పవన్ రథయాత్ర?, జగన్‌కు కౌంటరా!

విజయవాడ: వైసీపీ ప్లీనరీతో ఏపీలో ఎలక్షన్ ఫీవర్ అప్పుడే మొదలైపోయింది. రెండేళ్లు ముందుగానే పక్కా ప్లాన్ సిద్దం చేసుకుని జగన్ రంగంలోకి దిగిపోయారు. ప్రతిపక్ష పార్టీ వ్యూహామేంటో తేలిపోవడంతో.. అధికార పార్టీ కూడా అందుకు తగ్గట్లుగా అస్త్రాలు సిద్దం చేసుకునే పనిలో పడిపోయింది.

మొత్తం మీద 2019ఎన్నికల్లో టీడీపీ-వైసీపీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని చాలామంది భావిస్తున్నా.. మధ్యలో జనసేన ప్రభావం కూడా కొట్టిపారేయలేనిది. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోను క్షేత్ర స్థాయి శిబిరాల నిర్వహణతో కార్యకర్తల ఎంపిక చేపట్టి పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మొదలుపెట్టారు పవన్.

దీనికి తోడు పార్టీకి దన్నుగా నిలిచేందుకు సిద్దాంతకర్తలను, న్యూస్ ఛానెల్ ఎడిటర్స్, మాజీ రాజకీయ ప్రముఖులతోను పవన్ టచ్ లో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం ఇలా ఉండగానే మరో ఆసక్తికర ఊహాగానం ఇప్పుడు తెర పైకి వచ్చింది.

పవన్ తన పుట్టినరోజైన సెప్టెంబర్ 2 నాడు రథయాత్ర ప్రారంభించబోతున్నారనేది దాని సారం. అదే గనుక జరిగితే పవన్ రథయాత్ర జగన్ పాదయత్ర కన్నా ముందే మొదలవుతుంది. జగన్ తన పాదయాత్రను అక్టోబర్ 27నుంచి ప్రారంభిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ లెక్కన పవన్ పాదయాత్ర జగన్ కు కౌంటర్ గానే అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

పవన్ రథయాత్ర ప్రస్తుతానికి ఊహాగానమే అయినప్పటికీ.. కానీ ఏకకాలంలో జగన్ తో ఆయన పోటీ పడాలనుకోవడం ఏపీ రాజకీయాలను మరింత హీటెక్కించే అవకాశం ఉంది. గతంలో క్షేత్రస్థాయిలో పర్యటించాలనుకుంటున్నానని పవన్ ఇచ్చిన సంకేతాల మేరకే ఇప్పుడు రథయాత్ర ప్రయత్నాలు మొదలయ్యాయన్న వాదన వినిపిస్తోంది.

ఒకప్పుడు హోదాపై గట్టిగా నినదించిన వైసీపీ.. బీజేపీకి దగ్గరవుతూ ఇటీవల ఆ అంశానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కానీ పవన్ మాత్రం వచ్చే ఎన్నికల్లో హోదా అంశాన్ని ప్రధాన అస్త్రంగా సంధించే అవకాశం లేకపోలేదు. ఆ లెక్కన వైసీపీకి పవన్ కొంత ప్రతికూలంగా మారే అవకాశం లేకపోలేదు.

పవన్, జగన్‌ల కన్నా ముందు ఏపీలో ముద్రగడ పాదయాత్ర కూడా కుల సమీకరణాలను ప్రభావితం చేయనుంది. ముద్రగడ ఉద్యమానికి వైసీపీ తొలి నుంచి మద్దతుగానే నిలబడుతూ వస్తోంది. మరోవైపు పవన్ మాత్రం తన కుల రాజకీయాలకు దూరమంటూ ఇప్పటిదాకా ఈ ఉద్యమం పట్ల స్పందించలేదు. రథయాత్ర ప్రారంభించే నాటికి ఆయన ఇదే వైఖరిని కొనసాగిస్తే.. తన సొంత సామాజిక వర్గమైన కాపుల నుంచి పవన్ కు నిలదీత తప్పకపోవచ్చు.

ఇక తొలి నుంచి సీఎం చంద్రబాబుతో పవన్‌కు ఉన్న సఖ్యత రీత్యా.. టీడీపీని ఆయన శత్రువుగా భావిస్తారని చెప్పడం కష్టమే. కాబట్టి టీడీపీతో పవన్‌ది మిత్ర వైరుధ్యమే అన్న విషయం దీనితో స్పష్టమవుతోంది. అదే సమయంలో బీజేపీతో దాదాపు తెగదెంపులు అయిపోయాయి. ఇక మిగిలింది వైసీపీ మాత్రమే. ఆ పార్టీని పవన్ శత్రువుగా చూస్తారా? లేక ఎలాంటి స్ట్రాటజీ అవలంభిస్తారన్నది తేలాలి.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top