ప్రజల కష్టాలపై మథనపడి జనసేనాని

విశాఖపట్నం: రాజకీయవ్యవస్థలోకి కొత్త రక్తం వస్తే తప్ప ప్రక్షాళన సాధ్యం కాదని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. విశాఖ పోర్టు కళావాణి స్టేడియంలో ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. జనసేన కూడా ప్రజారాజ్యంలాగానే అవుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారని.. ప్రజల కష్టాలపై మథనపడి జనసేనానిగా నిలబడడానికి 25 ఏళ్లు పట్టిందని.. మరో 25 ఏళ్లు కష్టపడతానని, ఈ భూమి వదిలి వెళ్లేలోపు కొంతైనా మార్పు తెస్తానని చెప్పారు. ప్రజారాజ్యం పార్టీని దెబ్బతీసిన వారెవరినీ మర్చిపోనని, చిరంజీవికి ద్రోహం చేసిన వాళ్లని వదలనని హెచ్చరించారు. పదవి కోసం జనసేనలో చేరొద్దన్నారు. పాదయాత్రలు చేసి ముఖ్యమంత్రి అవ్వాలని అనుకోవడం లేదన్నారు. లోకేష్‌లో ఏదో ప్రతిభ చూసే మంత్రి పదవి ఇచ్చి ఉంటారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై ఈ పర్యటన చివర్లో మాట్లాడతానని చెప్పారు. పోలవరంలో ఎంత అవినీతి జరుగుతుందో తెలుసు.. ఆంధ్ర వల్ల అన్యాయం జరిగిందని ఆరోపించిన తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను ఇప్పుడు ఆంధ్ర గుత్తేదారులకే అప్పజెప్పిందని.. రాజులు మారినా అవినీతి మారలేదని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ప్రతిభ చూపించాలని.. తండ్రి చనిపోగానే ముఖ్యమంత్రి అవుతానంటే ఎలా..? మంత్రుల పిల్లలు మంత్రులు.. ఎమ్మెల్యేల పిల్లలు ఎమ్మెల్యేలైతే.. వ్యవస్థ ఎప్పుడు బాగుపడుతుందని ప్రశ్నించారు. పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్రరెడ్డి, మీడియా ఇన్‌ఛార్జి హరిప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

డీసీఐపై ప్రధానికి పవన్‌ లేఖ

గత నాలుగేళ్లలో తాను ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని ఏమీ అడగలేదని, మొట్టమొదటిసారిగా విశాఖలోని డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(డీసీఐ)ను ప్రైవేటీకరించవద్దని కోరుతూ ప్రధానికి లేఖ రాస్తున్నానని చెబుతూ పవన్‌కల్యాణ్‌ దానిని ప్రదర్శించారు. ప్రైవేటీకరిస్తే భాజపా ఓటమి విశాఖ నుంచే ప్రారంభమవుతుందన్నారు. బుధవారం ఆ సంస్థ ఉద్యోగుల నిరాహారదీక్ష శిబిరానికి వెళ్లి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగి వెంకటేశ్‌ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. మద్దతుగా శిబిరంలో కూర్చున్నారు. లాభాలబాటలో ఉన్న ఈ సంస్థను విక్రయించడమేమిటని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బంది కలిగేలా మాట్లాడితే తనకు సమస్యలు సృష్టిస్తారని భయపెడుతుంటారని చెప్పారు. ‘ఏం పీకుతారు ఎవరైనా సరే? ఏం చేస్తారు? నిజాయితీగా బతికాను. కోడిగుడ్డు మీద ఈకలు పీకాలనుకుంటే పీక్కోండి?...’ అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు, ఎంపీలు హరిబాబు, అవంతి శ్రీనివాసరావు, గంగరాజు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి న్యాయం చేయాలని చెప్పారు. వైకాపా అధినేత జగన్‌ కూడా అండగా నిలబడాలన్నారు. తగిన నష్టపరిహారం ప్రకటించి వెంకటేశ్‌ కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. ఆయన అక్క సంధ్య, చెల్లి శిరీషలను పవన్‌కల్యాణ్‌ ఓదార్చి ధైర్యం చెప్పారు. సి.ఐ.టి.యు. రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వెంకటరావు, జి.వి.ఆర్‌.మూర్తి పాల్గొన్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top