పోరాడి సాధించుకున్న తెలంగాణలో కొలువులను కొట్లాడి సాదిదం

హైదరాబాద్‌: పోరాడి సాధించుకున్న తెలంగాణలో కొలువులను కొట్లాడి సాధించుకుందామని పలువురు వక్తలు అన్నారు. ఉద్యోగాలొస్తాయో రావో అనే మీమాంసలో నిరాశానిస్పృహలతో యువత కొట్టుమిట్టాడుతోందన్నారు. యువత అధైర్యపడి ఆత్మబలిదానాలు చేసుకోవద్దని ‘కొలువులకై కొట్లాట’ బహిరంగ సభలో వక్తలు విజ్ఞప్తిచేశారు. తెలంగాణ ఏర్పడి మూడేళ్లు గడిచినా నేటికీ ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన ప్రకటనను ప్రభుత్వం జారీ చేయడం లేదనీ, నియామకాలపై మాట్లాడితే అణిచివేతకు పాల్పడుతోందని విమర్శించారు. కేసీఆర్‌ సర్కారును గద్దె దించేవరకూ యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తెఐకాస ఆధ్వర్యంలో సరూర్‌నగర్‌ మైదానంలో సోమవారం నిర్వహించిన బహిరంగసభలో కాంగ్రెస్‌, తెదేపా, భాజపా, సీపీఐ, సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ, ఆప్‌, తదితర రాజకీయ పార్టీల నేతలతో పాటు పలు ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు, మేధావులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి.. మంతుల్రకే దొరకడు: కోదండరాం

‘‘హైకోర్టు అనుమతించినా సభ నిర్వహణకు అనేక అడ్డంకులు సృష్టించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టులు చేశారు. సభకు రాకుండా 15వేల మందికి పైగా యువతను అడ్డుకున్నారు. వీళ్లు(నిరుద్యోగులు) మణులడిగారా? మాన్యాలడిగారా? మా కొలువులు మాకిమ్మని అడిగారు. నిరుద్యోగాల్లో విశ్వాసం కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. అధికారంలోకి వచ్చాక గుత్తేదార్లపై చూపిన మోజు ప్రజాసమస్యలపై చూపడంలేదు. ముఖ్యమంత్రి.. మంత్రులకే దొరకడు. సచివాలయానికే రాడు. ఇసుక అక్రమ రవాణా, గుత్తేదార్ల కమీషన్లు.. ఇవే వారి ప్రాధాన్యం. తెలంగాణ వచ్చింది నీ ఇసుక కోసమా? నీకమీషన్ల కోసమా? ప్రజల సమస్యల పరిష్కారానికి కచ్చితంగా నిలదీస్తాం. అరెస్టులు చేసినా వెనక్కు తిరిగేది లేదు. లక్ష్యాన్ని సాధించే వరకూ మడమ తిప్పేదిలేదు’’ అని కోదండరాం అన్నారు.

కేసీఆర్‌ కళ్లు తెరవాలి: జీవన్‌రెడ్డి

సభకు వచ్చిన నిరుద్యోగ యువతను చూశాకైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కళ్లు తెరవాలని కాంగ్రెస్‌ శాసనసభ పక్ష ఉపనేత జీవన్‌రెడ్డి అన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా నియామక ప్రక్రియ చేపట్టకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు కేసీఆర్‌కు ఉండదన్నారు. తెదేపా తెలంగాణ రాష్ట్రాధ్యక్షుడు ఎల్‌.రమణ మాట్లాడుతూ కేసీఆర్‌ దగాకోరు పాలనకు చరమగీతం పాడే శక్తి విద్యార్థి లోకానికే ఉందన్నారు. భాజపా ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మాట్లాడుతూ నిరుద్యోగ యువత హక్కులపై తెలంగాణ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ పార్టీ జెండాలు పక్కనబెట్టి కేసీఆర్‌ను రాజకీయ నిరుద్యోగిగా చేయడమే ప్రధాన అజెండాగా పనిచేయాలన్నారు. పౌరహక్కుల నేత ఆచార్య హరగోపాల్‌ మాట్లాడుతూ నిర్బంధంపై పాలన నడవదనే విషయాన్ని సదస్సు ద్వారానైనా ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నారు. సభలో ప్రజాగాయకుడు గద్దర్‌, చుక్కా రామయ్య, ఆచార్య నాగేశ్వర్‌, విమలక్క ప్రసంగించారు. సభ డిమాండ్లు: ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి.

* ఉద్యోగాల భర్తీకి కాలమానిని విడుదల చేయాలి.

* స్థానిక పరిశ్రమల్లో తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలివ్వాలి.

* ఒప్పంద, పొరుగుసేవల విధానాన్ని కొనసాగించొద్దు. సుప్రీంకోర్టు తీర్పుననుసరించి సమాన పనికి సమాన వేతనాన్ని వీరికి వర్తింపజేయాలి.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top