ఇలా చేస్తారా? అశాస్త్రీయంగా ఆ మండలాలను ఏపీలో కలిపారు’అని దుయ్యబట్టారు. కాగా, ఆయా పార్టీ ల నుంచి టీఆర్‌ఎస్‌లోకి మరికొందరు ఎమ్మెల్యేలు మారుతారని జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించలేదు. కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యే సంపత్, టీడీపీ నుంచి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టీఆర్‌ఎస్‌లో చేరుతారని జరుగుతున్న ప్రచారంపై హరీశ్‌ వద్ద ప్రస్తావించగా స్పందించలేదు. కొడంగల్‌ ఉప ఎన్నికపై గ్రౌండ్‌ వర్క్‌ చేస్తున్నారా అన్న ప్రశ్నకు.. ‘మీరే వార్తలు రాసుకొని, నన్ను అడిగితే నేనేం చెబుతా..’అని ఎదురు ప్రశ్నించారు.

పార్లమెంట్‌ తరహాలో బిజినెస్‌ రూల్స్‌

‘ప్రధాని పర్యటనపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంటుంది. ఈనెల 20, 21, 22 తేదీల్లో సభ నిర్వహించాల్సి వస్తుందేమో. గతంలో కొన్ని అంశాలపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టే పరిస్థితి ఉండేది. కానీ ఇపుడు ప్రభుత్వమే అన్ని అంశాలను స్వల్పకాలిక చర్చకు పెడుతోంది. పార్లమెంట్‌ తరహాలోనే అసెంబ్లీ బిజినెస్‌ రూల్స్‌ రూపొందించాం.

ప్రశ్నోత్తరాల తర్వాతే వాయిదా తీర్మానాలను అనుమతించే ఆనవాయితీని తెచ్చాం. ప్రస్తుతం సభకు ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో హాజరుకావట్లేదు. బిల్లుల సమయంలో ఇద్దరు, ముగ్గురు మంత్రులే సభలో ఉంటున్నారు. ప్రతిపక్షాలు సైతం ఇక సమావేశాలు చాలన్నట్లు వ్యవహరిస్తున్నాయి’అని హరీశ్‌ వివరించారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top