దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా జహంగీర్‌ పీర్‌ దర్గాను అభివృద్ధి

హైదరాబాద్‌: దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా జహంగీర్‌ పీర్‌ దర్గాను అభివృద్ధి చేస్తామని. ఇందు కోసం రూ.50 కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. సుమారు 100 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించి దర్గాకు ఇస్తామన్నారు. హైదరాబాద్‌ శివారు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వ గ్రామంలోని జహంగీర్‌ పీర్‌ దర్గాలో శుక్రవారం సీఎం కేసీఆర్‌ ఛాదర్‌ సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ దర్గాకు వస్తానని గతంలో సీఎం మొక్కుకున్నారు. ఈ నేపథ్యంలో దర్గాకు వచ్చిన ముఖ్యమంత్రికి పలువురు మంత్రులు, దర్గా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఛాదర్‌ను తలపై పెట్టుకొని దర్గాలోకి వెళ్లిన కేసీఆర్‌ అక్కడ కొద్దిసేపు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆ తరువాత సమీపంలో ఏర్పాటు చేసిన సమావేశ స్థలానికి చేరుకున్నారు. ఇక్కడ మంత్రివర్గ సహచరులు, మత పెద్దలు, స్థానిక నాయకులతో కలసి భోజనం చేశారు.

మంత్రులు, జిల్లాకు చెందిన ముఖ్య ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, వక్ఫ్‌ బోర్డు అధికారులు, దర్గా ప్రతినిధులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దర్గాకు 100 ఎకరాల మేర స్థలం సమకూర్చాలని ఇందులో నిర్ణయించారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా స్థల సేకరణ జరిగేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై సమీక్షించారు. దర్గా సమీపంలో ఉన్న దుకాణాలు తొలగించకుండా అభివృద్ధి జరిగేందుకు ఉన్న అవకాశాలపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిసింది. దేశం నలుమూలల నుంచి ఈ దర్గాను సందర్శించేందుకు పర్యాటకులు, భక్తులు వచ్చేలా అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, ఉపసభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్‌, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.

షాద్‌నగర్‌కు వరాలు..

స్థానిక షాద్‌నగర్‌ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్‌ కొద్ది సేపు విడిగా మాట్లాడారు. నియోజకవర్గానికి పలు వరాలు ప్రకటించారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి పంచాయతీకి రూ.10 లక్షలు, శివారు గ్రామాలకు, తండాలకు రూ.5 లక్షలు చొప్పున కేటాయిస్తామని.. ఇందుకు సంబంధించి సోమవారం నాటికి ఉత్తర్వులు వెలువడతాయని సీఎం పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా షాద్‌నగర్‌ నియోజకవర్గాన్ని సశ్యశ్యామలం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ ఎత్తిపోతల ద్వారా 20 లక్షల ఎకరాలకు నీరిందిస్తామని కొందర్గు మండలంలో సుమారు 670 మీటర్ల ఎత్తులో రిజర్వాయర్‌ నిర్మిస్తామన్నారు. ముంపు తక్కువగా ఉండేలా చూస్తామని చెప్పారు. పాలమూరు పథకం పనులు ఆమూలాగ్రం పరిశీలించేందుకు తాను త్వరలోనే పర్యటిస్తానని సీఎం తెలిపారు. కొత్తూరు మండలంలో అనేక పరిశ్రమలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మంత్రి ఇంద్రకరణ్‌ కాన్వాయ్‌ వాహనం ఢీకొని కానిస్టేబుల్‌కు గాయాలు

కొత్తూరు, న్యూస్‌టుడే: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కాన్వాయ్‌లోని ఓ కారు ఢీకొని కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌ యూసుఫ్‌గూడ ఠాణాకు చెందిన కానిస్టేబుల్‌ రవికుమార్‌ శుక్రవారం జహంగీర్‌ పీర్‌ దర్గా వద్ద సీఎం పర్యటన బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో మంత్రి కాన్వాయ్‌లోని ఓ కారును రివర్స్‌ తీస్తుండగా.. అది బారీకేడ్‌ను ఢీకొట్టి.. పక్కనే ఉన్న రవికుమార్‌ను ఢీకొట్టింది. రవికుమార్‌ ఛాతీ భాగంలో బలమైన గాయాలవడంతో తొలుత షాద్‌నగర్‌ ఆసుపత్రికి తర్వాత హైదరాబాద్‌కు తరలించారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top