తెలంగాణలో మరో కొత్త రాజకీయ వేదిక ఆవిర్భవం

హైదరాబాద్‌: తెలంగాణలో మరో కొత్త రాజకీయ వేదిక ఆవిర్భవించింది. ప్రస్తుత రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా ‘బహుజన వామపక్ష కూటమి’ (బీఎల్‌ఎఫ్‌) నూతనంగా ఏర్పడింది. ఎంసీపీఐ, ఆర్‌ఎస్‌పీ, ఫార్వర్డ్‌బ్లాక్‌, తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ, బహుజన ఫ్రంట్‌, ఎంబీటీ, మహాజన సమాజం తదితర 28 పార్టీలు, ప్రజాసంఘాలతో కూడిన బీఎల్‌ఎఫ్‌ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 119 స్థానాల్లోనూ బరిలోకి దిగనుంది. ఈ నెల 25న భారీగా ఆవిర్భావ సభను హైదరాబాద్‌లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, అంబేడ్కర్‌ మనుమడు ప్రకాష్‌ అంబేడ్కర్‌, పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు హాజరయ్యేలా ప్రణాళిక రూపొందించారు. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కూటమి పనిచేస్తుందని ముసాయిదాలో పేర్కొన్నారు. ఈ కూటమికి రాష్ట్ర కన్వీనర్‌గా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఛైర్మన్‌గా సూర్యప్రకాశరావు ఉండాలని బీఎల్‌ఎఫ్‌ గురువారం నాటి సమావేశంలో అభిప్రాయపడింది. అయితే ఈ నెల 25న హైదరాబాద్‌లో జరగనున్న సభలో బీఎల్‌ఎఫ్‌ నూతన కమిటీని ఎన్నుకోవాలని నిర్ణయించారు. బహుజన వామపక్ష కూటమి కన్వీనర్‌గా ఎన్నికైన తమ్మినేని విలేకర్లతో మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం కల్పించడమే తమ లక్ష్యమన్నారు. సీపీఐ, న్యూడెమోక్రసీ, ఇతర వామపక్ష పార్టీలను కూడా కూటమిలోకిఆహ్వానిస్తున్నామన్నారు. సమావేశంలో కంచ ఐలయ్య, గద్దర్‌, కాకి మాధవరావు, తదితరులు పాల్గొన్నారు.

సీపీఐ మరో వేదిక: ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఆవిర్భావ దిశగా ఏర్పాట్లు సాగుతుండగా.. మరోవైపు మరో కొత్త వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు సీపీఐ గురువారం ప్రకటన విడుదల చేసింది. ఎన్‌డీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ విస్తృత స్థాయిలో లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష పార్టీలతో వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. విజయవాడలో జరిగిన సీపీఐ జాతీయ సమితి సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top