సాంకేతిక విజ్ఞానాన్ని వాడుకొని ప్రజలకు భద్రత

కరీంనగర్‌: మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు భద్రత కల్పించడంలో కరీంనగర్‌ కమిషనరేట్‌ పోలీసులు తమదైన శైలి చూపుతున్నారు. నిర్బంధ తనిఖీలు... డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లు నిరంతరం చేపడుతూనే నగర శివార్లలో ఎవరైనా నిర్భయంగా సంచరించేందుకు వీలుగా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఉదయపు నడక... సాయంత్రం వ్యాహాళికి వెళ్లేవారు క్షేమంగా తిరిగొస్తామనే ధీమా కల్పిస్తున్నారు. అసాంఘిక శక్తులకు ఆకాశ నేత్రం (డ్రోన్‌ కెమెరా)తో అడ్డుకట్ట వేస్తున్నారు.

మానేరు చుట్టూ.. నిరంతరం: కరీంనగర్‌లో 3.50 లక్షల పైచిలుకు ప్రజల ఆహ్లాదానికి ఉన్న ఏకైక వనరు దిగువ మానేరు జలాశయం (ఎల్‌ఎండీ). 10.743 కిలోమీటర్ల పొడవైన డ్యామ్‌ కట్టపై ఉదయపు నడకకు ప్రతి రోజు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. పక్కనే రెండు ఉద్యానవనాలు... డ్యామ్‌లో బోటింగ్‌ అవకాశం ఉండడంతో కుటుంబ సభ్యులు, మిత్రులతో ఉల్లాసంగా గడిపేందుకు సాయంత్రం వేళల్లో ఇక్కడికే చేరుకుంటారు. ఇటువంటి ప్రదేశంలో భద్రత అంతంతమాత్రమే. ఇక్కడకు వచ్చిన మహిళలు, విద్యార్థినులను ఆకతాయిలు వేధించడం పరిపాటిగా మారింది. చీకటి పడితే వీరి ఆగడాలకు అంతే ఉండదు. మహిళలు, విద్యార్థినులపై అత్యాచారాలకు పాల్పడిన ఘటనలు గతంలో నెలకొన్నాయి. సమస్య పరిష్కారానికి ఇటీవల లేక్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేసి భద్రతను పెంచారు. పోలీసుల గస్తీ సమయంలో పక్కకు తప్పుకొంటున్న ఆకతాయిలు రెచ్చిపోతుండడంతో ఆకాశ నేత్రం (డ్రోన్‌) ఉపయోగిస్తున్నారు. నిర్బంధ తనిఖీల సమయంలోనూ డ్రోన్‌ను వినియోగిస్తున్నారు.

పరుగో... పరుగు: డ్యామ్‌ పరిసరాల్లో చెట్ల పొదల్లో, సమీపంలోని ఖాళీ ప్రదేశాల్లో మద్యం తాగేవారిని.. పేకాట బృందాలను డ్రోన్‌ కెమెరాతో గుర్తిస్తున్నారు. నిర్ణీత సమయమంటూ లేకుండా డ్రోన్‌తో పది కిలోమీటర్ల మేర ఫొటోలు తీస్తున్నారు. గత 60 రోజులుగా డ్రోన్‌తో ఫొటోలు తీస్తున్న ఘటనలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ 255 మంది పట్టుపడ్డారు. దీంతో డ్రోన్‌ కనిపించగానే పేకాట రాయుళ్లు పరుగులు పెడుతున్నారు. వారందరిపై కేసులు నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం డ్రోన్‌లను స్వచ్ఛభారత్‌కు అనుకూలంగా వినియోగిస్తున్నారు. డ్యామ్‌ పరిసరాలను బహిర్భుమిగా ఎవరూ ఉపయోగించకుండా చూస్తున్నారు.

వ్యూహాత్మకంగా నిఘా...

- కమలాసన్‌రెడ్డి, కమిషనర్‌, కరీంనగర్‌ కమిషనరేట్‌

ఆకర్షణీయ నగరంగా ఎంపికైన కరీంనగర్‌ను నేరరహితంగా తీర్చిదిద్దాలనుకున్నాం... నగరానికి పక్కనే ఉన్న ఎల్‌ఎండీ పరిధి ఎక్కువగా ఉండడం.. అక్కడకు వెళ్లే వారు ఎటువంటి భయాలకు గురికాకూడదనే భావనతో డ్రోన్‌ కెమెరాను ఎంచుకున్నాం. అసాంఘిక కార్యక్రమాలపై సమాచారం వచ్చినా మా సిబ్బంది వెళ్లే సరికి వారు పారిపోతున్నారు. ఈ క్రమంలో డ్రోన్‌ వినియోగిస్తుండడంతో వారు పట్టుబడుతున్నారు. భవిష్యత్తులో ఇసుక అక్రమ రవాణా, వాహన రద్దీలను గుర్తించి వాటిని అరికడతాం.. డ్రోన్‌లను గతంలో తీవ్రవాద కార్యక్రమాలకు వినియోగించేవారు. ఈ విధంగా వినియోగించడం ఇక్కడే ప్రథమం.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top