ఎనిమిదోసారి తెరాస అధ్యక్షుడిగా కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు వరుసగా ఎనిమిదో సారి ఎన్నికయ్యారు. ఆయనను తెరాస నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ వివరాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాయిని నర్సింహా రెడ్డి శుక్రవారం ప్రకటించారు. అందరూ కేసీఆర్‌ నాయకత్వమే కావాలని కోరుకున్నారని, అందుకే ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు.

ఇదిలా ఉండగా, తెరాస 16వ ప్లీనరీకి రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని కొంపల్లిలో తెలంగాణ ప్రగతి ప్రాంగణం పేరిట ఈ రోజు (శుక్రవారం) దీనిని పెద్దఎత్తున నిర్వహించేందుకు అధికార పార్టీ ఏర్పాట్లు చేసింది.

తెరాస అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మూడో ప్లీనరీ ఇది. రాష్ట్రంలో పలు రాజకీయ పరిణామాల నడుమ, ఎన్నికలకు మరో రెండేళ్ల గడువుండనగా జరుగుతున్న ఈ ప్లీనరీకి పార్టీ ఎంతో ప్రాధాన్యమిస్తోంది.

మూడేళ్ల పాలనను సమీక్షించడంతోపాటు, వచ్చే రెండేళ్ల కార్యాచరణను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్లీనరీ ప్రాంగణంలో ప్రకటిస్తారు. వచ్చే ఎన్నికలకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు దీనిని వేదికగా ఉపయోగించుకోనున్నారు

.

మొదట్లో ప్లీనరీ, తెరాస ఆవిర్భావ దినోత్సవాలు ఒకేరోజు జరిగేవి. పార్టీ కార్యక్రమాల విస్తృతిలో భాగంగా ప్లీనరీ, సభను విడివిడిగా జరుపుతున్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న వరంగల్‌లో భారీ బహిరంగ సభ ఉంటుంది. దానికి సన్నాహకంగా ప్లీనరీని విజయవంతంగా నిర్వహించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది.

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు, నగరపాలక సంస్థల ఛైర్మన్లు, పురపాలక ఛైర్మన్లు, నియమిత పదవుల్లో ఉన్నవారు, జడ్పీటీసీలు, ఎంపీపీలు సహా ఇతర నేతలంతా కలిసి ప్లీనరీకి మొత్తం 16వేల మందిని ఆహ్వానించారు. 16 కమిటీలను నియమించారు. మంత్రి కేటీఆర్‌కు ప్లీనరీ ప్రధాన బాధ్యతలను సీఎం అప్పగించారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top