శిల్పాతో సై.. ఎవరీ బ్రహ్మానంద రెడ్డి?

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా భూమా బ్రహ్మానంద రెడ్డిని ఖరారు చేశారు. శనివారం జిల్లా నాయకులతో ముఖ్యమంత్రి అమరావతిలో సమావేశం నిర్వహించారు.

చర్చల అనంతరం భూమా నాగిరెడ్డి కుటుంబానికే టిక్కెట్టు ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు చెప్పారు. అనంతరం భూమా బహ్మ్రానంద రెడ్డి నంద్యాల నియోజక వర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పారు.

భూమా బ్రహ్మానందరెడ్డి దివంగతనేత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సోదరుడు భూమా శేఖర్‌రెడ్డి కొడుకు. శేఖర్ రెడ్డి 1987లో బండి ఆత్మకూరు మండలంలోని పరమటూరు సహకార పరపతిసంఘం అధ్యక్షులుగా ఎన్నికై కర్నూలు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులుగా సేవలందించారు.

అనంతరం 1989లో ఆళ్లగడ్డ శాసన సభ్యులుగా ఎన్నికై 1991 జూన్‌ 7 వ తేదీన మృతి చెందారు. అనంతరం ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి టిడిపి తరఫున భూమా నాగిరెడ్డి ఉప ఎన్నికలో పోటీ చేసి గెలుపొందారు. చిన్నాన్న దుర్మరణంతో ప్రస్తుతం బ్రహ్మానంద రెడ్డి పోటీ చేస్తున్నారు. తండ్రి ( శేఖర్ రెడ్డి) చనిపోతే చిన్నాన్న (భూమా నాగిరెడ్డి) పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు నాగిరెడ్డి మృతితో బ్రహ్మానంద రెడ్డి పోటీ చేయనున్నారు.

భూమా బ్రహ్మానంద రెడ్డి 1985 ఏప్రిల్ నెల 4వ తేదీన రాయచోటిలో జన్మించారు. చెన్నైలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. ఇంటర్, బిటెక్ హైదరాబాదులో చదివారు. ఇంటర్ చదివే రోజుల్లోనే భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డిల తరఫున ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి కుటుంబంలో ఉంటూ 2013లో జగన్ పాల డెయిరీ ఎండీగా పని చేస్తున్నారు.

కర్నూలు జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ సందర్భంగా నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థిగా బ్రహ్మానంద రెడ్డి పేరే వచ్చిందని, ఇతరుల పేర్లను చర్చించలేదని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి గురించి తమకు తెలుసునని, వైసిపి అభ్యర్థి ఆయనే అయితే ఎలా ఎదుర్కోవాలో కూడా తెలుసునని చెప్పారు.

నంద్యాల ఉప ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తామని టిడిపి చెబుతోంది. అవసరమైతే తాము ప్రతిపక్ష నేతలతో మాట్లాడుతామని మంత్రి కాల్వ శ్రీనివాసులు చెప్పారు. ఎవరైనా చనిపోతే, వారి స్థానంలో కుటుంబ సభ్యులు నిలబడితే పోటీ నిలబెట్టవద్దనే సంప్రదాయం ఉందని, దానిని ప్రతిపక్షాలు పాటించాలని కోరారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top