వయసుకు తగ్గ ఎత్తు పెరగకపోవడానికి ప్రధాన కారణం

ఎత్తు పెరిగే విషయంలో అపోహలెన్ని ఉన్నా.. పోషకాహార లోపాన్ని అధిగమిస్తే, వయసుకు తగినట్లుగా పొడవు పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయంటున్నారు నిపుణులు. తల్లిలో హిమోగ్లోబిన్‌ లోపం వల్ల శిశువులు తక్కువ బరువుతో పడుతున్నారనీ, గర్భిణులు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు. బిడ్డ గర్భంలో ఉండగానే పోషకాహార లోపం లేకుండా జాగ్రత్త పడాలని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌) సూచించింది. ఐదేళ్ల లోపు పిల్లల ఎత్తుపై అధ్యయనం చేసిన ఎన్‌ఐఎన్‌ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పోషకాహార లోపంతో పొడవు పెరగని తీరును వివరించింది. కరవుతో పాటు పోషకాహారంపై అవగాహన లేకపోవడం

వయసుకు తగ్గ ఎత్తు పెరగకపోవడానికి ప్రధాన కారణమని ఎన్‌ఐఎన్‌ అధ్యయనంలో తేలింది. ఎన్‌ఐఎన్‌ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇటీవల చేపట్టిన సామాజిక అధ్యయనంలోని తాజా గణాంకాలను విడుదల చేసింది. వయసుకు తగిన ఎత్తు పెరగని చిన్నారులు అత్యధికంగా 48.3 శాతం మంది బిహార్‌లో ఉన్నట్లు గుర్తించింది. ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ (46.3), ఝార్ఖండ్‌(45.3), మేఘాలయ (43.8), మధ్యప్రదేశ్‌ (42)ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌(31.4) 18వ స్థానంలో ఉండగా, తెలంగాణ(28.1) 24వ స్థానంలో ఉంది. వయసుకు తగిన ఎత్తులేని చిన్నారులు అత్యంత తక్కువగా 19.7 శాతమే ఉన్న కేరళ అన్ని రాష్ట్రాలకంటే మెరుగైన స్థితిలో ఉండగా, గోవా (20.1) రెండో స్థానంలో ఉంది.

పోషకాహారంపై జాగ్రత్తలివీ..

శిశువుల్లో పోషకాహారం లోపం నివారణకు పుట్టిన వెంటనే ముర్రుపాలు తప్పనిసరిగా పట్టించాలని ఎన్‌ఐఎన్‌ సూచించింది. బిడ్డ పుట్టిన తర్వాత ఆరు నెలల వరకూ తల్లి పాలు తప్ప మరేమీ పట్టకూడదని స్పష్టం చేసింది. దాదాపు 70 శాతం మంది పుట్టిన వెంటనే బిడ్డకు తేనె పీకలు, గ్లూకోజ్‌ నీళ్లు పట్టేసి శిశువుల జీవన సరళిని దెబ్బ తీస్తున్నారని పేర్కొంది. ఆరు నెలల తర్వాత తల్లి పాలతో పాటు.. అదనంగా పోషకాలు అందించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకూ తల్లి పాలు పట్టడంలో తప్పులేదనీ, చిన్నప్పట్నుంచే తాజా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు తినాలనీ, క్రమేణా పిల్లల ఆహారాన్ని పెంచుతూ.. ఆటపాటలతో సాగేలా జాగ్రత్త పడాలని సూచించింది. పదేళ్ల వయసు తర్వాత పాలు, గుడ్లు, మాంసకృత్తులు అందేలా చూడాలనీ, యుక్తవయసు వచ్చే వరకూ అన్ని రకాల ఆహార పదార్థాలు అందుతున్నాయో లేదో చూడాల్సిన తల్లిదండ్రులపై ఉంటుందని పేర్కొంది. మాంసకృత్తులు, నాణ్యమైన ఆహారం, అంటువ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడితే వయసుకు తగ్గ ఎత్తు, బరువు సమకూరుతుందని ఎన్‌ఐఎన్‌ స్పష్టంచేసింది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top