ఆలయంలో డ్యాన్సర్లతో టీడీపీ నేత చిందులు!

నెల్లూరు: జిల్లాలో ప్రసిద్ది చెందిన ఆలయం ఇప్పుడు రాజకీయ నేతల వివాదాలతో రచ్చకెక్కుతోంది. నెల్లూరుకు కూతవేటు దూరంలో ఉన్నజొన్నలవాడ శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి ఆలయంలో రాజకీనాయ నాయకులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఆలయ ప్రతిష్టను మంటగలుపుతున్నారు. పెన్నానది పక్కనే ఉన్న ఈ ఆలయానికి ఘన చరిత్ర ఉంది. అనాదిగా కామాక్షమ్మ భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. అంతేగాక, ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.

దసరా ఉత్సవాల సమయంలో మహిళలు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాగా, ఆలయానికి 1500ఎకరాల భూములున్నాయి. అవి కూడా ఏడాదికి మూడు పంటలు పండే చక్కటి భూములు. వీటిల్లో వందల కోట్ల రూపాయలు విలువ చేసే సుమారు మూడు వందల ఎకరాల భూములు ఆక్రమణల్లో ఉన్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల చేతుల్లోనే ఈ భూములు ఉన్నట్లు ఆరోపణలున్నాయి.

అంతేగాక, వారికందిన మేర వారు కాజేస్తున్నారనే ఆరోపణలు ఆలయ పూజరులపైనా వినిపిస్తున్నాయి. ఆలయానికి ఇవ్వవలసిన పొలం పూర్తిగా ఇవ్వలేదంటూ ఇటీవల ప్రధాన అర్చకుడిపై కమిషనర్‌ మండిపడ్డారు. పంపకాల విషయంలో తరచుగా వివాదాలు .. గొడవలు జరగడం ఇక్కడ సర్వసాధారణమయ్యాయి. సామాన్య భక్తులకు సరైన దర్శనం లభించకపోవడం మరీ దారుణం.

తాజాగా, మరో వివాదం సంచలనంగా మారింది. ఇటీవల ఆలయ అభివృద్ధి కమిటీని నియమించారు. ఇందులో సింగారెడ్డి లక్ష్మినరసారెడ్డి ఒక సభ్యుడు. బ్రహోత్సవాల సమయంలో ధూంధాంగా డ్యాన్స్‌ కమ్‌ పాట కచేరి ప్రొగ్రామ్‌ ఏర్పాటు చేశారు. అయితే, లక్ష్మీనరసారెడ్డి తనను తాను మర్చిపోయి డ్యాన్సర్లతో కలిసి చిందులు వేశారు. దీంతో పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ కమిటీలో సభ్యుడిగా ఉండి ఇలా చిందులు వేయడమేంటని అంటున్నారు.

కాగా, కొందరు ఆయన డ్యాన్స్‌ను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు. ఫలితంగా విదేశాల్లో ఉన్న ఈ ప్రాంతవాసులకు కూడా విషయం తెలిసిపోయింది. కాగా, గతంలో మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు నరసారెడ్డి. ఆయనతో పాటే అప్పట్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లిపోయారు. ఎంపీటీసీ ఎన్నికల సమయంలో పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చేశారు.

టీడీపీ తరఫున పోటీ చేసి 16 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం నీటి సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. టీడీపీలోకి వచ్చినప్పటి నుంచి అధికారపార్టీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ముఖ్య అనుచరుడిగా మారిపోయారు. దీంతో అడగగానే ఆలయ కమిటీ సభ్యుడి పదవి లభించింది. నరసారెడ్డి ఈ పదవి ఇచ్చే సమయంలో పార్టీ సీనియర్‌ నేతలు కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆలయం చాలా ప్రతిష్టాత్మకమైందనీ... ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగినా పార్టీకి చెడ్డపేరు వస్తుందని సూచించారు. అయితే ఎమ్మెల్యే పోలంరెడ్డి ఇవన్నీ పట్టించుకోకుండా నరసారెడ్డికి పదవి కట్టబెట్టారు.

నరసారెడ్డి డాన్స్‌ల వ్యవహారం మీడియాలో రావడంతో పార్టీకి కూడా కొంత ఇబ్బంది ఎదురయ్యింది. దీంతో నరసారెడ్డి అగ్గిమీదగుగ్గిలయ్యారు. పాత గొడవల వల్ల ఆలయ ప్రధాన అర్చకుడు వీవీఎస్‌జీ ప్రసాద్‌, మరో ఇద్దరు కలిసి డ్యాన్స్‌ విజువల్స్‌ను సామాజిక మాధ్యమాలకు పంపించారని, తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని చెప్పుకొచ్చారు.

అంతేగాక, బ్లాక్‌మెయిల్‌ కూడా చేశారని పోలీసుస్టేషన్‌లో కంప్లయింట్‌ చేశారు నరసారెడ్డి. ఈ కంప్లయింట్‌ను మొదట పోలీసులు కూడా సీరియస్‌గా తీసుకోలేదు.. కాకపోతే పోలంరెడ్డి ఒత్తిడితో ఆలయ ప్రధాన అర్చకుడిపై కేసు పెట్టారు. దీంతో ఈ వ్యవహరం మరింత చర్చకు దారితీసింది. ఆయన చిందులేస్తే తప్పులేదు గానీ, బయటపెట్టిన వారిపై కేసులు పెడతారా? అంటూ పలువురు నిలదీస్తున్నారు. అంతేగాక, ఆలయ ఆస్తులు అన్యాక్రామమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top