ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేష్‌ కాల్చివేత

ప్రముఖ పాత్రికేయురాలు, రచయిత్రి, మత సామరస్య వేదిక నాయకురాలు గౌరీ లంకేష్‌ (55) మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. బెంగళూరు రాజరాజేశ్వరినగరలోని తన నివాసం వెలుపల రాత్రి 8 గంటల సమయంలో ఆమె నిల్చుని ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు ‘తాగడానికి నీరు కావాలి’ అంటూ వచ్చి సమీపం నుంచి కాల్పులు జరిపి పరారయ్యారు. మోటారు సైకిల్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు 5 అడుగుల దూరం నుంచి మొత్తం ఏడు రౌండ్ల కాల్పులు జరిపారని పోలీసు అధికారులు వెల్లడించారు. మూడు తూటాలు ఆమె నుదురు, మెడ, ఛాతీలోకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే కుప్పకూలారు. మిగిలిన తూటాలు గోడకు తాకాయి. మరణోత్తర పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఇంట్లోనే గౌరీ లంకేష్‌ హతమయ్యారు. వివాహిత అయిన ఆమె కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటున్నారు. మహారాష్ట్రలో మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ దుండగుల తూటాలకు బలైన నరేంద్ర దబోల్కర్‌, ధార్వాడలో సాహితీవేత్త ఎం.ఎం.కలబురగి హత్యల తరహాలోనే గౌరీ లంకేష్‌ హత్యకు గురి కావడం గమనార్హం. తన ప్రాణాలకు ముప్పుందని ఆమె ముందే వూహించారు. ఈ విషయాన్ని ఆమె తన స్నేహితులతో కూడా చెప్పారు. ఇంతలోనే ఆమె హత్యకు గురికావడం విషాదాన్ని నింపింది.

నిందితుల కోసం ప్రత్యేక బృందాలు
‘గౌరీ లంకేష్‌ మృతి నన్ను కలచి వేసింది. రెండేళ్ల కిందట సాహితీవేత్త ఎం.ఎం.కలబురగి హత్య నుంచి తేరుకునే లోగానే గౌరీ లంకేష్‌ను దుండగులు హత్య చేశారు. నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసు బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు మూడు ప్రత్యేక బృందాలను నియమించామని, ఐజీపీ శరత్‌శ్చంద్ర నేతృత్వంలో ఈ బృందాలు పని చేస్తాయని బెంగళూరు నగర పోలీసు కమిషనరు టి.సునీల్‌ కుమార్‌ తెలిపారు. ‘ధైర్యవంతురాలైన విలేకరి, అభ్యుదయవాది గౌరీ లంకేష్‌ మృతి నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. హంతకులను త్వరగా అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకోవాలి’ అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ట్వీట్‌ చేశారు. ‘హంతకులను త్వరగా అరెస్టు చేసి నిర్దాక్షిణ్యంగా కఠిన చర్యల్ని చేపట్టాల్సిన అవసరముంది. ఈ హత్య గురించి విన్న తరువాత నా హృదయం కకావికలమైంది’ అని బయోకాన్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్‌ షా వ్యాఖ్యానించారు. నిందితులను అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని పశ్చిమ్‌ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్‌ చేశారు. భాజపా అధ్యక్షుడు యడ్యూరప్ప, మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌ శెట్టర్‌, కేంద్ర మంత్రి సదానంద గౌడ, కర్ణాటక కాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యుడు కె.సి.వేణుగోపాల్‌, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు గౌరీ లంకేష్‌ మృతికి సంతాపం తెలిపారు. ఈ హత్యను పిరికి పందల చర్యగా అభివర్ణించారు. నిందితులను త్వరగా అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ ఇక్కడ వేర్వేరుగా ప్రకటనలను విడుదల చేశారు. ‘నిజం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండదు. మన హృదయాల్లో ఆమె సుస్థిర స్థానం సంపాదించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’ అని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ‘ఇదొక అతి కిరాతక చర్య. కర్ణాటక రాజధాని బెంగళూరులో శాంతిభద్రతల పరిస్థితికి ఈ హత్యోదంతం అద్దం పడుతోంది. దుండగులు, నేరస్థులకు ఈ నగరం నెలవుగా మారింది’ అని ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా వ్యాఖ్యానించింది. గౌరీ లంకేష్‌ హత్యకు గురైన రాజరాజేశ్వరినగరలోని ఐడియల్‌ హోమ్స్‌ లేఔట్‌ను హోం మంత్రి రామలింగారెడ్డి సందర్శించారు. నగరంలో అన్నిచోట్లా నాకాబందీలను ఏర్పాటు చేశామని చెప్పారు. హంతకులు నగరం విడిచి వెళ్లకుండా జాగ్రత్తల్ని తీసుకుంటున్నామని తెలిపారు. ఐడియల్‌ హోమ్స్‌తోపాటు, గౌరీ లంకేష్‌ నివాసంవద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామని చెప్పారు. గౌరీ లంకేష్‌ హత్యను ఖండిస్తూ బెంగళూరుతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారతీయ విద్యార్థి సమాఖ్య, వామపక్షాల కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విలేకరుల సంఘాలు ఆందోళనలను ప్రారంభించాయి.

