హైదరాబాద్‌ మెట్రోలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

హైదరాబాద్‌: భవిష్యత్తులో సైబర్‌, రసాయన దాడుల ముప్పు ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రోలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉగ్రవాదులు కొత్త పంథాలో విరుచుపడినా వాటిని ఎదుర్కొనేలా మెట్రోలో అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. రసాయన, జీవ, రేడియోధార్మిక, అణు విస్ఫోటకాలు (కెమికల్‌, బయలాజికల్‌, రేడియోలాజికల్‌, న్యూక్లియర్‌ ఎక్స్‌ప్లోజివ్‌ - సీబీఆర్‌ఎన్‌ఈ)ను ముందే నిరోధించే ప్రత్యేక సెన్సర్లు, అలారం వ్యవస్థను ప్రతి స్టేషన్‌లోనూ ఏర్పాటు చేస్తున్నారు. డిపో, స్టేషన్‌లోకి ప్రవేశించాలంటే మూడంచెల భద్రతా వ్యవస్థను దాటుకుని రావాలి. విమానాశ్రయంలో చేసినట్లే ప్రవేశ మార్గం వద్ద బ్యాగేజీ తనిఖీలు చేస్తారు. ప్రతి ప్రయాణికుడి బ్యాగ్‌ను స్కానింగ్‌ చేశాకే లోపలికి అనుమతిస్తారు.

* యాంటీ టెర్రర్‌ ఏజెన్సీ గ్రూప్‌.. ప్రయాణికులను తనిఖీ చేసి లోపలికి పంపిస్తుంది. దేశంలోని పలు మెట్రోల్లో కేంద్ర బలగాలు ఈ విధులు నిర్వహిస్తున్నాయి. వ్యయం దృష్ట్యా రాష్ట్ర బలగాలనే ప్రత్యేక శిక్షణ ఇచ్చి వినియోగించుకోవాలని

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మూడు షిప్టుల్లో వెయ్యి మందికి పైగా సిబ్బందికిగాను ఏటా రూ.60 కోట్ల భారం భరిస్తామని హెచ్‌ఎంఆర్‌ ముందుకు వచ్చింది.

* ప్రతి కారిడార్‌లో ఒక మెట్రో పోలీస్‌స్టేషన్‌ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. పంజాగుట్ట, పరేడ్‌గ్రౌండ్స్‌, ఎంజీబీఎస్‌ వద్ద మెట్రో పోలీసుస్టేషన్‌ ఏర్పాటు ప్రతిపాదనలు ఉన్నాయి. జంట కమిషనరేట్ల సిబ్బందితో వీటిని ఏర్పాటు చేస్తారు. సీనియర్‌ పోలీసు అధికారి వీటిని పర్యవేక్షిస్తారు.

* రెండో అంచెలో శాంతిభద్రతల పోలీసులు ఉంటారు. నేరాలకు సంబంధించిన విచారణ వీరు చూస్తారు. మెట్రో స్టేషన్‌ ఏ ఠాణా పరిధిలోకి వస్తుందో అక్కడ ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.

* మూడో అంచెలో ప్రైవేటు సెక్యూరిటీ ఉంటారు. ఎల్‌అండ్‌టీ మెట్రోరైలు వీరిని నియమించుకుంటుంది. నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కియోలిస్‌ సంస్థ ఇప్పటికే ప్రైవేటు భద్రతా సిబ్బందిని నియమించింది. వీరు సాధారణ తనిఖీ వ్యవహారాలు చూస్తారు. ప్రత్యేక, శాంతిభద్రతల పోలీసులకు సహాయపడతారు.

అణువణువు పరిశీలించి..: మెట్రోలో ఒక్కోదాంట్లో వెయ్యి మంది ప్రయాణిస్తారు. పూర్తిగా ఎయిర్‌కండిషనింగ్‌ కాబట్టి తలుపులు మూసే ఉంటాయి. ఉగ్రవాదులు రసాయన దాడులు చేస్తే లోపల గాలి కలుషితమై ప్రయాణికులకు ప్రాణాపాయం పొంచి ఉంటుంది. అందుకే మూడంచెల భద్రతతో పాటూ రోజు డిపో నుంచి మెట్రో రైలు బయటకు వచ్చేటప్పుడే స్టైరిలైజ్‌ చేస్తారు. అణువణువు శుభ్రం చేస్తారు. అనంతరం అక్కడ విధుల్లో ఉన్న అధికారి పరిశీలించి ధ్రువీకరిస్తేనే పట్టాలు ఎక్కుతుంది. మన మెట్రోలో సగటున 1.2 కి.మీ.కు ఒక మెట్రో స్టేషన్‌ ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు తలుపులు మూయక్కర్లేదు. అయినా ప్రయాణికుల భద్రత కోసం ముందు జాగ్రత్తగా ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top