కల్యాణ్ రామ్ మాట!..నందమూరి ఫ్యామిలీ బాబు వెంటే!

తెలుగు దేశం పార్టీ... తెలుగు ప్రజల మదిలో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్న మహా నటుడు దివంగత నేత నందమూరి తారకరామారావు స్థాపించిన పార్టీ. తెలుగు ప్రజల ఆరాధ్య నటుడిగా ముద్ర వేసుకున్న ఎన్టీఆర్... తెలుగు ప్రజల ఆత్మ గౌరవం పేరిట పార్టీ పెట్టగానే.. చాలా మంది రాజకీయ నేతలతో పాటు వివిధ రంగాల్లో తమదైన శైలిలో దూసుకుపోతున్న కొత్త నేతలు కూడా టీడీపీలో చేరిపోయారు. వెరసి దేశ రాజకీయ చరిత్రను తిరగరాస్తూ స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారాన్ని చేజిక్కించుకున్న పార్టీగా టీడీపీకి ఎన్టీఆర్ గొప్ప కీర్తి ప్రతిష్ఠలను తెచ్చి పెట్టారు. అయితే కాలక్రమంలో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి... ఆయన చేతిలోని అధికారంతో పాటుగా పార్టీని కూడా లాగేసుకున్న ఆయన అల్లుడు ప్రస్తుత పార్టీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... ఎన్టీఆర్ మరణానికి కూడా కారకులయ్యారన్న వాదన లేకపోలేదు. చంద్రబాబు నుంచి ఎదురైన వెన్నుపోటు కారణంగా తీవ్ర మానసిక క్షోభకు గురైన ఎన్టీఆర్... చివరకు అదే బాధతో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

అయినా ఇప్పుడు ఎన్టీఆర్ ప్రస్తావన ఎందుకంటే... అటు రాజకీయాల్లో అయినా ఇటు సినిమా రంగంలో అయినా నందమూరి ఫ్యామిలీకి ఈ మేర పేరుందంటే ఆ మహానీయుడి చలవేనని చెప్పక తప్పదు. ఇప్పుడు టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీకి మంచి స్థానమే ఉందని చెప్పాలి. ఎన్టీఆర్ కుమారుడిగా నందమూరి బాలకృష్ణ సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్రను ఏర్పాటు చేసుకున్నా... నందమూరి వారసులుగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కల్యాణ్ రామ్లు ఇప్పుడు మంచి జోష్ మీదే ఉన్నారు. అచ్చుగుద్దినట్లు ఎన్టీఆర్లాగే కనిపించే జూనియర్ ఎన్టీఆర్ను చూస్తే... తమ ఆరాధ్య నటుడిని చూసినట్లేనన్న భావన తెలుగు ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో నందమూరి ఫ్యామిలీకి అసలు సిసలు వారసుడు జూనియరేనని కొందరు వాదిస్తున్న వైనం కూడా మనకు తెలియనిదేమీ కాదు. అయితే అటు నందమూరి ఫ్యామిలీతో పాటు ఇటు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీతోనూ అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్... గతంలో టీడీపీ తరఫున ప్రచార బరిలోకి కూడా దిగిన సంగతి తెలిసిందే.

మరి వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఏమిటి? అన్న విషయినికి వస్తే... నందమూరి ఫ్యామిలీ ఏ మేరకు టీడీపీకి సహకరిస్తుందోనన్న అనుమానాలు రేకెత్తే పరిస్థితి. ఇలాంటి కీలక తరుణంలో నందమూరి ఫ్యామిలీకి చెందిన కల్యాణ్ రామ్ నేటి ఉదయం తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకున్న సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏది జరిగినా భవిష్యత్తులో ఏం జరగబోతున్నా... నందమూరి ఫ్యామిలీ మొత్తం చంద్రబాబు వెంటే ఉంటుందని కల్యాణ్ ప్రకటించారు. అంతేకాకుండా అవసరమైతే వచ్చే ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు తాను కూడా టీడీపీ తరఫున ప్రచారం నిర్వహిస్తామని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనేది తనకు లేదని తనతో పాటుగా జూనియర్ ఎన్టీఆర్ కూడా సినిమాలతో బిజీగా ఉన్నామని తెలిపారు. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు భయపడాల్సిందేమీ లేదని పేర్కొన్నట్లుగా కల్యాణ్ రామ్ ఆససక్తికర ప్రకటన చేశారనే వాదన వినిపిస్తోంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top