టీడీపీలో చేరికపై వివేకా సంచలన వ్యాఖ్యలు

నెల్లూరు: సింహపురి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుని మూడు దశాబ్దాలకు పైగా నెల్లూరులోనే ఉంటూ అందరినీ బాస్‌.. అని పలకరించే వివేకా మూడు నెలలుగా హైదరాబాద్‌కే పరిమితమయ్యారు.

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని ఆనం బ్రదర్స్‌కి సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినా, అది నెరవేరకపోవడంతో వారి అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ‘ఆనం బ్రదర్స్‌'గా ముద్ర వేసుకున్న ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానందరెడ్డిలు మూడు దశాబ్దాలుగా ఎన్నో పదవుల్లో కొనసాగారు. 2016 జనవరి 17న కాంగ్రెస్‌ను వీడి సీఎం చంద్రబాబు సమక్షంలో వీరు సైకిలెక్కారు. ఆ రోజు రామనారాయణరెడ్డికి ఆత్మకూరు ఇన్‌చార్జి పదవి, వివేకాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేలా ఒప్పందంతో పార్టీలో చేరారని ప్రచారం సాగింది.

ఆనం సోదరులకు ఇచ్చిన హామీ మేరకు.. ఆర్నెల్ల తరువాత రామనారాయణరెడ్డికి ఆత్మకూరు ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగిస్తూ టీడీపీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆనం వివేకానందరెడ్డికి ఇచ్చిన ఎమ్మెల్సీ హామీ మాత్రం ఏడాది దాటినా కార్యరూపం దాల్చలేదు. దీంతో గత ఏడాది డిసెంబరులో సీఎంను కలిసి తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమై ఆనం వివేకా వెళ్లినా.. సీఎం అపాయింట్‌మెంట్‌ మాత్రం దొరకలేదు. ఇది ఆనం బ్రదర్స్‌ మధ్య మనస్పర్ధలకు దారి తీసింది. ఎమ్మెల్సీ పదవి కోసం ఆనం సోదరులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవకాశం దక్కలేదు.

అయితే తరువాత సీఎం చంద్రబాబునాయుడు ఆనం బ్రదర్స్ ను బుజ్జగించారు. గవర్నర్‌ కోటాలో వివేకాకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే ఆనం బ్రదర్స్‌ టీడీపీలో చేరి 18 నెలలు గడుస్తున్నా పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కడం లేదు. పార్టీ, అధికారిక కార్యక్రమాలకు కనీసం వివేకాకు ఆహ్వానమే అందడం లేదు. ఇదే అంశాన్ని వివేకా పలు సందర్భాల్లో మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. ఇక అలాంటివి జరగవని నారాయణ భరోసా ఇచ్చారు. అయితే ఆ తరువాత ఆయన కూడా ఆనం సోదరులను విస్మరిస్తూ వచ్చారు.

నగరంలో మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌, వివేకాల మధ్య వివాదాలు సాగినప్పుడు మేయర్‌తోపాటు మంత్రి నారాయణ వివేకా ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. అందరూ కలిసి సమన్వయంతో నడవాలని మంత్రి నారాయణ సూచించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన కేబినెట్‌ విస్తరణలో సోమిరెడ్డికి మంత్రి పదవి దక్కింది. ఆ తరువాత ఆయన రామనారాయణరెడ్డి, వివేకాలు కలిసి చర్చలు జరిపారు. కాని సోమిరెడ్డి ఆత్మీయ సమావేశానికి ఆనం సోదరులు హాజరు కాలేదు.

ఈ నేపథ్యంలో గత నెలలో వీఆర్సీ కళాశాల ఆవరణలో మున్సిపల్‌ జూనియర్‌ కళాశాల ప్రారంభోత్సవం కార్యక్రమానికి మంత్రి నారాయణ విచ్చేశారు. సొంత కాలేజీ ఆవరణలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి కనీసం ఆనం బ్రదర్స్‌కు ఆహ్వానం లేకపోవడం చర్చనీయాంశమైంది. ఇదేకాదు.. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందకపోవడం.. ఒక వేళ వచ్చినా గుర్తింపు ఇవ్వకపోవడం వంటివి జరిగాయి.

