మేడారం జాతరకు గవర్నర్‌ ఆహ్వానం

హైదరాబాద్‌: పల్లెసీమల ప్రగతే లక్ష్యంగా కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్ని తేనున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌కు తెలిపారు. పంచాయతీరాజ్‌ చట్టం రూపకల్పన కోసం మంత్రివర్గ ఉపసంఘం వేశామని, దాని నివేదిక వచ్చిన వెంటనే ముసాయిదా సిద్ధం చేస్తామని, శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లును ఆమోదిస్తామని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ సరఫరా ఇవ్వడంపై రైతుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని వెల్లడించారు. శుక్రవారం రాత్రి రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సీఎం భేటీ అయ్యారు. దాదాపు మూడు గంటల పాటు వీరి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పరిణామాలను ముఖ్యమంత్రి ఆయనకు వివరించారు. ‘‘రాష్ట్రంలో ప్రస్తుత పంచాయతీ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉండడం వల్ల కొత్త చట్టం తెస్తున్నామని వివరించారు. ఆ చట్టంతోనే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. వచ్చే బడ్జెట్‌ సమావేశాల కంటే ముందే శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి చట్టం చేస్తామన్నారు. రైతులకు మరింత ఊతమిచ్చేందుకు వీలుగా నిరంతర విద్యుత్‌ పంపిణీకి నిర్ణయం తీసుకున్నామని, దీనిపై రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోందని కేసీఆర్‌ చెప్పారు. హైకోర్టు విభజన ప్రక్రియకు అన్ని విధాల సహకరిస్తామని తెలిపారు. కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్‌ భగీరథ పనులు, ఇతర అంశాలను సీఎం గవర్నర్‌కు వివరించారు.

మేడారం జాతరకు ఆహ్వానం

ఈనెల 31న మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతరకు హాజరు కావాలని సీఎం కేసీఆర్‌ గవర్నర్‌ను కోరారు. ఆసియాలోనే ఇది అతిపెద్ద జాతర అని, దీనిని భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

గవర్నర్ల వ్యవస్థలో సంస్కరణలపై చర్చ

గవర్నర్‌ దిల్లీ పర్యటన, గవర్నర్ల వ్యవస్థలో సంస్కరణలపై రూపొందించిన నివేదికల గురించి వారు చర్చించారు. విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ వైఖరిని గవర్నర్‌ తెలిపారు. గవర్నర్ల వ్యవస్థలో సంస్కరణల తీరును వివరించినట్లు తెలిసింది. వాటిని కేసీఆర్‌ స్వాగతించారు. హైకోర్టు సత్వర విభజన. తెలంగాణలో ఏపీకి కేటాయించిన భవనాల అప్పగింత, తొమ్మిదో, పదో షెడ్యూలు సంస్థల విభజన ఇతర అంశాల గురించి ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు.

సీఎం సంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో ఈ పండుగ కొత్త కాంతులు నింపాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. తెలంగాణ భూముల్లో బంగారు పంటలు పండటానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతంగా ముందుకుసాగాలని ఆయన ఆకాంక్షించారు.

ఇస్రో శాస్తవేత్తలకు గవర్నర్‌, సీఎంల అభినందనలు

ఇస్రో వందో ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడంపై శాస్త్రవేత్తలను గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు అభినందించారు. శాస్త్రవేత్తల ఘనత దేశానికే గర్వకారణమని అన్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top