మెట్రో లో తగిన రద్దీ

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రారంభమై రెండున్నర నెలలు కావస్తోంది! మొదట్లో జాయ్‌ రైడ్స్‌ మినహాయిస్తే స్టేషన్లు వెలవెలబోతున్నాయి! ఏ స్టేషన్‌ చూసినా అరకొరగానే ప్రయాణికులు కనిపిస్తున్నారు. ఆ ప్రభావం మెట్రో సిబ్బందిపై పడుతోంది. పెద్ద సంఖ్యలో వారి ఉద్యోగాలపై వేటుపడుతోంది. రెండున్నర నెలల్లోనే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది!? ఈ ప్రశ్నకు జవాబు మెట్రో చార్జీలు! ఇతర వనరుల ఆదాయంతోపాటు చార్జీల ద్వారా కూడా భారీగా దండుకోవాలన్నది ఎల్‌అండ్‌టీ మెట్రో యోచన! మెట్రోకు ప్రకటనల ఆదాయం ఇప్పటికే మొదలైంది. మాల్స్‌ రెడీ అవుతున్నాయి. రియల్‌ రాబడికీ రంగం సిద్ధమైంది. అయినా చార్జీలు భారీగానే ఉన్నాయి. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టు (పీపీపీ)గా హైదరాబాద్‌ మెట్రోకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. దేశంలోనే మొట్టమొదటిసారి ‘రవాణా ఆధారిత అభివృద్ధి’ నినాదంతో దీనిని చేపట్టారు. అంటే, నిర్ణీత మార్గంలో మెట్రో రైలు కారిడార్‌ను నిర్మించడంతోపాటు ఆ మార్గంలోనే రియల్‌ ఎస్టేట్‌ ద్వారా ఆదాయం పొందేలా వందల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను నిర్మాణ సంస్థకు ఉదారంగా అప్పగించారు. అవి కూడా ఎక్కడో నగర శివార్లలోనూ కాదు.. నగరం నడిబొడ్డున, అత్యంత రద్దీ మార్గాలుగా గుర్తించిన పంజాగుట్ట, ఎర్రమంజిల్‌, హైటెక్‌ సిటీ, మియాపూర్‌, రాయదుర్గం, మలక్‌పేట- మూసారాంబాగ్‌ ప్రాంతాల్లోనే.

ఏకంగా 290 ఎకరాల స్థలాన్ని 30 ఏళ్ల వరకు అనుభవించే హక్కును కల్పిస్తూ అప్పగించింది. మెట్రో స్టేషన్లు, మెట్రో పిల్లర్లపై ప్రచార ప్రకటనల ఆదాయం దీనికి అదనం. దాంతో, రియల్‌ ఎస్టేట్‌ ద్వారా 50 శాతం; ప్రచార ప్రకటనలు (యాడ్స్‌) ద్వారా 5 శాతం; టికెట్ల ద్వారా మిగిలిన 45 శాతం ఆదాయాన్ని పొందేలా హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. రియల్‌ ఎస్టేట్‌, ప్రకటనల ఆదాయం వేల కోట్లు వచ్చే అవకాశం ఉన్నా.. ఢిల్లీ మెట్రో కంటే మన దగ్గర ధరలు ఎక్కువ. బెంగళూరు, చెన్నై, ముంబై, కొచ్చి, జైపూర్‌.. ఇలా ఏ మెట్రో ప్రాజెక్టును తీసుకున్నా వాటికి మించిన ధరలు ఇక్కడ ఉన్నాయి. దాని ఫలితమే మూడు నెలలు గడవకముందే మెట్రో ప్రయాణం అంటేనే.. ‘అమ్మో అంత ధరా’ అని భయపడే పరిస్థితి. ప్రజా రవాణాలో అత్యంత కీలకం దినసరి, నెలవారీ పాసులు. మూడు నెలలు గడుస్తున్నా ఉమ్మడి టికెట్‌, పాసులు ఊసే లేకపోవడం మరో కారణం.

త్వరలో మెట్రో మాల్స్‌

హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టులో 50 శాతం ఆదాయం రియల్‌ ఎస్టేట్‌ నుంచే రానుంది. ఇందుకోసం సుమారు 290 ఎకరాలను ఎల్‌అండ్‌టీ సంస్థకు ప్రభుత్వం ఇచ్చింది. ఆ భూముల్లో భారీ మాల్స్‌ నిర్మించేందుకు అవకాశమిచ్చింది. మొత్తం 18.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపార, వాణిజ్య సముదాయాలను నిర్మించి, 30 ఏళ్లపాటు వాటి ద్వారా మెట్రో ఆదాయం పొందనుంది. ఈ వ్యాపార భవనాలన్నీ నగరంలో అత్యంత డిమాండు ఉన్న ప్రాంతాల్లోనే ఉన్నాయి. అందులో భాగంగా, ఇప్పటి వరకు పంజాగుట్ట, ఎర్రమంజిల్‌, హైటెక్‌ సిటీ, మలక్‌పేట- మూసారాంబాగ్‌ ప్రాంతాల్లో 4 మాల్స్‌ నిర్మించారు. వీటి ద్వారా నిర్ణీత ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, మెట్రోలో 64 మెట్రో స్టేషన్లు, 2500 మెట్రో పిల్లర్లు ఉన్నాయి. వీటిపై ఇప్పటికే వ్యాపార ప్రకటనలు కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి మరింత విస్తృతం కానున్నాయి. ఈ నేపథ్యంలో మెట్రోకు భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయినా, టికెట్‌ ధరలను భారీగా నిర్ణయించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన వరాలను వదిలేసి, లాభాపేక్ష కోసమే అన్నట్లు మెట్రో రైలు ప్రాజెక్టును నిర్వహిస్తున్నారన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది.

పార్కింగ్‌తో పెద్ద సమస్య!

మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్‌కు సరైన వసతుల్లేవు. దాంతో వాహనదారులు తమ వాహనాలను ఎక్కడికక్కడే పార్క్‌ చేస్తున్నారు. ఇక, ఇంటర్‌ చేంజ్‌ కావడంతో అమీర్‌పేట స్టేషన్‌కు నిత్యం వేల మంది వస్తుంటారు. అక్కడ సరైన సదుపాయాలు లేకపోవడంతో రోడ్డుకు ఇరువైపులా తమ వాహనాలను పార్క్‌ చేస్తున్నారు. దీంతో పోలీసులు చలానాలు రాస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. మెట్రో స్టేషన్లలో మాల్స్‌ ప్రారంభమైతే ఈ సమస్య మరింత తీవ్రతరం కానుంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top