రాష్ట్రానికి న్యాయం జరిగేలా అందరితో కలిసి సాయం చేస్తా :జయప్రకాష్ నారాయణ

హడావుడి ప్రకటనలు, తాత్కాలిక ఆర్భాటమే తప్ప అంతిమంగా ఏ ఫలితం వస్తుందనే విషయానికి మనదేశంలో అంతగా ప్రాధాన్యం ఉండదని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ వ్యాఖ్యానించారు. ఆర్భాటాలు చేయకుండా ప్రజలకు ఏం చేశామనేదే ముఖ్యమన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి రావలసిన నిధులు, ప్రత్యేక హోదా తదితర అంశాలపై ఇప్పటికే నాలుగేళ్లు ఆలస్యం చేశామన్నారు. రాష్ట్రానికి న్యాయం జరిగేలా అందరితో కలిసి ఉడత సాయం చేస్తామని తెలిపారు. కేంద్రం నుంచి ఏపీకి వచ్చిన నిధులపై నిజానిజాలు తేల్చేందుకు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రతిపాదించిన జాయింట్‌ ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ(జేఎఫ్ఎఫ్ సీ)పై జేపీ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ తదితరులు సోమవారమిక్కడ బేగంపేటలోని జేపీ కార్యాలయంలో చర్చించారు.

అనంతరం జేపీ విలేకరులతో మా ట్లాడారు. తమకెవరికీ అధికారం లేదని, బలం కూడా లేదని.. కేవలం రాష్ట్రానికి న్యాయం చేయాలనే చిత్తశుద్ధి మాత్రమే ఉందన్నారు. ఉండవల్లి మాట్లాడుతూ... కమిటీలో ఎవరెవరిని కలుపుకోవాలనే విషయంపై చర్చించామని తెలిపారు. కేంద్రం ఎంత ఇచ్చింది.. హామీ ఇచ్చింది ఎంత అనే వాటిపై నిపుణులతో చర్చిస్తామన్నారు. 2-3 గంటలు కూర్చుంటే సరిపోతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అంశాలపైనా చర్చిస్తామన్నారు. ఉండవల్లిది ధృతరాష్ట్ర కౌగిలి అని, పవన్‌ అందులో చిక్కుకుంటున్నారని మంత్రి జవహర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.

‘ధృతరాష్ట్ర కౌగిలి నుంచి కాపాడేందుకు పవన్‌ పక్కన ఎవడో ఒకడు శ్రీకృష్ణుడు ఉంటాడు’ అని వ్యాఖ్యానించారు. సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ... రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలపై ఉండవల్లి, జేపీ చాలా వివరాలు సేకరించారని తెలిపారు. ప్రత్యేక హోదా సాధన సమితి పేరుతో సీపీఐ మూడేళ్లుగా పోరాడుతోందన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఒకే అభిప్రాయంతో ఉన్నారనే సంకేతాన్ని ఇటీవల బంద్‌ ద్వారా కేంద్రానికి ఇచ్చామని చెప్పారు. అన్ని పార్టీల ఎంపీలు, విద్యార్థి, యువజన సంఘాలు, మేధావులతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top