పొదుపు ఖాతాల్లో కనీస నిల్వల చార్జీలను తగ్గించిన SBI

కనీస నిల్వలపై ఛార్జీల పేరుతో రూ.వేల కోట్ల ఆదాయాన్ని గడిస్తోందంటూ విమర్శలు
ప్రస్తుతం నెలకు రూ.40 -రూ.50 వసూలు
ఏప్రిల్‌ 1, 2018 నుండి రూ. 10 - రూ. 15 వరకు తగ్గించింది.
కనీస నిల్వలు ఛార్జీలను 75శాతం వరకు తగ్గించింది.

దిల్లీ: ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఖాతాదారులకు శుభవార్త. పొదుపు ఖాతాల్లో కనీస నిల్వలు లేకపోతే వసూలుచేసే ఛార్జీలను 75శాతం వరకు తగ్గించింది.

ప్రస్తుతం మెట్రో, అర్బన్‌ కేంద్రాల్లోని ఎస్‌బీఐ పొదుపు ఖాతాల్లో కనీస నిల్వలు లేని ఖాతాదారుల నుంచి నెలకు రూ. 50(జీఎస్‌టీ కాకుండా) చొప్పున, సెమీ- అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల్లోని ఖాతాదారుల నుంచి నెలకు రూ. 40(జీఎస్‌టీ కాకుండా) వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఛార్జీలను 75శాతం వరకు తగ్గించింది.

దీని ప్రకారం.. ఇకపై మెట్రో, అర్బన్‌ కేంద్రాల్లోని పొదుపు ఖాతాల్లో కనీస నిల్వలు లేకపోతే రూ. 15(జీఎస్‌టీ కాకుండా) చొప్పున, సెమీ-అర్బన్‌ అయితే రూ. 12(జీఎస్‌టీ కాకుండా), గ్రామీణ ప్రాంతాల్లోని ఖాతాలకైతే రూ. 10(జీఎస్‌టీ లేకుండా) చొప్పున వసూలు చేయనున్నట్లు ఎస్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. సవరించిన ఛార్జీలు ఏప్రిల్‌ 1, 2018 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది.

కనీస నిల్వలపై ఛార్జీల పేరుతో ఎస్‌బీఐ రూ.వేల కోట్ల ఆదాయాన్ని గడిస్తోందంటూ ఇటీవల విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఆ బ్యాంకు ఛార్జీల ద్వారా కేవలం ఎనిమిది నెలల్లోనే రూ. 1,771 కోట్లు గడించిందని కొందరు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఛార్జీలను తగ్గిస్తూ ఎస్‌బీఐ తాజాగా నిర్ణయం తీసుకుంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top