యావత్‌ భారతానికి ఆదర్శ రైల్వే స్టేషన్‌గా సికింద్రాబాద్‌

హైదరాబాద్‌: దాదాపు 2 లక్షల మంది ప్రయాణికులు.. 240 రైళ్లు.. 10 ప్లాట్‌ఫారాలు.. ఇంతటి రద్దీని నియంత్రిస్తూనే.. సమయానికి రైళ్ల రాకపోకలు సాగించాలి. ప్రయాణికులకు తాగేందుకు నీరు.. తినేందుకు ఆహారం.. విశ్రాంతి తీసుకునేందుకు గదులు.. మరుగుదొడ్లు ఇలా సౌకర్యాలు కల్పించడమంటే మాటలు కాదు.. కానీ, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లో ఇవన్నీ పక్కాగా జరుగుతున్నాయని అఖిల భారతీయ రైల్వే ప్రయాణికుల సదుపాయాల కమిటీ ఇటీవల కితాబిచ్చింది. యావత్‌ భారతానికి ఇది ఆదర్శ రైల్వే స్టేషన్‌గా నిలుస్తుందని ప్రకటించింది.

* గతేడాది విడుదల చేసిన నివేదికల్లో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ యావత్‌ భారతంలో రెండో స్థానంలో నిలిచింది. పర్యావరణ పరిరక్షనలోనూ మేటిగా నిలిచింది. ఇలా అనేక రంగాల్లో ఆదర్శంగా నిలిచిన రైల్వే స్టేషన్‌ ఇప్పుడు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనలోనూ మేటి అని కమిటీ తేల్చి చెప్పింది. లాధారామ్‌ హెచ్‌ నాగ్విని, బి.రాజవర్థన్‌ రెడ్డి, లోహ్మిప్రసాద్‌ జైస్వాల్‌, మనీషా ఛటర్జీ, రాంధీన్‌ సింగ్‌, ప్రభునాథ్‌ చౌహాన్‌ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ దేశంలోని 600 రైల్వే స్టేషన్లను పరిశీలించింది. కాచిగూడ, నాంపల్లితో పాటు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు అందుతున్న సేవలను క్షేత్రస్థాయిలో తెలుసుకుంది.

సౌకర్యాలపై సమీక్ష

విశ్రాంతి, ప్రయాణికులు వేచి ఉండే గదులు, తాగునీటి సౌకర్యం, లిఫ్టులు, ఎస్కలేటర్లు, స్టేషన్‌ ఆవరణ, సీసీ టీవీల పనితీరు.. ప్లాట్‌ఫారాల మీద ఫలహారాలు అందుతున్న తీరును ఈ కమిటీ ప్రతినిధులు పరిశీలించారు. భోజనశాలలను తనిఖీ చేశారు. ఆహార పట్టిక ప్రకారం ధరలను చూశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు స్టేషన్లోనే బస చేసేందుకు మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన గదుల్లో సౌకర్యాలను తనిఖీ చేశారు. బెడ్‌షీట్లు మార్చుతున్నారా.. పరుపులు ఎలా ఉన్నాయి. ప్రయాణికులు వినియోగించే మరుగుదొడ్ల నిర్వహణను కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులతో మాట్లాడి.. ఇంకా ఎలాంటి సౌకర్యాలు కావాలో విచారించారు.

ప్రయాణికులు సూచించిన అంశాలు ఇవీ..

ఒకటి, పదో ప్లాట్‌పారంపైన మాత్రమే మూత్రశాలలున్నాయని.. వీటిని అన్ని ప్లాట్‌ఫారాలకు విస్తరించాలని ప్రయాణికులు సూచించారు. అల్పాహారంతో పాటు.. భోజనాలు అన్ని ప్లాట్‌ఫారాలపై అందుబాటులో ఉంచాలన్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లో ఎంఎంటీఎస్‌ రైళ్లు ఆగేందుకు ప్రత్యేంగా రెండు ప్లాట్‌ఫారాలు కేటాయించాలని.. ఒక్కోసారి చివరి నిమిషంలో పదో నంబరు ప్లాట్‌ఫారంపై ఆపడంతో.. పరుగులు పెట్టాల్సి వస్తోందన్నారు. దాదాపు 2 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న ఈ స్టేషన్లో ఎస్కలేటర్లన్నీ మధ్యలో ఉన్న ప్లాట్‌ఫారానికే పరిమితం చేయకుండా.. మిగతా వాటికి అమర్చాలని పలువురు కోరారు.

కమిటీ ప్రతినిధులు సంతృప్తి చెందారు

- ప్రసాద్‌, స్టేషన్‌ మేనేజర్‌

స్టేషన్లో ప్రయాణికులకు అందుతున్న సేవలను కమిటీ ప్రతినిధులకు వివరించాం. ఇటీవల వరుసగా వచ్చిన అవార్డులను చూపించాం. పర్యావరణ అవార్డుతో పాటు.. నీటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు, సోలార్‌ విద్యుత్‌ వినియోగం.. వాడిన నీటినే మళ్లీ వినియోగించే ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ పనితీరును చూపించాం. ఇక్కడ అందుతున్న సేవలు పారదర్శకంగా ఉన్నాయని కమిటీ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం 3 పాదచారుల వంతెనలున్నాయని.. మరో వంతెన అందుబాటులోకి వస్తోందని కమిటీ ప్రతినిధులకు చెప్పాం. నాలుగో వంతెన బయట ప్రయాణికులు కూడా వినియోగించుకునే విధంగా నిర్మిస్తున్నట్టు వివరించాం.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top