చనిపోయాడనుకున్న భర్త తిరిగొచ్చాడు!

చెన్నై: తన భర్తే అనుకుని గుర్తు తెలియని వ్యక్తికి అంత్యక్రియలు చేసిన 10 నెలల తర్వాత ఓ మహిళకు పళని గుడిలో అసలైన భర్త కనిపించారు. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కేరళకు చెందిన రాజేశ్వరి (54), కృష్ణన్‌కుట్టి (55) దంపతులు. గతేడాది నవంబరు 13న ఇరువురి మధ్య జరిగిన గొడవల కారణంగా కృష్ణన్‌ కుట్టి వూరు వదిలి వెళ్లిపోయారు. కొన్ని నెలల తరువాత కోయంబత్తూరు పోలీసులు కృష్ణ చంద్రన్‌ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో ఉన్నారని కేరళకు వెళ్లి రాజేశ్వరికి సమాచారం అందించారు. ఆమె పోలీసులు తీసుకొచ్చిన ఫొటోను సరిగ్గా గుర్తు పట్టలేకపోయారు. తరువాత వారానికి అతడు మరణించాడని రాజేశ్వరి బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. దాంతో వారు మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. భర్త పోయాడనుకుని రాజేశ్వరి దిగాలు ఉండేది. ఏదైనా గుడికి వెళితే మనసు కుదుటపడుతుందని బంధువులు ఆమెకు సలహా ఇచ్చారు. దీంతో ఆమె తమిళనాడులోని పళని ఆలయానికి వచ్చారు. తిరిగి బయలుదేరుతుండగా గుడి మెట్ల వద్ద భర్త కనిపించారు. ఆనందంలో కేకలు వేస్తూ ఆయన్ను ఆలింగనం చేసుకున్నారు. దీన్ని చూసిన మిగిలిన వారికి విషయం అర్థం కాక అయోమయానికి గురయ్యారు. అప్పుడు ఆమె జరిగిన విషయాలను అందరికీ వివరించారు. దీంతో ఆశ్చర్యపోవడం ఈసారి వారి వంతైంది. ఆ తర్వాత దంపతులు సంతోషంగా స్వామి దర్శనం చేసుకుని తిరిగి వారి వూరికి వెళ్లారు. గతంలో అంత్యక్రియలు చేసిన వ్యక్తి వివరాల కోసం ప్రస్తుతం అందరూ ఆరా తీస్తున్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top