పెట్రో ధర..లీటర్ పెట్రోల్ రూ.43 కానుందా!

రోజురోజుకూ అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్న పెట్రోమంటకు ఉపశమనం దొరికే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. దేశంలో రోజు రోజుకూ మండిపోతున్న ఇంధన ధరలు ఆల్ టైమ్ రికార్డులను దాటి పరుగులు తీస్తుండటం పట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతుండటంతో పరిస్థితిని చక్కదిద్ది ప్రజలకు ఉపశమనాన్ని కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ వారంలో కొన్ని చర్యలను చేపట్టే అవకాశం ఉందని సమాచారం. పెట్రోల్ - డీజిల్ రిటైల్ అమ్మకం ధరలో ఒక్క ఎక్సైజ్ సుంకమే పావు శాతం మేరకు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇంధన ధరలను తగ్గించేందుకు కేవలం ఎక్సైజ్ సుంకాన్ని కుదించడంపై మాత్రమే ప్రభుత్వం ఆధారపడకపోవచ్చని సంబంధిత శాఖ వర్గాలు అంటున్నాయి. పెట్రోలియం ధరల పెరుగుదలతో సంక్షోభ స్థితిని ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేందుకు వివిధ రకాల చర్యలను చేపట్టాల్సి ఉందని ఇందుకోసం ముడి చమురు ధరల పెరుగుదలపై ఆర్థిక శాఖ పెట్రోలియం మంత్రిత్వ శాఖను సంప్రదిస్తోందని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి.

కర్ణాటక శాసనసభ ఎన్నికలకు ముందు దాదాపు మూడు వారాల పాటు ఇంధన ధరలను సవరించకుండా స్థిరంగా కొనసాగించిన దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ఆ ఎన్నికల ప్రక్రియ ముగియగానే మళ్లీ బాదుడు మొదలుపెట్టి ప్రజలకు యథేచ్ఛగా వాతలు పెడుతుండటంతో పెట్రోల్ - డీజిల్ ధరలు ఆల్ టైమ్ రికార్డులను దాటి పరుగులు తీస్తున్నాయి. తాజాగా మంగళవారం పెట్రోల్ ధర మరో 32 పైసలు - డీజిల్ ధర 28 పైసల మేరకు పెరుగడంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.76.87కి - డీజిల్ ధర రూ.68.08కి దూసుకెళ్లాయి. కేవలం గత తొమ్మిది రోజుల్లోనే లీటర్ పెట్రోల్ ధర రూ.2.24 - డీజిల్ ధర రూ.2.15 చొప్పున పెరుగడమే ఇందుకు కారణం. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే విషయంలో ప్రభుత్వం ఆర్థిక గణాంకాలను - లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాల్సి ఉంటుందని - పెట్రోలియం ధరల తగ్గింపు కోసం ఎక్సైజ్ సుంకాన్ని కుదించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 2014 నవంబర్ నుంచి 2016 జనవరి మధ్య కాలంలో ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తొమ్మిదిసార్లు పెంచిన నరేంద్ర మోదీ సర్కారు గత ఏడాది అక్టోబర్ లో కేవలం ఒకే ఒక్కసారి లీటర్ కు రూ.2 చొప్పున ఆ సుంకాన్ని తగ్గించి చేతులు దులుపుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పెట్రోల్ - డీజిల్ ధరలు ఎంతగా పెరిగినప్పటికీ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించేందుకు ససేమిరా అంటూ మొండికేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఇంధనంపై విలువ ఆధారిత పన్నును తగ్గించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తోంది. అయితే మహారాష్ట్ర - గుజరాత్ - మధ్యప్రదేశ్ - హిమాచల్ ప్రదేశ్ మినహా మిగిలిన రాష్ర్టాలేవీ ఈ విజ్ఞప్తిని పట్టించుకోలేదు.

ఇదిలాఉండగా..పెట్రోల్ - డీజిల్ ను వస్తు - సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్లు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇదే గనుక జరిగితే జీఎస్టీ శ్లాబులను బట్టి లీటర్ పెట్రోల్ ధర రూ. 38 నుంచి రూ.43 మేరకు - డీజిల్ ధర రూ.31 నుంచి రూ.37 మేరకు తగ్గుతాయి. అయితే ఇంధన ధరల పెరుగుదల కేవలం ఒక రాష్ర్టానికే పరిమితమైన సమస్య కాదని - ఈ అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లి పెట్రోల్ - డీజిల్ ను వస్తు - సేవల పన్ను పరిధిలో చేర్చాల్సిందిగా కోరామని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top