ఇది అవమానంగా భావించిన ఆనం వివేకా నెల్లూరులో ఇమడ లేక మూడు నెలల క్రితం తన మాకాంను హైదరాబాద్‌కు మార్చారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ లోనే ఉంటున్నారు. రామనారాయణరెడ్డి మాత్రం ఆత్మకూరుకే పరిమితమయ్యారు. పార్టీలో చేరినప్పుడు ఒకలా.. తీరా చేరిన తరువాత మరోలా వ్యవహరిస్తుండడంతో ఆనం సోదరులు ఇద్దరు తెలుగుదేశం పార్టీలో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తూనే ఉన్నారు. మరోవైపు ఆ పార్టీ జిల్లా నేతలు కూడా వారి పట్ల అదే రీతిలో వ్యవహరించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

గవర్నర్‌ కోటాలో రెండు ఎమ్మెల్సీలు భర్తీ చేయాల్సి ఉంది. సీఎం ఇచ్చిన హామీ మేరకు ఆనం బ్రదర్స్‌లో ఒకరికి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాల్సి ఉన్నా అది చేజారినట్లుగానే తేలిపోయింది. కడప జిల్లాకు చెందిన రామసుబ్బారెడ్డి, కర్నూలు జిల్లాకు చెందిన ఎన్‌ఎండీ ఫరూక్‌లకు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఇస్తున్నట్లు టీడీపీ అధిష్ఠానం నిర్ణయించింది. కడప జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి టీడీపీలో చేరడాన్ని రామసుబ్బారెడ్డి వ్యతిరేకిస్తుండడంతో ఆయన్ని బుజ్జగిచేందుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నారు.

ఇక నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ఫరూక్‌కు కూడా ఎమ్మెల్సీ స్థానం ఇస్తున్నట్లు తెలుగుదేశం అధిష్ఠానం ప్రకటించింది. నంద్యాలలో 45వేల ముస్లిం ఓట్లు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆనం బ్రదర్స్‌కు ఇవ్వాల్సిన గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవి చేజారింది. ఇప్పట్లో ఎమ్మెల్సీ కోటా కింద భర్తీ అయ్యే అవకాశం లేకపోవడంతో ఇక ఆనం బ్రదర్స్‌కు ఎమ్మెల్సీ అవకాశం లేనట్లుగానే తేలిపోవడంతో వారి అనుచరులు సైతం డీలా పడ్డారు.

తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడంతో అలిగిన నెల్లూరు నుంచి హైదరాబా‌ద్‌కు మకాం మార్చిన ఆనం వివేకానంద రెడ్డి తన మనసులోని భావాలను తన అనుచరుల వద్ద వ్యక్త పరుస్తున్నారు. ‘టీడీపీలో చేరి తప్పు చేశాం బ్రదర్.. ఒకరకంగా మోసపోయాం. ఎన్ని అవమానాలను భరిస్తాం..? రాజకీయాల్లో ఎప్పుడూ ఇలా జరగలేదు.. ఎవరెవరికో పదవులు ఇస్తున్నారు..' అంటూ వివేకా వేదాంత ధోరణిలో తన సన్నిహితుల వద్ద వాపోతున్నారు.

తన భవిష్యత్‌ కాలాన్ని దేవుడే నిర్ణయిస్తాడని పేర్కొంటూ ఇప్పట్లో తాను నెల్లూరుకు రాలేనని, విలువ లేని చోటకు వచ్చి మనసు బాధ పెట్టుకోవడం తనకు నచ్చదని ఆయన వెల్లడిస్తున్నట్లు సమాచారం. నెల్లూరులో టీడీపీ బలోపేతానికి ఆనం బ్రదర్స్‌ సహాయ సహకారాలు అందిస్తారని తొలుత వారి చేరిక సమయంలో భావించినా.. ఆ తరువాత వారిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో జిల్లా టీడీపీ నేతలు విఫలమవడంపై ఆనం బ్రదర్స్‌ మనస్తాపంతో ఉన్నట్లు సమాచారం. దీంతో తన సోదరుడి విషయమై సీఎం చంద్రబాబును కలిసి వివరించేందుకు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శతవిధాల ప్రయత్నిస్తున్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top