జేఎన్‌యూ విద్యార్థిని
దుండగుల తుపాకీ తూటాలకు బలైన అభ్యుదయవాది గౌరీ లంకేష్‌ శివమొగ్గలో జన్మించారు. తండ్రి లంకేష్‌ తన పేరిటే ఒక వారపత్రికను నడిపేవారు. తల్లి ఇందిర గృహిణి. వారికి మొదటి సంతానం గౌరీ లంకేశ్‌. సోదరి కవితా లంకేశ్‌ దర్శకురాలు. తమ్ముడు ఇంద్రజిత్‌ లంకేష్‌ కూడా దర్శకుడే. ఆయన కొన్ని టెలివిజన్‌ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. శివమొగ్గలో జన్మించిన గౌరీ విద్యాభ్యాసం అంతా బెంగళూరులోనే కొనసాగింది. సెంట్రల్‌ కళాశాలలో బీఏ పూర్తి చేసిన తరువాత దిల్లీలోని జేఎన్‌యులో మాస్‌ కమ్యూనికేషన్స్‌లో పట్టా అందుకున్నారు. దిల్లీతోపాటు, ఫ్రాన్స్‌, అమెరికాల్లో కొన్ని పత్రికల్లో సేవల్ని అందించిన తరువాత బెంగళూరుకు తిరిగి వచ్చారు. ఎటువంటి ప్రకటనలూ లేకుండా ‘లంకేష్‌’ అనే పత్రికను నడిపిన తండ్రి అడుగుజాడల్లోనే ఆయన మృతి తరువాత నిర్భయంగా, తాను నమ్మిన విశ్వాసాలకు అద్దం పట్టేలా గౌరీ లంకేష్‌ ఆ పత్రికను కొనసాగించారు. ‘సండే’ పత్రికకు, ఈటీవీ తెలుగుకు బెంగళూరు బ్యూరో ప్రతినిధిగా ఆమె గతంలో కొంతకాలం సేవలందించారు. ఆంగ్లం, కన్నడలో చక్కని భాషా పరిజ్ఞానం ఆమె సొంతం. మావోయిస్టులకు సానుభూతిపరురాలిగా ఉన్న ఆమె.. సాయుధులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు సహకరించారు. మావోయిస్టులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా సేవల్ని అందించారు. కోము సౌహార్థ వేదికె (మత సామరస్య వేదిక) ప్రతినిధిగా దత్తపీఠం, బాబా బుడాన్‌గిరి, తీర ప్రాంత జిల్లాల్లో మత సామరస్యం కోసం వేర్వేరు కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థుల కోసం గైడ్‌ పేరిట మాస పత్రికను ఆమె ప్రచురిస్తూ వస్తున్నారు. పాకిస్థాన్‌ దివంగత నాయకురాలు బెనజీర్‌ భుట్టో జీవన చరిత్రపై ఒక పుస్తకాన్ని రాశారు. రాష్ట్ర పత్రికా అకాడమీ, ప్రెస్‌ క్లబ్‌, సందేశ్‌ పాత్రికేయ పురస్కారాలను ఆమె అందుకున్నారు. ఆదివాసీలు, గిరిజనుల హక్కుల కోసం ఆమె క్రియాశీలకంగా పనిచేస్తూ వస్తున్నారు. 2016 నవంబరులో భాజపా నేతలు వేసిన పరువు నష్టం కేసులో ఆమెకు 6 నెలల జైలు శిక్ష పడింది. అయితే బెయిలుపై బయటే ఉన్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top