నంద్యాల: చంద్రబాబుపై రోజా వ్యాఖ్యలు

నంద్యాల: ఏపీ సీఎం చంద్రబాబుపై వైసిపి ఎమ్మెల్యే రోజా శుక్రవారం నిప్పులు చెరిగారు. నంద్యాల ఉప ఎన్నికలకు వంఛనకు, ఆత్మగౌరవానికి మధ్య పోరు అన్నారు. రాయలసీమను చంద్రబాబు భ్రష్టు పట్టించారన్నారు.

చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యల్లో తప్పు ఏముందన్నారు. ఎందుకు ఎగిరెగిరి పడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు తప్పు చేస్తే ప్రజలు నడిరోడ్డుపై ఉరిశిక్ష వేయాలనడంలో తప్పేముందన్నారు.

నంద్యాలలో ఓటమి భయంతో టిడిపి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. శ్రీశైలం నీటిమట్టం 854 అడుగులు ఉంటే రాయలసీమకు నీళ్లు వస్తాయని, కానీ 834 అడుగులకు చేసింది ఎవరని ప్రశ్నించారు. ఇలా చేస్తూ రాయలసీమకు నీళ్లిస్తానని చంద్రబాబు అంటుంటే అందరూ నవ్వుకుంటున్నారని చెప్పారు.

తునిలో రైలు తగులబెడితే రాయలసీమ రౌడీలు తగులబెట్టారని అన్నారని రోజా వ్యాఖ్యానించారు. కాలేజీ ఆడ పిల్లలను చంపుతున్న నారాయణ, చైతన్య కళాశాలలకు చంద్రబాబు అండగా ఉన్నారన్నారు. ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చని చంద్రబాబుకు ఏం శిక్ష వేయాలని రోజా ప్రశ్నించారు.

కుట్రలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని రోజా అన్నారు. 600 హామీలు ఇచ్చింది చంద్రబాబు అన్నారు. 1995లో ఎన్టీఆర్ పక్కన ఉంటూ ఆయనకు వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి 2009లో మీరు ఫినిష్ అవుతారని వైయస్ రాజశేఖర రెడ్డికి చెప్పిన తర్వాత ఆయన చనిపోయినప్పటి వరకు, విభజన విషయంలో చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకొని, సోనియా గాంధీతో కలిసి జగన్‌కు జైలుకు పంపించడం వరకు చంద్రబాబు ఎన్నో కుట్రలు చేశారన్నారు. కిరణ్ సర్కార్‌ను కాపాడారన్నారు.

కుట్రలు, కుతంత్రాలకు చంద్రబాబు ఆదర్శనం అన్నారు. ఎన్టీఆర్‌పై చెప్పులు వేసి, వెన్నుపోటు పొడిచిన దుష్ట సంప్రదాయం ఏ పార్టీకి అయినా ఉందా అని నిలదీశారు. కుట్ర రాజకీయాలు తెలిసిన వ్యక్తి చంద్రబాబు మాత్రమే అన్నారు. పబ్లిసిటీ పిచ్చితో చంద్రబాబు గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంపేశారన్నారు.

రాజకీయ విలువలను, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే.. మీ మంత్రులు, మీ పార్టీ నాయకులు మీరో దేవుడిలా మాట్లాడుతున్నారని ఇది విడ్డూరమన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ ఏడుస్తూ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయేలా చేసిన మీరు మాట్లాడుతారా అన్నారు.

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఐదుసార్లు ఓడిపోయినా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఆయన రెండు నెలలుగా నంద్యాలలో కూర్చొని సొల్లు మాట్లాడుతున్నారన్నారు. బాధ్యతలేని వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి అన్నారు. రాజకీయం కోసం సొంత వదినకు నష్టం చేశావన్నారు. నీ బతుకెంటో, నీ తమ్ముడి బతుకెంటో తుని వెళ్తే తెలుస్తుందని యనమల రామకృష్ణుడిని ఉద్దేశించి అన్నారు.

శోభా నాగిరెడ్డి కూతురు అనే ఒకే ఒక్క కారణంతో తాను అఖిలప్రియను ఇప్పటి వరకు ఏమీ అనలేదని రోజా అన్నారు. ఏ రోజు అయితే నా పైకి నంద్యాలలో మహిళలను పంపించారో, అందుకే ఇప్పుడు నిజాలు చెబుతున్నానని అఖిలపై మండిపడ్డారు.

మంత్రి కావడానికి అఖిలప్రియకు ఉన్న అర్హత ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రం గురించి, రాష్ట్ర సమస్యల గురించి, మహిళల గురించి, చట్టాల గురించి ఆమెకు ఏం తెలుసని నిలదీశారు. చంద్రబాబు కుట్రలకు అంబాసిడర్ అన్నారు. ప్రజలు ఇచ్చే తీర్పును గౌరవించాలన్నారు. ప్రజా కోర్టులో ప్రజలే జడ్జీలు అన్నారు.

జగన్‌కు వ్యతిరేకంగా గురువారం అఖిలప్రియ ధర్నా చేయడంపై రోజా స్పందించారు. నీ తండ్రి (భూమా నాగిరెడ్డి)పై చంద్రబాబు కేసులు పెట్టినప్పుడు, 14 రోజులు ఆయనను జైల్లో పెట్టినప్పుడు ధర్నా చేస్తే ప్రజలు హర్షించేవారన్నారు. నా తండ్రి జైలుకు వెళ్లడానికి చంద్రబాబు కారణం అని చెబితే ప్రజలు మెచ్చుకునే వారన్నారు. తన తండ్రి చావుకు కారణమైన, వెన్నుపోటు నాయకుడి వెంట అఖిలప్రియ ఉంటూ చంద్రబాబుకు రాజకీయ వారసుడిలా మాట్లాడుతున్నార్నారు.

అఖిలప్రియ తల్లి, తండ్రిలను పక్కన పెట్టి చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని విమర్శించారు. అఖిలప్రియ ప్రవర్తన చూస్తుంటే నంద్యాలతో పాటు కర్నూలు జిల్లావాసులు కూడా ఆశ్చర్యపోతున్నారన్నారు.

తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బెల్టుషాపులకు వ్యతిరేకంగా పోరాడానని రోజా చెప్పారు. ఈ రోజు టిడిపి నేతలు తనకు సుద్దులు చెప్పే స్థాయికి ఎదిగారని ఎద్దేవా చేశారు. వాలెంటైన్స్ డే రోజున బీచ్ షో, బికినీ షోలు పెట్టారని, ఇక్కడికి ఏ సంస్కృతిని తీసుకు వచ్చారని మండిపడ్డారు. తాను దానిపై పోరాడానని చెప్పారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top