అది అంత టీడీపీ ప్రచారం

విజయవాడ: సమాజం ముందుకెళ్లాలన్నా, అంబేడ్కర్‌ కలలు సాకారం కావాలన్నా కులాలకు అతీతంగా ప్రజలంతా మెలగాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. శుక్రవారం ఆయన కృష్ణా-గుంటూరు జిల్లాల కార్యకర్తలతో మేరిస్‌ స్టెల్లా ఆడిటోరియంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన జనసేన లక్ష్యాలను వివరించారు. ‘‘విజయవాడలో కులాల మధ్య ఐక్యత లేదు. వంగవీటి రంగా గురించి మాట్లాడకుండా విజయవాడ రాజకీయాలు మాట్లాడలేం. ఆయన్ను హత్యచేయడం తప్పు. నిజంగా రంగా తప్పుచేసి ఉంటే శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి. నెల్లూరులో నేను పెరిగాను, నన్నెవరూ అప్పుడు కులమడగలేదు. విస్తృత ప్రయోజనాల రీత్యా మనకు అన్యాయం జరిగినా, దెబ్బ తగిలినా దాన్ని మరిచిపోయే హృదయం కావాలి.

అందుకే తెదేపాకు మద్దతిచ్చా..

రాష్ట్ర ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతోనే తెదేపాకు మద్దతిచ్చా. రాష్ట్ర విభజన తర్వాత కోపతాపాలకు పోతే అభివృద్ధి జరగదు. కులాలు, మతాలను దాటితేనే ప్రపంచస్థాయి రాజధాని నగరాన్ని నిర్మంచగలం. తెదేపాకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. కానీ కష్టసమయంలో ఉన్న రాష్ట్రానికి దక్షత కలిగిన నాయకుడు కావాలనే ఉద్దేశంతోనే ఆనాడు మద్దతిచ్చా.

నేను ‘తమ్ముడు’ సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు మా అన్నయ్య నాగబాబు ఫోన్‌ చేసి ఎక్కడున్నావ్‌ అని అడిగారు. బీహెచ్‌ఈఎల్‌లో షూటింగ్‌లో ఉన్నానని చెప్పా. పరిటాల రవి నీకు గుండు గీయించి కొట్టారంట అని అన్నాడు. అసలు పరిటాల రవి ఎవరు? అని అడిగాను. తెదేపా కార్యాలయం నుంచి ఫోన్‌ చేసి చెప్పారని నాగబాబు చెప్పాడు. ఆలోచించాను. ఒక అభాండం. ఆ ప్రచారం మూడేళ్ల పాటు పెరిగి పేపర్‌లో వార్తలు రాసే స్థాయికి చేరుకుంది. నాకు ఎవరూ గుండు గీయంచలేదు. షూటింగ్‌లో చిరాకుగా ఉంటే నేనే గుండు గీయించుకున్నా. నాకు గుండు గీయిస్తే వూరుకునే వ్యక్తినా. కానీ, ఈ దుష్ప్రచారం చేసిన వారిని నేను మనసులో పెట్టుకోలేదు. వారు నాముందే తిరుగుతున్నారు. నన్ను ఎన్ని రకాలుగా అవమానించినా నేను తెదేపాకు మద్దతిచ్చా.

జగన్‌కు ఎందుకు మద్దతివ్వలేదంటే..

వైకాపా అధినేత జగన్‌పై ఎలాంటి అభియోగాలు లేకపోతే నాకు అభ్యంతరం ఉండేది కాదు. ఆయనకు మద్దతిస్తే నేను తప్పుచేసిన వాడినవుతా. అందుకే ఎన్నికల సమయంలో ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో చంద్రబాబుకు మద్దతిచ్చా. ఒక మనిషిని చంపితే ఆయన్ను అభిమానించే వ్యక్తులు అన్యాయమైపోతారు. అర్థంలేని ఆవేశం అనర్థానికి దారితీస్తుంది. దేశం, సమాజం సుభిక్షం కోసం కులాల ప్రస్తావన వద్దు. అవమానం ఎదురైనా కులాలను దాటి వెళ్లాలి. తెలంగాణ ప్రజల్లో కుల అభిమానం కనిపించదు. కులం కూడు పెట్టదు’’ అని పవన్‌ అన్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top