పట్టాదారులకే భూమి ఫై హక్కు

తెలంగాణలో భూములపై సర్వహక్కులు పట్టాదారులకే ఉంటాయి. ఇకపై కౌలుదారులు, తాకట్టుదారులు అన్న పదాలను ప్రభుత్వం తొలగించింది. రైతులందరికీ పట్టాదారు పాసుపుస్తకాలను ఎలక్ట్రానిక్‌ రూపంలో అందించనుంది. బ్యాంకులు, రుణాలు జారీ చేసే సంస్థలు మా భూమి(వెబ్‌ల్యాండ్‌)లో 1బి సమాచారం ఆధారంగానే రుణాలు అందించాల్సి ఉంటుంది. భూమి హక్కుపత్రాలు(టైటిల్‌డీడ్‌) తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. సరైన పత్రాలు లేనప్పటికీ ఐదు ఎకరాల లోపు ఆధీనంలో భూములపై హక్కుల కోసం డిసెంబర్‌ 31లోపు దరఖాస్తు చేసుకున్న వారికి క్రమబద్ధీకరించే అవకాశం తహసీల్దార్లకు కల్పించారు. అలాగే భూమి హక్కుల బదిలీ కాలపరిమితిని 90 రోజుల నుంచి 15 రోజులకు కుదించారు. తెలంగాణ భూమిపై హక్కులు, పట్టాదారు పాసుపుస్తకం చట్టం-1971 సవరణ బిల్లును శాసనసభ సోమవారం ఆమోదించింది. ఇకపై పాసుపుస్తకం, భూ యాజమాన్య హక్కు పత్రాలను సమ్మిళితం చేసి ఎలక్ట్రానిక్‌ రూపంలో ఒకే హక్కుపత్రాన్ని ప్రభుత్వం జారీచేస్తుంది.

రికార్డుల నిర్వహణ ఎలక్ట్రానిక్‌ రూపంలో

భూమి రికార్డుల వివరాలను కంప్యూటరీకరించి వాటిని తెలంగాణ భూమి రికార్డుల నిర్వహణ పద్ధతి(టీఎల్‌ఆర్‌ఎంఎస్‌)లో ఎలక్ట్రానిక్‌ రూపంలో పొందుపరుస్తారు. ఇకపై జాగీరు, పైగా, సంస్థాన్‌, మక్తా, విలేజ్‌ అగ్రహారం, ఉమ్లీ, ముకాస తదితర పేర్లతో ఉన్న జాగీర్‌ భూములన్నీ ఇక ప్రభుత్వ భూములే. ఈమేరకు రెవెన్యూ రికార్డుల్లోనూ మార్పులు చేస్తారు.

* భూమి రికార్డుల్లో అచ్చుతప్పులు, పేర్లలో తప్పులు నమోదయ్యాయని పట్టాదారు లేదా ఆ భూములపై హక్కులున్న వారు దరఖాస్తు చేసుకుంటే సరిచేసే అధికారం తహసీల్దార్లకు ఉంటుంది.

* భూమి హక్కుపత్రాల్లో ఇకమీదట పట్టాదారు పేరు మాత్రమే ఉంటుంది. భూమి మ్యుటేషన్‌ను 15 రోజుల్లో పూర్తిచేసి రికార్డుల్లో మార్పులు చేయాలి.

* రిజిస్ట్రేషన్‌ సమయంలో సంబంధిత అధికారులు భూముల వివరాలను వెబ్‌ల్యాండ్‌ డేటాలో సరిచూసుకుని వాటిని రిజిస్ట్రేషన్‌ చేయాలి. దీంతోపాటు ఆ సమాచారాన్ని టీఆర్‌ఎల్‌ఎంఎస్‌, మీసేవ పోర్టర్ల ద్వారా అమలు చేసేలా చూడాలి.

* ఎలక్ట్రానిక్‌ రూపంలోని ఆర్‌ఓఆర్‌ 1బి సమాచారాన్ని చూసి రుణాలు మంజూరు చేయాలి.

* తెలంగాణ భూమిహక్కులు పట్టాదారు పాసుపుస్తకాల చట్ట సవరణ-2017 అమల్లోకి వచ్చేంత వరకు పాత నిబంధనల ప్రకారం అర్జీలన్నీ పరిష్కరించాలి.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top