సొంత కూతురిని విక్రయించి... అపహరణ నాటకం

మెహిదీపట్నం: సొంత కుమార్తెను రూ.46వేలకు విక్రయించి, కిడ్నాప్‌డ్రామా ఆడిన వ్యక్తితో పాటు చిన్నారిని కొనుగోలు చేసిన భార్యాభర్తలను లంగర్‌హౌస్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ ఎం.అంజయ్య కథనం ప్రకారం... పాతబస్తీ డబీర్‌పురాకు చెందిన మస్తాన్‌ ఆటో డ్రైవర్‌. ఈనెల 8న ఠాణాకు వచ్చి, ఈనెల 4న బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పీవీ ఎక్స్‌ప్రెస్‌ 70వ నంబరు స్తంభం వద్ద తన 9 నెలల బిడ్డ నూరీన్‌ బేగంను కిడ్నాప్‌ చేశారని ఫిర్యాదు చేశాడు. తనను కూడా లింగంపల్లి వరకు తీసుకెళ్లిన దుండగులు, రూ.5వేలు చేతిలో పెట్టి పారిపోయారని వివరించాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు నిఘా ఉంచారు. శేరిలింగంపల్లి, గుల్మార్‌ పార్కు సమీపంలోని ఓ ఇంట్లో చిన్నారి ఉన్నట్లు క్రైం ఎస్సై సి.అంజయ్య గుర్తించి చిన్నారిని రక్షించారు.

విచారణలో వెలుగులోకొచ్చిన అసలు విషయం..
ఈనెల 4న మస్తాన్‌ ఆయన భార్య రిజ్వానా చిన్నారితో కలిసి అత్తాపూర్‌లోని కల్లు కంపౌండ్‌కు వచ్చారు. ఇద్దరు కలిసి కల్లు తాగారు. రిజ్వానా మత్తులోకి వెళ్లింది. ఇదే అదనుగా మస్తాన్‌ కుమార్తెను బేరానికి పెట్టాడు. శేరిలింగంపల్లి, గుల్మార్‌ పార్కు ప్రాంతానికి చెందిన మేస్త్రీ వేమల బాల్‌రాజ్‌, బాలమణి దంపతులకు సంతానం లేకపోవడంతో రూ.46వేలకు మస్తాన్‌ నుంచి చిన్నారి(9 నెలలు)ని కొనుగోలు చేశారు. దీంతో దంపతులతో పాటు మస్తాన్‌ను అరెస్టు చేశారు. రూ.14వేలు స్వాధీనం చేసుకుని, చిన్నారి నూరీన్‌బేగంను తల్లి రిజ్వానాకు అప్పగించారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top