పరిటాల శ్రీరాం వర్సెస్‌ ఎమ్మెల్యే సూరి

అనంతపురం: ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని ఓ బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించి 13 ఎకరాల పొలం ఉంది. ప్రస్తుత మార్కెట్‌లో ఈ భూమి విలువ రూ.7కోట్ల పైమాటే. ఓ ముస్లిం వ్యక్తి ఈ పొలాన్ని కొనుగోలు చేయగా.. అందులో తమకూ హక్కు ఉందని ఇటీవల ముగ్గురు వ్యక్తులు తెర మీదకొచ్చారు. వీరిలో ఒకరు ఎమ్మెల్యే సూరి వర్గీయుడైన వెంకటేష్‌. ఆ పొలంలో 7 ఎకరాలు తనదనేది ఇతని వాదన. ఈ నేపథ్యంలో వ్యవహారాన్ని పొలం కొనుగోలు చేసిన ముస్లిం వ్యక్తి పరిటాల శ్రీరాం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే ‘పంచాయితీ’ తెంచేందుకు పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్‌ చేసినట్లు సమాచారం. ఆ మేరకు రంగంలోకి దిగిన శ్రీరాం అనుచరులు ‘కొంత మొత్తం ఇస్తాం.. పొలం వదిలెయ్‌’మని ఒకసారి, స్థలం మరోచోట ఇప్పిస్తామని ఇంకోసారి వెంకటేష్‌తో బెదిరింపులకు పాల్పడినా ఫలితం లేకపోయింది. చివరకు జేసీబీలతో పొలం చదును చేసే ప్రయత్నంలో ఉండగా వెంకటేష్‌ హైకోర్టును ఆశ్రయించడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే సమయంలో ఎమ్మెల్యే సూరి అండ కోరినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న శ్రీరాం వర్గీయులు మరింత రెచ్చిపోయి బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం.

కలకలం రేపిన కిడ్నాప్‌
గత మే 10న పరిటాల శ్రీరాం ఓ కేసు విషయమై ధర్మవరం కోర్టుకు హాజరయ్యాడు. ఆ సమయంలో వెంకటేశ్‌ వ్యవహారం కూడా శ్రీరాం అనుచరులు చర్చించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత నాలుగు రోజులకే ధర్మవరం ఆర్డీఓ ఆఫీసు ఎదుట వెంకటేశ్‌ను కిడ్నాప్‌ చేశారు. శ్రీరాం అండతో రామగిరి సర్పంచ్‌ శ్రీనివాసులు అలియాస్‌ శీన ఈ కిడ్నాప్‌ చేసినట్లు తెలిసింది. విషయం ఎమ్మెల్యే సూరి దృష్టికి వెళ్లడంతో ఎస్పీతో మాట్లాడి, వెంకటేశ్‌ను విడుదల చేయించేందుకు చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరినట్లు సమాచారం. అదేవిధంగా ఇన్‌చార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆ మేరకు పోలీసులు రంగ ప్రవేశం చేయడం.. విషయం ఉన్నత స్థాయిలో చర్చనీయాంశం కావడంతో కిడ్నాప్‌ చేసి రామగిరికి తీసుకెళ్లిన వెంకటేశ్‌ను అక్కడి పోలీసుస్టేషన్‌లో అప్పగించినట్లు సమాచారం. ఆ తర్వాత అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో ఆయనను వదిలేసినట్లు తెలుస్తోంది.

‘దందాలకు పాల్పడితే గట్టిగా ఉండాలి’
ఒకే పార్టీలోని రెండు ముఖ్య వర్గాల మధ్య వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతోంది. సర్దిచెప్పాల్సిన టీడీపీ రాష్ట్రస్థాయి ముఖ్యనేత పోలీసు శాఖ ఉన్నత స్థాయి అధికారితో ఆరా తీసి.. ఒక వర్గానికే కొమ్ము కాస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘కిడ్నాప్‌ చేసి దందాలకు పాల్పడితే గట్టిగా ఉండాలి. అవసరమైతే అడ్డు తొలగించాలి’ అని చెప్పినట్లు సమాచారం. ఈ ‘ల్యాండ్‌’మైన్‌ రెండు వర్గాల మధ్య ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని టీడీపీ వర్గీయుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ‘పంచాయితీ’లో ఎవరి బేరం బెడిసికొట్టినా.. గొడవకు సిద్ధంగా ఉన్న ట్లు సమాచారం. ఇదే సమయంలో ధర్మవరం, రాప్తాడులో ఈ విషయమై ప్రజలతో పాటు రాజకీయ, వ్యాపార వర్గాల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top