ఉద్యోగాలు ఇవ్వడమే మా లక్ష్యం

రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటి వరకూ 194 ఐటీ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయని, 12,274 మందికి ఉద్యోగాలు, 36,822 మందికి పరోక్షంగా అవకాశాలు లభించాయని పంచాయతీరాజ్‌, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ మంగళవారం శాసనసభకు వివరించారు. ఎమ్మెల్యేలు ఎ.రాధాకృష్ణ, గణేష్‌, విష్ణుకుమార్‌రాజు ఐటీ రంగ పురోగతి, ఉద్యోగావకాశాలపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. ‘‘ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు భూములిస్తే తామే నిర్మించుకుంటామని 40శాతం మంది, భవనాలు ఇవ్వాలని 60శాతం మంది కోరుతున్నారు. కోటి చదరపు అడుగుల భవనాలను అందుబాటులోకి తేవాల్సి ఉంది. 408 అవగాహన ఒప్పందాల ద్వారా రూ.14,738 కోట్ల పెట్టుబడులు, 13,80,000 ఉద్యోగాల సాధన మన లక్ష్యం. వారందరితో మాట్లాడుతున్నా. పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ డ్యాష్‌బోర్డు ద్వారా సమీక్షిస్తున్నా’’ అన్నారు

.

* మిలీనియం టవర్స్‌ను నెలాఖరుకు ముఖ్యమంత్రి ద్వారా ప్రారంభిస్తాం.

* దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలోనే 10లక్షల ఐవోటీ పరికరాలు వాడుతున్నాం.

* 2019 నాటికి ఐటీలో లక్ష, ఎలక్ట్రానిక్స్‌లో 2లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నాం

.

* రాష్ట్రంలోకి వచ్చే ప్రతి 10 ఐటీ ఉద్యోగాల్లో 6 విశాఖపట్నం, 2 అమరావతి, 2 రాయలసీమకు లభిస్తున్నాయి.

* 2014 నాటికి దేశంలో తయారయ్యే ప్రతి 10 ఫోన్లలో మన రాష్ట్రం నుంచి ఒక్కటీ లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ నుంచి 2 వస్తున్నాయి. దీన్ని 5 చేయాలని సీఎం సూచించారు.

పనిచేయని సర్పంచులపై చర్యలు..

పంచాయతీలకు నిధులున్నా కొందరు సర్పంచులు సరిగా ఖర్చుచేయటం లేదు, ఆ నిధుల వ్యయాన్ని ఆన్‌లైన్‌ చేసి, పనిచేయని సర్పంచుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం..అని మంత్రి లోకేష్‌ స్పష్టం చేశారు. శాసనసభలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

* వాటర్‌ కార్పొరేషన్‌ ద్వారా 2019 నాటికి ప్రతి గ్రామానికి కుళాయి నీరిస్తాం.

* రాష్ట్రంలో 4,500 పంచాయతీల్లో కార్యదర్శులు లేరు. ఒప్పంద ప్రాతిపదికపై తీసుకోబోతున్నాం.

* 2018 నవంబరు 2 నాటికి అన్ని గ్రామాల్లో 30లక్షల ఎల్‌ఈడీ దీపాలు వెలిగిస్తాం.

ముందు కాల్వలు.. తర్వాతే రహదారులు

పంచాయతీల్లో కాల్వల నిర్మాణానికి సిమెంటు రహదారులనూ తవ్వేస్తున్నారని, రోడ్లతో పాటే కాల్వల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే ఆంజనేయులు కోరారు. మురుగునీరు, వర్షపునీరు అంచనా వేశాకే కాల్వల ఆకృతులు రూపొందించాలని శాసనసభాపతి కోడెల శివప్రసాద్‌రావు సూచించారు. గ్రామాల్లో ముందు కాల్వలు, తర్వాతే రోడ్లకు ప్రాధాన్యమిస్తామని మంత్రి లోకేష్‌ వివరించారు.

వైకాపా లేఖల్లో వాస్తవం లేదని కేంద్రం గుర్తించింది...

రాష్ట్రానికి రావాల్సిన ఉపాధి నిధులను అడ్డుకునేందుకు వైకాపా ఎంపీలు రాసిన లేఖల్లో వాస్తవం లేదని కేంద్రప్రభుత్వం గుర్తించిందని మంత్రి లోకేష్‌ అన్నారు. ఆ తప్పుడు లేఖల ఫలితంగా ఆరేడు నెలలపాటు ఉపాధి పనులకు ఆటంకం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. వీటన్నింటిపైన సమగ్ర వివరాలతో బుధవారం శాసనసభలో ప్రజంటేషన్‌ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో ఆయన ముచ్చటించారు. ఫైబర్‌గ్రిడ్‌ అంశంలో ఆంధ్రప్రదేశ్‌ అమలుచేస్తున్న నమూనా దేశానికే ఆదర్శంగా ఉందని, బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీ కూడా ఏపీ తరహా విధానం అమలుచేస్తామని చెప్పారని లోకేష్‌ వ్యాఖ్యానించారు.

శ్రీకాకుళం జిల్లా ప్రజాప్రతినిధుల భేటీ

శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం, ఫ్లోరైడ్‌ ప్రభావిత, గిరిజన ప్రాంతాలకు ప్రాధాన్యాల వారీగా తాగునీటిని అందించాలని మంత్రులు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావులు లోకేష్‌ను కోరారు. ఆ జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి వారు లోకేష్‌ను కలసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటు నుంచి శ్రీకాకుళం జిల్లాను తప్పించారంటూ జరుగుతున్న ప్రచారాన్ని లోకేష్‌కు వివరించగా.. దాన్ని ఆయన ఖండించారు.

రూ.1000 కోట్లు సంపాదించొచ్చు

గ్రామాల్లో మురుగు కాల్వల నిర్వహణను ఎస్సీ కార్పొరేషన్‌కు అనుసంధానించి సాంకేతిక శుభ్రత విధానం తీసుకురానున్నట్లు లోకేష్‌ చెప్పారు. 5వేలకు పైగా జనాభా ఉన్న గ్రామాల్లో భూగర్భ మురుగు కాల్వ వ్యవస్థకు రూ.800కోట్లు ఖర్చు పెడుతున్నాం. పల్లెల్లో ఇంటికి రెండేసి బుట్టలిచ్చి తడి, పొడి చెత్త సేకరిస్తాం. తడిచెత్తతో వర్మికంపోస్టు తయారుచేసి పాణ్యం నియోజకవర్గంలోని పెద్దాడ పంచాయతీ ఏటా రూ.35లక్షలు సంపాదిస్తోంది. ఇదే పంథాలో రాష్ట్రవ్యాప్తంగా ఇలా రూ.1,000కోట్లు సంపాదించొచ్చు’ అని మంత్రి వివరించారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top